సందీప్ కిషన్....'కేరాఫ్ సూర్య' రివ్యూ
పాత కథలో కొత్త ట్విస్ట్ (C/o సూర్య రివ్యూ )
అప్పట్లో... తన భర్త ప్రాణం కోసం యముడుతో పోరాటం చేసిన సతీ సావిత్రి కథ విన్నాం. రోజులు మారాయి..భర్తల కోసం, భార్యల కోసం ఎవరూ ఎవరితోనూ పెట్టుకోవటం లేదు..తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి ఇష్టపడటం లేదు..అవసరమైతే యముడుకి లంచం ఇచ్చి ఇంకొంచెం ముందు తీసుకువెల్లిపో..నేను ప్రపంచం కోసం ఆ కాసేపు నా భర్త ప్రాణాలు తిరిగి ఇమ్మని నీ వెంటపడతాను అన్నట్లుగా డ్రామా ఆడతాను...అనే పరిస్దితులు వచ్చేసాయి. అయితే మరి ఇప్పుడు మనుష్యులు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ..స్నేహానికి అంటున్నాడు దర్శకుడు సుశీంధ్రన్. తన ప్రాణ మిత్రుడు కోసం తన ప్రాణాన్ని రిస్క్ లోకి పెట్టుకునే ఓ కుర్రాడి కథతో ఈ వారం మనల్ని పలకరించాడీ తమిళ దర్శకుడు. ఆ కథని తెరపై చెప్పటానికి సందీప్ కిషన్ ని ఎంచుకున్నాడు. సుసుంద్రీన్ అంటే గుర్తు వచ్చినా...నా పేరు శివ డైరక్టర్.
గత కొంతకాలంగా సందీప్ కిషన్ కు హిట్ ఆమడ దూరంలో ఉండిపోతోంది. ఎంత పెద్ద డైరక్టర్ తో సినిమా చేసినా పరాజయం పలకరించేస్తోంది. అప్పటికీ తన తోటి హీరోలు మాదిరిగా కాకుండా ఒక సినిమాకూ, మరో సినిమాకు సాధ్యమైనంత విభిన్నత చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు అయినా ఫలితం ఉండటం లేదు. తాజాగా మరోసారి ఈ తమిళ దర్శకుడుతో కలిసి ఓ థ్రిల్లర్ చేసాడు. ఈ సినిమా అయినా అతని కి హిట్ ఇస్తుందా.. తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైన ఈ సినిమా కథేంటి? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
ఫ్రెండ్షిప్ కు పరీక్ష పెట్టే ట్విస్ట్ తో కథ
కేటరింగ్ సర్వీస్ నడిపే సూర్య(సందీప్ కిషన్) కు ప్రాణ స్నేహితుడు మహేష్(విక్రాంత్). తన ఫ్రెండ్ మీద ఈగ వాలినా కూడా సహించలేని సూర్య అతనికి కేరాఫ్ ఎడ్రస్ గా మారతాడు. అయితే ఇక్కడో ట్విస్ట్. సూర్యకో చెల్లెలు ఉంటుంది. డాక్టర్ చదువుకుంటున్న ఆమె తో ఆల్రెడీ ప్రేమలో ఉంటాడు మహేష్. ఆమె కూడా మహేష్ నే పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉంటుంది. ఈ విషయాలు సూర్యకు తెలియదు. ఈ లోగా ..సిటీలోని ఓ కిల్లర్ గ్యాంగ్ సాంబశివుడు (హరీశ్ ఉత్తమన్)మహేష్ ని చంపాలని స్కెచ్ వేసి అమలు పరచటానికి సిద్దపడుతుంది. తన స్నేహితుడుని ఎలాగైనా సేవ్ చేద్దామనుకున్న సూర్యకు అనుకోకండా తన చెల్లెలతో ప్రేమ విషయం తెలుస్తుంది. అప్పుడు సూర్య ఏం నిర్ణయం తీసుకుంటారు...తన ఫ్రెండే నమ్మకం ద్రోహం చేసాడని ఫీల్ అవుతాడా... తన స్నేహితుడుని రక్షించటానికి ముందుకు వెళ్తాడా..అసలు ..ఆ కిల్లర్ గ్యాంగ్ ...మహేష్ ని చంపాలనుకోవటానికి కారణం ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ట్విస్ట్ లతో కథకే ట్విస్ట్ ఇచ్చారు
కథగా సినిమా బాగానే ఉంది కానీ... తేలిపోయినట్లు అనిపించింది. వీరిద్దరి స్నేహం గురించి మరింత ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ..విలన్ కు, హీరోకు డైరక్ట్ పోరు..ఎక్కడో సెకండాఫ్ చివరి దాకా ఉండదు. అప్పటిదాకా అసలు విలన్ ఎవరనేది ప్రేక్షకుడుకి తెలుస్తుంది కానీ హీరోకు తెలియదు. అలా కాకుండా ఇంటర్వెల్ కు అయినా విలన్ ఎవరో తెలిసి ఉంటే...కథ కాస్త ఫాస్ట్ గా పరుగెత్తేది. ట్విస్ట్ ల కోసం చూసుకుని కథలో వేగం చంపేసారు. మరీ ముఖ్యంగా కథలో సరిపడనంత డ్రామా రాసుకోలేదు. దాంతో తెరపై సీన్స్ వస్తూంటాయి పోతూంటాయి..కానీ మనకేమీ అనిపించదు.
