తీసినోడా..చూసినోడా? ‘ఇంటెలిజెంట్’ (రివ్యూ)
విదేశాల్లో ఉంటూ వీర ప్రతాపంగా, విచ్చలవిడిగా మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ... వరస పెట్టి అన్యాయాలు చేస్తూండే టాలెంట్, నెట్ వర్క్, కోట్ల ఆస్తి కలిగిన ఓ విలన్ ... జేబులో జియో నెట్ వర్క్ తప్పించి..మరేమీ లేని అతి మామూలు హీరోకు అడ్డంగా దొరికిపోతూంటాడు...అదెలా సాధ్యం... అంటే ...హీరో ఇంటిలిజెన్స్...అతనిలో జీన్స్ కారణం అంటాయి మాస్ మసాలా సినిమాలు . అలాంటి సినిమాలకు లోకల్ మార్కెట్ లో ఎప్పుడూ క్రేజే. ముఖ్యంగా బి,సి సెంటర్లకు ఇవి బంగారు బాతు గుడ్లు..చూసేవారికి తొక్కుడు లడ్లు, హిట్ టాక్ వస్తే ఎడ్ల బండ్లు వేసుకుని మరీ జనం వస్తారు అని డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతూంటారు. అలాంటి అనేక నమ్మకాలను కల్పిస్తూ వచ్చిందీ ఇంటిలిజెంట్. ఈ సినిమాకి క్రేజ్ రావటానికి ఇంకో కారణం..మెగా స్టార్ తో చేసిన వివి వినాయిక్ ....కాస్తంత క్రిందకు దిగి ఈ మెగా ఫ్యామిలీ హీరో తో సినిమా చెయ్యటం. అయితే అందరి నమ్మకాలను ఈ సినిమా నిలబెట్టిందా...ఫ్లాఫ్ ల్లో ఉన్న సాయిని ఈ సినిమా ఒడ్డున పడేసిందా, కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం...
స్టోరీ లైన్ ఇదే
చిన్నప్పటి నుంచీ (అతి) తెలివిగా బిహేవ్ చేసే తేజు (సాయి ధరమ్ తేజ్)ని... అతి మంచి వ్యక్తి అయిన నందకిషోర్ (నాజర్) చేరదీస్తాడు. పేదల కోసం నిరంతంరం ఆలోచిస్తూ,పథకాలు అమలు చేస్తూండే ఆయన సాప్ట్ వేర్ కంపెనీలోనే తేజూ ఇంజినీర్ గా చేరతాడు. అయితే నందకిషోర్ మంచితనం,ఆయన తమ కంపెనీలో ఎంప్లాయిస్ అమలు చేసే పధకాలు, పేదలకు అందించే ఉచితాలు మిగతా కంపెనీల వాళ్లకు నచ్చదు. వాళ్లు మాఫియా డాన్ విక్కీ భాయ్ (రాహుల్ దేవ్)ని ఆశ్రయిస్తారు. నందకిషోర్ కంపెనీను ఆక్రమించుకోమని కోరతాడు. దాంతో విక్కీ భాయ్ రంగంలోకి దిగుతాడు. నందకిషోర్ ని చంపేసి..ఆ కంపెనీ రాయించుకుంటారు. అప్పుడు ధర్మాభాయ్ రంగంలోకి దిగుతాడు. ధర్మాభాయ్..న్యాయానికి ,ధర్మానికి మారు పేరు..అతను వచ్చి విక్కీ భాయ్ ని బాబోయ్ అనిపిస్తాడు. ఇంతకీ కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ధర్మాభాయ్ ఎవరు...తనను చేర దీసిన నందకిషోర్ హత్యకు తేజు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు. ఇంతకీ ఈ కథలో సంథ్య (లావణ్య త్రిఫాఠి) క్యారక్టర్ ఏంటి...అనే విషయాలతో సాగేదే మిగతా కథ.
