రామ్ చరణ్ నటనే బలం ...(‘రంగస్థలం’రివ్యూ)
ఎనభైల్లో పల్లెటూళ్లు ... ఓ ప్రత్యేకమైన ప్రపంచంలా ఉండేవి. భూస్వామ్య వ్యవస్ద బలంగా పాతుకుపోయిన ఆ రోజుల్లో...అమాయకులైనా, అతి తెలివి ఉన్నవాళ్లైనా వాళ్లకి అణిగిమణిగి ఉండాల్సిందే. తేడా వస్తే తలలు తెగిపోయేవి. ఎక్కడ చూసినా కుట్రలు,కుతంత్రాలతో గ్రామ రాజకీయాలు గరం గరంగా నడుస్తూండేవి. అలాంటి గ్రామ వాతావరణంని ఈ రోజుల్లో రీ క్రియేట్ చేస్తూ సినిమా చేయటం అంటే ఆషామాషి కాదు.
ఏ మాత్రం గాడి తప్పినా ...అంతగా చూడాలనుకుంటే ఎనభైల్లో రిలీజైన సినిమా ఓ పాలి టీవిలో వేసుకుని చూసుకుంటే సరిపోతుంది కదా ...మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి తీసాడెందుకు... అని జనం వెటకారమాడేస్తారు. అలాగే ఎనభైల కాలం నాటి వాతావరణం సినిమాలో ప్రతిబించాలి కానీ...ఎనభైల కాలంనాటి సినిమాలా ఉండకూడదు. ఇలాంటి తలతిక్క లెక్కలన్ని లెక్కలు మాస్టారైన సుకుమార్ కు తెలియనవి కావు. వీటినన్నిటినీ బాలెన్స్ చేస్తూ ‘రంగస్థలం’ ని ఎలా తీసారు...రామ్ చరణ్ కు ఇలాంటి పాత్ర కొత్త...ఆయన ఎలా చేసాడు...అసలు సినిమా కథేంటి...ఎలా ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
ఇదే కథ
పొలాలకు నీరు పెట్టే ఇంజిన్ను నడుపుతూ బ్రతుకుతూంటే చిట్టిబాబు (రామ్ చరణ్) ఓ సౌండ్ ఇంజినీర్ (చెవిటివాడు). దుబాయి నుంచి వచ్చిన అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి), తల్లి,తండ్రి (నరేష్) ,అతనంటే ఇష్టపడే రామలక్ష్మి (సమంత)..ఇదే అతని ప్రపంచం. అతనుండే ఊరిలో (రంగస్దలం) గత ముప్పై ఏళ్లుగా ఏక ఛత్రాధిపత్యంగా ప్రెసిడెంట్ పదవిని వెలగబెడుతూంటాడు ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). ఆ గ్రామ పంచాయితికి వచ్చే ఫండ్స్ ని నొక్కేస్తూ ..అది అడిగేవాళ్ల నోళ్లు నొక్కేస్తూ ...వేరే వాళ్లు ఎవరూ ప్రెసిడెంట్ పదవి గురించి కలలో కూడా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ఓ నియంతలా ఏలుతూంటాడు. అంతేకాకుండా ఊళ్లో వారికి సొసైటీ ద్వారా లోన్స్ ఇచ్చి...అక్రమంగా వడ్డీవ్యాపారం చేస్తూ ...వాళ్ల పొలాలు లాగేసుకుంటూంటాడు.
అతని అరాచకాలకు ఊరి జనం భయపడుతూ, భయం తగ్గినప్పుడు బలైపోతూంటారు. అలాంటి సమయంలో కాస్తంత ఊళ్లో చదువుకున్న కుమార్ బాబుకి ఈ అన్యాయాలని ఎదిరించాలని బుద్ది పడుతుంది. దాంతో ఓ రోజు ఆ నియంతనే నువ్వెంత అని నిలదీస్తాడు. అంతేకాదు..ఆ ఊరిలో మార్పు కోసం... నియంతపైనే ‘రంగస్థలం’ గ్రామ సర్పంచ్ గా పోటీలో నిలబడతాడు. తనకు ఎదురుతిరిగి,తన ఇజ్జత్ కు సవాల్ గా నిలిచి, తనకు పోటీకి నిలబడతాను అని అంటున్న కుమార్ బాబు పద్దతి సాధారణంగానే ప్రెసెండెంట్ గారికి నచ్చదు.