అలాగే హీరో,హీరోయిన్స్ ప్రేమ కథ సినిమాకు అవసరం లేదనుకున్నట్లున్నారు. దాన్ని సైతం గాలికి వదిలేసారు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అన్నట్లుగా సీన్స్ డిజైన్ చేసారు. ఆమెను కూడా కథలోకి తీసుకుని వస్తే బాగుండేది.
ఇక దర్శకుడు హీరో క్యారక్టరైజేషన్ కన్నా విలన్ మీద ఎక్కవ కాన్సర్టేట్ చేసారు. అందుకే అందుకు సంభందించిన సీన్స్ బాగా పండాయి. అయితే క్లైమాక్స్ మాత్రం చాలా నీరసంగా ఉందనిపించింది. ఓ ఫైట్ తో సరిపెట్టేసారు.
కథలో మరింత డెప్త్, హీరో ప్రెండ్ క్యారక్టర్ తో ఏమన్నా ట్విస్ట్ తీసుకుంటే ఇంకెంచెం బాగుండేదేమో.
మాట్లాడుకోవాల్సిన మ్యాటర్
కేరాఫ్ సూర్య’లో మనల్ని చివరి దాకా కూర్చోపెట్టే ఎలిమెంట్...సినిమాలోని సస్పెన్స్ ఫ్యాక్టర్. విలన్స్ ఎవరు...వారి మోటో ఏమిటి అనేది చివరి వరకు దాచి పెడుతూ కథ నడపడంలో సుశీంద్రన్ విజయవంతమయ్యాడు. దాంతో ఫస్టాఫ్ బోర్ కొట్టినా సెకండాఫ్ ఉత్కంఠగా నడిచింది. సీరియస్ సినిమా కదా..ఫన్ కు ప్రయారిటి ఇవ్వటమెందుకు అనుకున్నారో ఏమో కానీ కామెడీని వదిలేసారు.
తెర వెనక..కష్టం..
ఎప్పటిలాగే సందీప్ కిషన్ ...ప్రక్కింటి కుర్రాడులా చక్కగా చేసాడు. విలన్ గా హరీష్ ఉత్తమన్ కూడా కేక పెట్టించాడు. విక్రాంత్, తులసి, సత్య, ప్రవీణ్ తదితరులు రొటీన్ గా చేసుకుంటూ పోయారు. ఇమాన్ ఇచ్చిన పాటల్లో 'మొదలవుతోందా' మెలోడీయస్‌గా మెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తూ సాగింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ కూడా ఎక్కడా లాగ్ లేకుండా లాగేసాడు కానీ ఇంకొంచెం స్పీడు చేసి ఉంటే ఇంకా బాగుండేది.
అలాగే ...ఈ సొసైటీలో తప్పులు చేయడానికి ధైర్యం అవసరం లేదు. తప్పు చేయకుండా ఉండడానికి ధైర్యం కావాలి', 'రేపు మీకేదైనా ఆరోగ్య సమస్య వస్తే అర్హత లేని మీ కూతురుతో వైద్యం చేయించుకుంటారా?' వంటి కొన్ని డైలాగులు సూటిగా మనలని గుచ్చుకుంటాయి.
ఇదంతా సరేగానీ ..
ఎక్కడో క్లైమాక్స్ లో హీరో చెప్పే చిన్న డైలాగు కోసం...సినిమా ప్రారంభంలో హీరో తండ్రి పాత్రను నిర్దాక్ష్యణంగా లేపేయటం న్యాయమా?
అలాగే క్లైమాక్స్ లో విలన్ ని హీరో ఉడుం పట్టు పడతాడు అని చెప్పటం కోసం ప్రారంభంలో ఓ సీన్ పెట్టి ప్లాంటింగ్ చేయటం ధర్మమా...ఇవి చేయకపోయినా సినిమా కు వచ్చే ఇబ్బంది ఏమి లేదు కదా..
అవును హీరో తల్లి పాత్ర వేసిన తులసి ఎందుకు అంత ఎమోషనల్ బరస్ట్ అయిపోతూంటుంది..మాటి మాటికి..
ఇక హీరో చెల్లెలను చంపితే విలన్ కు 50 కోట్లు వస్తాయని చెప్తూంటారు. అయితే అంత ఎందుకు వస్తుందో, ఎవరు ఎందుకిస్తారో మాత్రం అర్దం కాదు. దీనికి తోడు విలన్ కు పని అప్పచెప్పి.. సుపారి ఇచ్చినవాళ్లు పోలీస్ లకు లొంగిపోతారు. దాంతో వాళ్ల దగ్గర నుంచి రూపాయి రాదు... అని తెలిసినా ఎందుకు హీరో చెల్లి వెనక విలన్స్ పడతారో తెలియదు. ఎందుకంటే అలా పడేందుకు విలన్స్ కు కూడా బోలెడు ఖర్చు అవుతుంది కదా.
ఫైనల్ వర్డ్స్
క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చేవారికి ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది అనిపిస్తుంది. అలాగే సందీప్ కిషన్ కేవలం డైరక్టర్స్ ని ఎంచుకునే విషయంలో మాత్రమే కాక వారు చెప్పే కథల ఎంపికలో సైతం ఇంకాస్త జాగ్రత్త వహించాలని ఈ సినిమా గుర్తు చేస్తుంది.