కష్టంరా అబ్బాయి! ('మేడ మీద అబ్బాయి' మూవీ రివ్యూ)
అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు కామెడీ కి కేరాఫ్ ఎడ్రస్ గా ఉండేవి. కాసేపు నవ్వుకోవాలంటే రాజేంద్రప్రసాద్ తర్వాత నరేష్ సినిమాలకే ప్రిఫరెన్స్ ఇచ్చాం అంతా. అయితే శ్రీను వైట్ల,త్రివిక్రమ్ పుణ్యమా అని స్టార్ హీరోలు కూడా యాక్షన్ కామెడీ అంటూ కామెడీలు చెయ్యటం మొదలెట్టాక సీన్ మారిపోయింది. ప్రత్యేకంగా కామెడీ సినిమా చూడాలంటే అల్లరి నరేష్ సినిమాకే వెళ్లాల్సిన పరిస్దితి లేకుండా పోయింది. దాంతో స్టార్స్ చేసే కామెడీకు పోటీగా తను కామెడీ చెయ్యలేక ఆ స్టార్స్ చేసే సినిమాలు స్ఫూప్ లతో కొన్నాళ్లు కాలక్షేపం చేసాడు..సుడిగాడు లాంటి హిట్స్ కొట్టాడు. అయితే అది ఎంతకాలం... జబర్దస్త్ లాంటి కామెడీ షోలు టీవిల్లోకి వచ్చాక...స్పూఫ్ లు,స్కిట్ లు పూర్తిగా బుల్లి తెరకు ట్రాన్సఫర్ అయ్యిపోయాయి. దాంతో కథ మళ్లీ మొదటకు వచ్చింది.
దానికి తోడు నాని, సప్తగిరి,సునీల్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ లు కూడా కామెడీ హీరోలుగా సినిమాలు లాగించేస్తున్నారు. దాంతో అల్లరి నరేష్ కు ఏ తరహా అల్లరి చేసి నవ్వించాలో అర్దం కాని సిట్యువేషన్ ఏర్పడింది. దాంతో రూట్ మార్చి ...లైటర్ వీన్ కామెడీ ట్రై చేద్దామని ఇదిగో ఇలా ... ‘ఒరు ఒక్కడన్ సెల్ఫీ’ అనే మళయాళ రీమేక్ పట్టుకుని రంగంలోకి దిగాడు. అదే దర్శకుడుని తెలుగు వెర్షన్ కు తీసుకున్నాడు.ఎందుకైనా మంచిదని జబర్దస్త్ ఆదిని తోడు తెచ్చుకున్నాడు. ఈ మార్పులన్ని అల్లరి నరేష్ కు హిట్ ఇచ్చాయా...కామెడీ చేస్తాడు నరేష్ అని నమ్ముకుని వచ్చిన వారికి న్యాయం చేయగలిగాడా...మళయాళం తరహాలోనూ ఇక్కడా ఈ సినిమా హిట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
తన ఫ్రెండ్స్ దగ్గర బిల్డప్ ఇద్దామని తీసిన ఓ సెల్ఫీ...ఊహించని సమస్యల్లోకి నెట్టేస్తే...ఎలా బయిటపడ్డాడనే స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ కథలో .. శ్రీను (నరేష్)కు పెద్ద డైరక్టర్ అయిపోవాలనేది జీవితాశయం. పెద్ద డైరక్టర్స్ పెద్దగా చదువుకోలేదు అని ఏ పేపర్లో ఇంటర్వూల్లో చదివాడో ఏమో కానీ..చదువు మీద పెద్ద దృష్టి పెట్టలేదు. ఫ్రెండ్స్ తో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ, సినిమా కలలతో కాలక్షేపం చేసే శ్రీను..ఎదురిట్లోకి కొత్తగా అద్దెకు దిగిన సింధు (నిఖిల)ని చూసి ఇష్టపడతాడు. దాంతో తన ఫ్రెండ్స్ దగ్గర కాస్త బిల్డప్ ఇద్దామని ‘సింధు నాకు పడిపోయింది.. మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం’ అని టముకు వేస్తాడు. అయితే ఈ లోగా పరిస్దితులు విషమిస్తాయి.ఇంట్లో తండ్రి పోరు ఎక్కువైపోతుంది. దాంతో డైరక్టర్ అయ్యేకే ఇంట్లో వాళ్లకు కనిపిద్దామని హైదరాబాద్ బయల్దేరతాడు.