టైం బ్యాడ్ తేజూ..లేకపోతే ఈ హ్యాకింగ్ లు ఏమిటి
మాస్ మసాలా సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ ...వివి వినాయిక్...రొటీన్ కథ తీసుకున్నా...రచ్చ రంబోలా చేసే నైపుణ్యం ఆయనకు ఉంది. ముఖ్యంగా ఆయన కామెడీ,యాక్షన్ కలిపి పండించే సన్నివేశాలు గత చిత్రాల్లో బాగా పేలాయి. కానీ అదేం పాపమో...కానీ సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్స్ మించి పండలేదు. కథ..చాలా అయోమయంగా ..అర్ద రహితంగా సాగుతుంది. నిజానికి ...ఈ కథలో విలన్ ..మాఫియా డాన్ కాదు..అతన్ని ప్రేరేపించిన ప్రక్కనున్న సాఫ్ట్ వేర్ కంపెనీలు. హీరో రివేంజ్ తీర్చుకోదలిస్తే వాళ్ల మీద తీర్చుకోవాలి. కానీ ఎంతో ఇంటిలిజెంట్ అయిన హీరోకు అసలు ఆ విషయమే తెలియదు. సినిమా సెంకడాఫ్ మొత్తం విలన్ ఎక్కౌంట్స్ హ్యాకింగ్ చేయటం, డబ్బులు డ్రా చేసేయటం వంటి విషయాలపైనే కాన్సర్టేట్ చేసారు. ఆ సీన్స్ కూడా అర్దాంతరంగా వస్తాయి. ఎడిటింగ్ మిస్టేకో, లేక స్క్రీన్ ప్లేనో అలా రాసుకున్నారో తెలియదు. వాటిని చూస్తూంటే ... పెద్ద వాళ్ల ఎక్కౌంట్స్ హ్యాక్ చేసి కోట్లు డబ్బులు లాగేయటం అంత ఈజీనా అనిపిస్తుంది.. ..అది కూడా జబర్దస్త్ బ్యాచ్ టిల్లు వేణు, సప్తగిరి వంటి కమిడయన్స్ హ్యాకింగ్ చేస్తూండటంతో మొత్తం సీన్స్ తేలిపోయాయి. అయినా విజువల్ మీడియా సినిమాలో ...ఎక్కువ సేపు హ్యాకింగ్ వంటి టెక్నికల్ అంశాలు చూపటం...వాటిచుట్టూ కథ తిప్పటం కష్టమే. ఎందుకనో వినాయిక్ ఆ విషయం మర్చిపోయారు. అలాగే పెద్ద ప్రొపిషనల్ కిల్లర్ గా ఈ చిత్రం కథా, మాటల రయిచత ఆకుల శివ చేత నటింపచేసారు. ఆయన చేసిన ఆ పాత్ర కూడా పూర్తిగా తేలిపోవటం...ఫస్టాఫ్ మొత్తం అర్దంపర్దం లేకుండా పోయింది.
వినాయిక్ కాదా డైరక్టర్
ఈ సినిమా చూస్తూంటే...వేరే వాళ్లు ఎవరో పాత కాలం ఆగిపోయిన ఓ డైరక్టర్ ..సినిమాని డైరక్ట్ చేసి ..వి వివినాయిక్ పేరు వేసారనిపిస్తుంది. అంత నాశిరకంగా డీల్ చేసారు. వినాయిక్ సినిమాల్లో కనిపించే ఎమోషన్స్ కానీ..ఉత్కంఠ రేపే సీన్స్, భారీ తనం తో కూడిన ఛేజ్ లు వంటివి అసలు లేనే లేవు. అలాగే కామెడీ సీన్స్ ..సైతం అసలు పేలలేదు. ఆ యాంగిల్ లోనూ ఈ సినిమా సంతృప్తి ని ఇవ్వదు.
ఇదేం రైటింగ్ సామీ
మాఫియా డాన్స్ వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీని లాక్కుని ఏం చేస్తారు..వాళ్లు రన్ చేస్తారా...అంతగా అయితే సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్స్ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు కానీ..అలాగే సాఫ్ట్ వేర్ కుర్రాడు... రాత్రికి రాత్రి ధర్మాభాయ్ గా మారటమేంటి...హ్యాక్ చేసి డబ్బులు నొక్కేయటమేంటి..అప్పుడు మాఫియాకు..తనకు తేడా ఏంటి.. ఇలా కథ,కథనంలో బోలెడు కామెడీ ఉంది..సినిమాలో లేకపోయినా
సాయిని ఏమీ అనలేం
వినాయిక్ వంటి స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నప్పుడు సాయి ధరమ్ తేజ ..కథను అడగలేదు...అందులో తప్పులూ కనపడవు. తనవరకూ సాయి..డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ లో మెప్పించాడు. అంతకు మించి మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. లావణ్య త్రిపాఠి సినిమాలో ఏమి చేసింది అంటే..అసలు చేసేందుకే ఏమీ లేదు..ఆమె వచ్చిందంటే సాంగ్ కన్ఫర్మ్ అన్నమాట. ఇంకా దారణం..బ్రహ్మానందం సీన్స్. నవ్విద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు.
తమన్ థాంక్స్ చెప్పాడు
సినిమా ఇలా ఉంటుందని ముందే ఊహించినట్లుగా తమన్ కూడా ఒక్క పాట కూడా సరైనది ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటి. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ‘చమకు చమకు’ పాట ఎంతో ఎక్సపెక్ట్ చేస్తే .. కొరియోగ్రఫీ అసలు బాగోలేదు. ఎడిటర్ గారు..కొన్ని సీన్స్ లేపేసి ఉంటే జనం దాంక్స్ చెప్పుకుందురు . ఇక పురాతన కథకు తగినట్లుగానే డైలాగులు కూడా ఉన్నాయి. సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్ థాట్
సినిమా బాగోనప్పుడు న్యూమరాలిజీ ని నమ్ముకుని స్పెల్లింగ్ తప్పు రాస్తూ టైటిల్ పెట్టినా ఫలితం ఉండదు.