'హలో' మూవీ రివ్యూ
'మన'మంతానువ్వే ('హలో' మూవీ రివ్యూ)
కొన్ని సినిమాలు చూస్తూంటే... తర్వాత రాబోయే నాలుగో సీన్ ఏమిటో తెలుసిపోతుంది...ఇంటర్వెల్ లో రాబోయే ఎపిసోడ్ ఏమిటో...ఇరవై నిముషాల ముందే ఇట్టే మన కళ్ల ముందు కనపడుతుంది. క్లైమాక్స్ కూడా కొంచెం కూడా తేడా లేకుండా భలే ఎక్సపెక్ట్ చేసామే, మన సినిమా జ్ఞానం పెరిగిపోయింది..మన మైండ్ షార్ప్ అయిపోయింది...నాలుగు రోజులు కూర్చుని... నాలుగైదు సినిమా స్క్రిప్టులు రాసేసుకుని ఫీల్డ్ కు వెళ్లిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చేస్తుంది..ఇంత ధైర్యాన్ని కొన్ని సినిమాలు కథలు మాత్రమే ఇస్తూంటాయి. ఆ తర్వాత ఎవరన్నా...నీకేం అనుభవం ఉందని స్క్రిప్టులు రాస్తావని దబాయించినా...మళ్లీ ఆ సినిమాలు చూసి...ఈ మాత్రం కథ నేను రాయలేనా అనే థైర్యం తెచ్చేసుకోవచ్చు. ఓ రకంగా అలాంటి సినిమాలు ...సినిమా ఫీల్డ్ లోకి వెళ్లాలనుకునేవాళ్లకు ఆంజనేయ దండకం లాంటివి. భయం పోగొట్టి..అభయం ఇస్తూంటాయి. అలాంటి ధైర్యాన్నిచ్చే కథలు ఈ మధ్యకాలంలో దర్శక,నిర్మాతలు తెగ తయారు చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాం అంటే అలాంటి కథతోనే అఖిల్ 'హలో' వచ్చింది. 'మనం' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తెలివి తక్కువ వాడు కాదు కదా...ఆయన ఇలాంటి అందరికీ తెలిసిన కథ ఎందుకు తీసుకున్నాడు...నాగార్జున ఎలా ఒప్పుకున్నాడు. వీళ్లిద్దరి ధైర్యం ఏమిటి అంటారా.. అదే ఆరా తీద్దాం..రివ్యూలో ...పదండి.
కథ ఏంటంటే..
అనాధ శీను(అఖిల్ ) చిన్నవయస్సులో... జున్ను అలియాస్ ప్రియ (కల్యాణి ప్రియదర్శన్) మరో బుజ్జి అమ్మాయి పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య మనసంతా నువ్వే టైపు ప్రెండ్షిప్ చిగురిస్తుంది...ఆ తర్వాత జున్ను నాన్నకి ట్రాన్సఫర్ అవటంతో ఆ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. వెళ్లే పిల్ల వెళ్లి పోవచ్చుగా..వంద నోటుపై తన ఫోన్ నెంబర్ రాసి మనోడుకు అందేలా ఏర్పాటు చేస్తుంది. ఆ వంద నోటుని మురిపెంగా చూసుకునే లోగా ఒకడొచ్చి లాక్కుపోతాడు. నిరాశలో ఉన్న శీను...ఆ తర్వాత యాక్సిడెంటల్ గా ప్రకాష్(జగపతిబాబు), సరోజిని(రమ్యకృష్ణ) కుటుంబానికి దగ్గర అవుతాడు. అక్కడ నుంచి వాళ్లు అవినాష్ (శీను పేరు నచ్చలేదో లేక కథకు ఇబ్బంది అని డైరక్టర్ మార్చమన్నాడో ) అనే పేరు మార్చి పెంచుకుంటారు.
ఇలా ఇలా చిన్నారి ప్రేమికులు సారీ స్నేహితులు పూర్తిగా విడిపోయి...మళ్లీ కలవటం కోసం కలలుకంటూ నిరంతరం కలవరిస్తూంటారు. ఏ ఫోన్ వచ్చినా శీను నుంచే నేమో అని ఆమె ఆత్రుత, ఏ చిన్న అవకాసం దొరికినా జున్ను మళ్లీ కనపడుతుందేమో మనోడి ఆశ. ఇలా ఆశ..ఆత్రుత, నిరాశల మధ్య నిరవధికంగా రోజులు గడుస్తూంటాయి. ఇద్దరూ వయస్సు పెరిగి పెద్దవాళ్లు అయినా ... వాళ్లు వెతుకులాట మానరు. చివరకు లవ్ ప్రపొజల్స్ వచ్చినా, పెళ్లి సంభందాలు ...సారీ..నా మనస్సులో వేరే వాళ్లు ఉన్నారని...తిప్పికొట్టేస్తూంటారు.
ఇలా చిన్న వయస్సులోనే విడిపోయిన ఆ ప్రేమ హృదయాలు తిరిగి ఒకటి ఎలా అయ్యాయి. వీరు కలవకుండా డెస్టినీ(విధి) ఏయే ప్లాన్ లు వేసింది. అసలు డెస్టినీకు వీళ్లను విడితీసి ఆనందించేటంత అంత అవసరం,శాడిజం ఏమొచ్చింది... తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అలాగే వీళ్లిద్దరు మళ్లీ కలవటానికి క్లూ ఉంది. అదేమిటంటే...శీను ..మాత్రమే ప్లే చేయగలిగే ఓ ట్యూన్. (అది వింటే ఆమె పరుగెత్తుకు హీరో దగ్గరకు వచ్చేస్తుంది..లేదా మన హీరో పరుగెత్తుకు ఆమె దగ్గరకు వెళ్లిపోతాడు. పాత సినిమాల్లో పాట పాడితే గుర్తు పట్టి...విడిపోయిన అన్నదమ్ములు కలిసినట్లు ) లేదా శీను పోగొట్టుకున్న ఆ వందరూపాయల నోటుపై ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే.