అందులో ఆయనది గతంలో ఎలా ఎదురుతిరుగుదాం అని ఆలోచన వచ్చిన వాళ్లను సైతం వదలకుండా అడ్డంగా చంపేసిన రక్త చరిత్ర ఉన్నోడు. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా తన క్యారక్టరైజేన్ ని ఎందుకు మార్చుకుంటాడు. అలాంటి పరిస్దితుల్లో కుమార్ బాబు ని ఏం చేసాడు...కుమార్ బాబుని ఏదన్నా చేస్తే ...లక్ష్ణణుడులాంటి తమ్ముడు చిట్టిబాబు అసలు ఊరుకుంటాడా.. ఆ తర్వాత ఏం జరిగింది..కుమార్ బాబు ఎలక్షన్స్ లో గెలిచాడా... రామలక్ష్ణి కథేంటి వంటి విషయాలు సినిమాలు చూడాల్సిందే.
టైమ్ ట్రావెల్
ఇలాంటి కథలు గతంలో అంటే పాతికేళ్ల క్రితం చాలా వచ్చాయి.అయితే ఈ మధ్యకాలంలో అసలు ఎవరూ టచ్ చేయలేదు. తమిళంలో సుబ్రమణ్యపురం, సుందర పాండ్యన్ వంటి సినిమాలు అడపాదడపా వస్తున్నా మనవాళ్లు ధైర్యం చేయటం లేదు. అయితే సుకుమార్ ఆ భాధ్యత తీసుకున్నారు. సెల్ ఫోన్స్ లేని రోజుల్లోకి తన టీమ్ తో టైమ్ ట్రావెల్ చేసి ఈ అవుట్ పుట్ తీసుకొచ్చారు.
శభాష్ సుకుమార్
రెగ్యులర్ సినిమాని బ్రేక్ చేయాలనుకోవటం ఎప్పుడూ గొప్ప విషయమే. అది సుకుమార్ ప్రతీ సినిమాతో చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ సారి కూడా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఎంచుకుని తన వైవిధ్యాన్ని చూపించారు.
అప్పట్లో అంటే ఎనభైల్లో ఈ సినిమాలో చూపినటువంటి విలన్స్ దాదాపు ప్రతీ ఊళ్లోను దర్శనమిచ్చేవారు. అలాగే చిట్టిబాబులు కూడా కనిపించేవారు. ఆ క్యారక్టర్స్ ని పట్టుకుని తెరపై అలా యధాతథంగా అనువదిస్తూ దింపేయటం మాటలు కాదు. ఆ విషయంలో దర్శకుడు సుకుమార్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే అప్పటి కాలాన్ని తెరపై నిండుగా ఆవిష్కరించటంలోనూ ఆయన ఎక్కడా రాజీపడలేదు.
తమిళ మార్కెట్ కోసమా
సినిమా చూస్తూంటే బాగా raw గా ఉన్న ఓ చక్కటి తమిళ గ్రామీణ సినిమా చూస్తున్న ఫీల్ చాలా సార్లు కలుగుతుంది. ముఖ్యంగా ఇంటెన్స్ సీన్స్, తెరపై మాట్లాడితే డప్పులు, జాతర వాతావరణం, కొన్ని పాత్రలు చనిపోయినప్పుడు పాడి కట్టటం,శవంతో స్నానం చేయిచంటం, వంటివి కాస్త ఎక్కువ చూపించటం వల్ల అనుకుంటా ఆ లుక్ ని తీసుకువచ్చాయి. ఆ తరహా తమిళ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్లు ఖచ్చితంగా ఈ సినిమా పండుగే. అలాగే దర్శక,నిర్మాతల ఆలోచన.... తమిళ మార్కెట్ కూడా అయితే అది నెరవేరినట్లే.
ఫస్టాఫ్ పరుగు..
చక్కటి వెటకారంతో కూడిన ఫన్, అందమైన విజువల్స్ తో కూడిన విలేజ్ ఎట్మాస్మియర్, ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఫస్టాఫ్ పరుగెట్టింది. సెకండాఫ్ కు వచ్చేసరికి...థ్రిల్లర్ మోడ్ కు సినిమా మెల్లిగా మారిపోతూ..దానికి తోడు సెంటిమెంట్ బ్లాక్స్ తో మెల్లిగా సాగింది. ముఖ్యంగా ఎక్కడో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కోసం సెకండాఫ్ లో చాలా సీన్స్ ని విషయం లేకుండా సాగతీసినట్లు అనిపించింది. ఫస్టాఫ్ ఉన్నట్లే సెకండాఫ్ రన్ కూడా ఉండి ఉంటే సినిమా వేరే విధంగా ఉండేది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని లేనివారికి అద్బుతం అనిపించవచ్చు.
