టూమచ్ లౌడ్,బోరింగ్ ('2 కంట్రీస్' మూవీ రివ్యూ)
మరీ ఛాదస్తం కాకపోతే ... నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా...కామెడీ సినిమా అంటే అందులో ఖచ్చితంగా కామెడీ ఉండే తీరాలా? అని కామెడీ హీరోలంతా కలిసిగట్టుకుని తీర్మానం చేసి కామెడీ లేని కామెడీ సినిమాలు వదులుతున్నారు. వీళ్లకు తోడుగా జబర్దస్ద్ బ్యాచ్ సైతం టీవి తెరమీద నుంచి పెద్ద తెర మీదకు దూకేసి కామెడీ చేసేస్తున్నారు. అయితే వారీ కామెడీ సైతం పెద్ద తెర మీద ఆనటం లేదు. దాంతో థియోటర్ కు వెళ్లి కాసేపు నవ్వుకుందామనే సగటు ప్రేక్షకుడు చూసేందుకు పూర్తి స్దాయి కామెడీ సినిమాలు తెలుగులో కరువు అవుతున్నాయి. తెలుగు జనాలు కామెడీ సినిమాలంటే భయపడిపోతున్నారు.
ఈ విషయం కామెడీ చేసే దర్శక,నిర్మాతలు,హీరోలకు లీకైనట్లుంది. దాంతో ఇది కాదు పద్దతి...మీ బలహీనత మాకు తెలుసు...తెలుగువారికి ప్రక్కింటి పుల్లకూర మహా రుచి కదా..అలాగే ప్రక్క భాషలో హిట్టైన కామెడీ సినిమాలు రీమేకే చేస్తే...చచ్చినట్లు కామెడీ ఉన్నా లేకపోయినా కితకితలు పెట్టినట్లుగా ..పడీపడీ నవ్వేస్తారు.. అని ఫిక్సై... అల్లరి నరేష్ తో ...'ఒరు వడక్కన్ సెల్ఫీ' రీమేక్ ని 'మేడమీద అబ్బాయి'గా, 'జాలీ ఎల్ ఎల్ బి' ని 'సప్తగిరి ఎక్సప్రెస్' గా ఇదిగో ఇప్పుడు మరో మళయాళ హిట్ '2 కంట్రీస్' ని అదే టైటిల్ తోనూ రీమేక్ చేసారు.
అయితే దురదృష్టవశాత్తు అల్లరి నరేష్, సప్తగిరి చేసిన రెండు రీమేక్ లు వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో సునీల్ చేసిన రీమేక్ పరిస్దితి ఏమిటి...ఈ సినిమా కథేంటి..సునీల్ ని ప్లాఫ్ ల నుంచి ఒడ్డున పడేసే సినిమా అవుతుందా..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
డబ్బు పిచ్చి మొగుడు..తాగుబోతు పెళ్లాం (కథ ఇదే)
ఏ స్కీమో..స్కామో చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందని అని నమ్మే చాలా మందిలో ఒకడు ఉల్లాస్ కుమార్ (సునీల్). తన ఆలోచనలకు తగినట్లే తన ఊళ్లో ... జనాలని మాయ చేస్తూ, అవతలివాడి మోసబోయే స్దాయిని బట్టి మోసం చేస్తూ ...డబ్బు సంపాదిస్తూ తన తెలివితేటలకు తనే మురిసిపోతూ గడిపేస్తూంటాడు ఉల్లాస్. ఇలా మాయలు చేస్తూ పోతే సమస్యలు రావా అంటే..వస్తాయి, అయితే వాటిని తన అతి తెలివితో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిపోతూంటాడు. మూడు మోసాలు, ఆరు మోసాలు అనుకుంటూ హ్యాపీగా గడిపేస్తూన్న అతనికి వన్ టైమ్ సెటిల్మెంట్ లాంటి.. అవకాసం వచ్చింది.
అమెరికాలో ఉన్న సెటిలైన చైల్డ్ హుడ్ ప్రెండ్ లయ (మనీషా రాజ్) అనుకోకుండా కనెక్టు అయ్యింది.., అది పెళ్లి దాకా వెళ్లింది...లేదు లేదు.కాస్తంత డ్రామా ఆడి...ప్రేమ నటించి....తీసుకువెళ్లాడు. అయితే పెళ్లయ్యాక మన ఉల్లాస్ కు ఓ షాకయ్యే విషయం తెలిసింది. ఆమె ఓ పచ్చి తాగుబోతు అని..ఇరవై నాలుగు గంటలూ తాగుతూ గడిపే క్యారక్టర్ అని...మొదట షాక్ అయినా తర్వాత ఆమె పేర ఉన్న ఐదు వందల కోట్ల ఆస్ది గురించి తెలుసుకుని లైట్ తీసుకుంటాడు.