Turn Left, Turn Right
నిజానికి ఇది కొత్త కథేమీ కాదు..మన తెలుగులో సూపర్ హిట్ అయిన మనసంతా నువ్వేని మనసారా గుర్తు చేస్తోంది కదా. ఈ సినిమాకు యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి ..వండారనిపిస్తుంది. అయితే ఈ సినిమా చూస్తూంటే Turn Left, Turn Right (2003)లో వచ్చిన హాంకాంగ్ సినిమా నుంచి పాయింట్ తీసుకున్నారని అర్దమవుతుంది. హాంకాంగ్ సినిమాలో హీరో తన చిన్నప్పుడే హీరోయిన్ నుంచి (ఆమె కూడా చిన్న పిల్లే) ఫోన్ నెంబర్ తీసుకుని, ఆ కాగితం మిస్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ కలిసే అవకాసం వచ్చినా మళ్లీ అదే పరిస్దితి.. ప్రక్క ప్రక్కనే ఉన్నా డెస్టినీ దెబ్బకు ఇద్దరూ ఒకరినొకరు కలవలేని పరిస్దితి. సరిగ్గా ఇదే పాయింట్ కు సెల్యులర్ సినిమా టైప్ లో సెల్ ఫోన్ మాఫియా ని కలిపి హలో అన్నారు.. అయితే సెల్ ఫోన్ మాఫియా మాత్రం అతకలేదు. ఆ సీన్స్ లేకపోయినా సినిమాకు లెంగ్త్ విషయంలో తప్ప మరెక్కడా ప్లాబ్లం రాదు. అంతలా మెర్జ్ అయ్యాయి ఆ సీన్స్. అలాగే మనం సినిమా ని సైతం గుర్తు చేస్తాయి చాలా సీన్స్.
విక్రమ్ కుమార్ వర్క్ బాగుంది కానీ..
దర్శకుడు విక్రమ్ కుమార్ తనదైన శైలి మేకింగ్ తో చాలా సీన్స్ ఓ హాలీవుడ్ మ్యూజకల్ ఎంటర్టైనర్ చూస్తున్నట్లుగా రూపుదిద్దారు. అయితే అనవసరమైన ఫైట్స్ వంటివి వచ్చినప్పుడే మనం అచ్చ తెలుగు సినిమా చూస్తున్నామనిపిస్తుంది. అయితే విక్రమ్ కుమార్ బెస్ట్ వర్క్ లలో ఒకటి మాత్రం ఇది కాదు. ఆయన రెగ్యులర్ గా చూపే టైమ్, క్రాస్ రోడ్స్, మీటింగ్ పాయింట్, యాక్సిడెంట్స్ వంటివి ఈ సినిమాలోనూ కంటిన్యూ అయ్యాయి. అలాగే ఎమోషన్స్ బాగా పిండాననుకుంటేనే మెలోడ్రామా వైపుకు (క్లైమాక్స్ లో )ప్రయాణం పెట్టుకోవటం కాస్త విసుగనిపించింది. ఇష్క్, మనం నాటి మ్యాజిక్ మిస్సైంది.
బాబ్ బ్రౌన్ బిజీ అవుతాడేమో
ఈ సినిమా లో అఖిల్ ఫెరఫార్మన్స్ కన్నా విక్రమ్ కుమార్ టాలెంట్ హైలెట్ అయినట్లే...హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్ వర్క్ కూడా సినిమాలో మాట్లాడుకునే స్దాయిలో హైపిచ్ లో ఉంది. ఈ సినిమా పేరు చెప్పి ఆయన ఇక్కడ బిజీ అవుతారేమో అనిపిస్తోంది.
రెండో సినిమాలో ఎలా చేసాడు
తొలి సినిమా కన్నా అఖిల్ చాలా మెచ్యూర్ గా కనిపించారు..కసిగా నటించారు.( అయితే నటన అంటే డాన్స్ లు ఫైట్స్ లు అనుకుంటే). కథకు అవసరమైనా కాకపోయినా... మేడల మీద రన్నింగ్ చేస్తూ చేసే ఫైట్, గుడౌన్‌లో ఫైట్, హైవే మీద చేజింగ్ సీన్స్ బాగా చేసాడు.
హీరోయిన్ కల్యాణి...జస్ట్ ఓకే అన్నట్లుంది. పాత జంట రమ్యకృష్ణ, జగపతిబాబు పాత్రల్లోకి జారుకున్నారు. అజయ్ క్యారక్టరే అటూ ఇటూ కాకుండా రాసుకున్నారు. అనూప్ సంగీత సారధ్యంలో ..పాటలు అద్బుతం కాదు కానీ బాగున్నాయి. రీరికార్డింగ్ చాలా సీన్స్ ని లేపింది. సినిమాకు ఉన్న మరో హైలెట్ లలో కెమెరా వర్క్ ఒకటి. చాలా కలర్ ఫుల్ గా ఉంది.
ఫైనల్ ధాట్
సాధారణంగా మన జ్ఞానానికి పరీక్ష పెట్టే సినిమాలు ఉన్నట్లే మన జ్ఞాపక శక్తికి పరీక్ష పెట్టే సినిమాలూ చాలా తగులుతూంటాయి. బుర్రని ప్రక్కన పెట్టి బుద్దిగా కూర్చుని చూస్తే అవీ బాగున్నట్లే అనిపిస్తాయి. లేకుంటే మళ్లీ ఆ సినిమానే తీసేడేంటిరా... అని చూస్తూ నిట్టూరుస్తూంటాం.