లక్కీగా తాను ఎక్కిన ట్రైన్ లోనే సింధు కనిపిస్తుంది. దాంతో తన పంట పండిందని ఆనందంతో సింధుతో ఓ సెల్ఫీదిగి తన ఫ్రెండ్స్ కు పంపుతాడు శ్రీను. ఆ సెల్ఫీనే శ్రీను కొంప ముంచుతుంది. వారం తర్వాత సినిమా అవకాశాలు దొరక్క తిరిగి ఊరొస్తాడు. అయితే అప్పటికే ఊళ్లో ఆ సెల్ఫీని బేస్ చేసుకుని ఓ టాక్ బయిలుదేరుతుంది. సింధుని లేపుకొని తీసుకెళ్లాడని శ్రీను ను ఊరు.. ఊరంతా అవమానిస్తుంది. పోలీస్ కేస్ అవుతుంది. దాంతో అసలు ఆమె ఎక్కడికి వెళ్లిందో అర్దం కాక..ఆమెను వెనక్కి తెచ్చే భాధ్యత తనమీద పెట్టుకుని తన ఫ్రెండ్ బాబ్జీ (హైపర్ ఆది) ని తీసుకుని బయిలుదేరతాడు. ఇంతకూ సింధు హైదరాబాద్ ఎందుకు వెళ్లింది. ఏమైపోయింది.. శ్రీను, బాబ్జీకి సింధు కనిపించిందా. చివరకు శ్రీను డైరక్టర్ అయ్యాడా..అనేది మిగతా కథ.
ఆ రోజులు పోయాయి
గతంలో అల్లరి నరేష్ హీరోగా 'సెల్ఫీ రాజా' అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది..నిజానికి అందులో సెల్ఫీల గురించి సినిమా ఏమీ ఉండదు. నిజానికి ఈ సినిమాకు ఆ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది. అనవసంగా మేడమీద అబ్బాయి..అని టైటిల్స్ పెట్టి ఓపినింగ్స్ కూడా రాకుండా చేసారే అనిపిస్తుంది. చాలా థిన్ లైన్ పట్టుకుని సినిమా ట్రీట్ మెంట్ చేసారు. అల్లరి నరేష్ వంటి కామెడీ హీరోకు ఇందులో ఉన్న కామెడీ సరిపోలేదు. అల్లరి నరేష్ నుంచి దిల్ మాంగే మోర్ అన్నట్లుగా మరింత ఎక్కువ కామెడీ ఆశిస్తారు. అదే ఈ సినిమాలో లోపించింది. పొరిగింటి డైరక్టర్ కు అల్లరి నరేష్ కు ఉన్న ఇమేజ్ పై అవగాహన లేనట్లుంది. దాంతో చాలా డ్రైగా,బోరింగ్ సినిమాగా మార్చేసాడు. ఫస్టాఫ్ ..బాగానే అల్లరి నరేష్ సినిమాలా అనిపించినా..సెకండాఫ్ చాలా కష్టమనిపించింది. హీరోయిన్ ..మిస్సైన కారణం కూడా చాలా సిల్లీగా ఉంది. మేడమీద అబ్బాయిలు, గోడ దూకిన అమ్మాయిలు కథలు తెలుగు సినిమా ఎప్పుడో దాటేసింది.
మళయాళం నుంచి వచ్చి ఏం పీకాడు
అల్లరి నరేష్ సినిమాకు సాంకేతిక విభాగాలు గురించిన పెద్ద చర్చ అవసరం ఉండదు. మరీ మళయాంళంనుంచి దిగుమతి చేసుకుని డైరక్ట్ చేయించుకునే స్దాయిలో డైరక్షన్ లేదు.అదే ఏ తెలుగు దర్శకుడుకో అప్ప చెపే అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్...అతని గత సినిమాల చరిత్ర చూసుకుని నేటివిటి అద్ది, ఉన్నంతలో ఖచ్చితంగా ఇంకా బాగా చేసేవాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ లో స్లో మోషన్ సీన్స్ లేపేస్తే బాగుండేది. షాన్ రహమాన్ సంగీతం జస్ట్ ఓకే. బొప్పన్న చంద్రశేఖర్ నిర్మాణ విలువలు లో బడ్జెట్ యవ్వారమే.ఇప్పటికైనా అల్లరి నరేష్ సినిమా స్రిప్టులను జాగ్రత్తగా ఎంచుకోకపోతే...అతను సినిమాకు వెళ్లాలా వద్దా అని ఎంచుకునే విషయంలో జనం జాగ్రత్తలు తీసుకుంటారు.
ఫైనల్ ధాట్
కామెడీ లేని కామెడి సినిమాని భరించటం ఎంత విషాదం...
ఏమి బాగుంది: ఫస్టాఫ్ లో వచ్చే అది, నరేష్ ల కామెడీ పంచ్ లు
ఏం బాగోలేదు: సెకండాఫ్ లో వచ్చే ఇన్విస్టిగేషన్ టైప్ ఎపిసోడ్స్
ఎప్పుడు విసుగెత్తింది : ఒకే విషయం రిపీట్ అవుతూ సాగుతున్నప్పుడు
చూడచ్చా ?: ఖచ్చితంగా ..టీవిలో వస్తున్నప్పుడు