తెలుగు ధనుష్ ..
ఈ సినిమాలో రామ్ చరణ్ ని చూస్తూంటే ఖైదీ, ఊరుకిచ్చిన మాట వంటి చిత్రాల్లో చిరంజీవి ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. గోదావరి యాసతో, చెవిటి వ్యక్తిగా జీవించిన చరణ్ కు ఈ సినిమా ఖచ్చితంగా అవార్డ్ లు తెచ్చిపెట్టేదే. నటుడుగా ఒక్కసారిగా ఈ సినిమాతో చాలా మెట్లు ఎక్కారు. అసలు ఇలాంటి సినిమాని రామ్ చరణ్ వంటి కమర్షియల్ హీరో నుంచి ఆశించం. రెగ్యులర్ గా తమిళంలో ధనుష్, శశికుమార్ ఇలాంటి పాత్రలు చేస్తూంటారు. తెలుగులోనూ మనకు ఓ ధనుష్ లాంటి హీరో ఉన్నాడని తేలింది. రామ్ చరణ్ ఇక నుంచి అప్పుడప్పుడైనా ఇలాంటి డెప్త్ ఉన్న పాత్రలు,నటనకు అవకాసం ఉన్న సినిమాలు చేయాల్సిన అవసరం ఈ సినిమా నొక్కి చెప్తుంది.
ప్రత్యేకంగా చెప్పేదేముంది
సమంత, ప్రకాష్ రాజ్, నరేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు వీళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పుటిలాగే చించి ఆరేసారు. అయితే సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసిన జబర్దస్త్ మహేష్ మాత్రం ...తెలుగు సినిమాకు దొరికిన మరో మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. చాలా బాగా చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే అద్బుతమే చెప్పాలి. జగపతి బాబు పాత్ర మనకు ఎర్రమందారంలో దేవరాజు పాత్రను గుర్తు చేస్తుంది.
రంగమ్మత్త
ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర రంగమ్మత్త. అనసూయ చేసిన ఈ పాత్ర కూడా ఫుల్ లెంగ్త్ క్యారక్టరే. చాలా బాగా చేసింది. గతంలో జయలలిత చేసేది ఇలాంటి పాత్రలు. ఆమె ప్లాష్ బ్యాక్ కూడా రొటీన్ అనిపించినా కథకు బాగా ప్లస్ అయ్యింది.
అవేమీ లేవు
సాధారణంగా దర్శకుడు సుకుమార్ సినిమా అనగానే చాలా లాజిక్ లు, లెక్కలు, బ్రెయిన్ టీజర్స్ ఉంటాయి. అవేమీ ఈ సినిమాలో లేవు. అలాగే సుకుమార్ చేసిన మరో ఉపకారం ఏమిటి అంటే..ఎనభైల్లో సినిమా అనగానే... కొన్ని క్రూడ్ కామెడీ పాత్రలు తీసుకువచ్చి బలవంతంగా సినిమాలో కలపకపోవటం. తనకు ఇష్టమైన థ్రిల్లర్ మోడ్ లోకి సెకండాఫ్ లో కథని నడిపించారు. అయితే సినిమాలో సెంటిమెంట్ డోస్ ని తగ్గించి ఎమోషన్ కనెక్టవిటిని పెంచాల్సింది.
అవుట్ స్టాండింగ్
సుకుమార్ సినిమా అంటే టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. అదే ఇక్కడా రిపీట్ అయ్యింది. అన్ని విభాగాలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఎనభైల నాటి వాతావరణం రీ క్రియేట్ చేయటంలో అందరూ బాగా కష్టపడ్డారు. అది తెరపై బాగా కనపడింది. ముఖ్యంగా డైలాగులు చాలా బాగా రాసారు. దేవిశ్రీప్రసాద్ పాటలకి అయితే థియేటర్ లో ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.
ఫైనల్ థాట్
ఈ సినిమా రామ్ చరణ్ లో నటనని ఆవిష్కరించానికి ఏర్పాటు చేసిన రంగస్దలం.