కానీ ఇక్కడో ట్విస్ట్... ఆ ఆస్దిపై ఆమెకు అధికారం లేదు. ఆమెకు ఆ ఆస్ది అన్ని హక్కులు కావాలంటే మందు కొట్టడం మానేయాలి. ఈ విషయం తెలుసుకున్న ఉల్లాస్ ఓ నిర్ణయం తీసుకుని అమలు పరిచాడు...కానీ అది డైవర్స్ కు దారి తీసింది. అప్పుడు ఉల్లాస్ ఏం చేసాడు...ఆమె మందు తాగటం మానేసిందా...అసలు ఉల్లాస్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి..ఆమె విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంది...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అంత వీజీ కాదు
కామెడీ సినిమాలు తీయటం అంత కామెడీ వ్యవహారం కాదు...అనేది నిజమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా రీమేక్ చేసేటప్పుడు ఆ కథ మన వాళ్లకు వర్కవుట్ అయ్యేలా మార్పులు..చేర్పులతో స్క్రిప్టు వర్క్ చేయకపోతే ఎంత తలనొప్పి తెచ్చి పెడుతుందో ఈ సినిమా ఓ పాఠమై నిలుస్తుంది. మళయాళంలో చేసిన దిలీప్ ఇమేజ్ వేరు..సునీల్ ఇమేజ్ వేరు. మన తెలుగు ప్రేక్షకులు వేరు. మన ఫ్యామిలి సెంటిమెంట్ కథలన్నీ టీవికు షిప్ట్ అయిపోయిన దశలో అలాంటి కథని టచ్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రాసలతో పాట్లు
అలాగే ఈ సినిమాలో హీరో ప్రత్యేకంగా చేసిందేమీ కనపడదు. గాలికి ఎగిరే గాలిపటంలా ఎటుపడితే అటు ఎగురుతున్నట్లుగా అతని నిర్ణయాలు,చర్యలు ఉంటాయి. అతనికి వచ్చిన సమస్య..దాని పరిష్కారం దిసగా వచ్చే సవాళ్లు..వాటిని ఎదుర్కొనే దిశలో వచ్చే కామెడీ ఉంటే బాగుండేది..కానీ అదేమీ కనపడదు. దాంతో మళయాళంలో దిలీప్ కు మ్యాజిక్ గా వర్కవుట్ అయ్యింది మన దాకా వచ్చేసరికి ప్రాస డైలాగుల మీద ఆధారపడాల్సి వచ్చింది.
ఈ సినిమాలో డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన పంచులు, ప్రాసలతో సినిమాను నింపేయటం మరో మైనస్ గా మారింది. కథకు అడ్డం పడే ఆ డైలాగులు,ప్రాసలు అవుట్ డేటెడ్ అనే విషయం మర్చిపోయారు. త్రివిక్రమ్ ..తనదైన ప్రాస డైలాగులు, డైలాగుల కోసం సీన్స్ రాయటం మానేసినప్పటికీ..వాటిని ఫాలో అవటం మాత్రం మానటం లేదు.ఈ సినిమాలో మాట మాటకీ ప్రాస డైలాగు ఎదురౌతుంది.
పరమ చెత్త
సినిమాలో స్టెప్ ఫాధర్,మదర్స్ వ్యవహారం ..ఆ కథలు ఎందురు పెట్టారో కానీ పరమ చెత్త అని చెప్పాలి. కథకు ఆ ట్రాక్ లు ఉపయోగపడకపోగా పరమ బోర్ ఎత్తించాయి. నిర్దాక్ష్యణ్యంగా తీసేయాల్సిన సీన్స్ అవి.
టైమ్ వచ్చేసింది బాబూ
ఈ సినిమాచూస్తూంటే మనకు ఒకటి అర్దమవుతుంది. ఖచ్చితంగా సునీల్ తన బాడీ లాంగ్వేజ్ ని ,డైలాగ్ డెలవరీని మార్చి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని. ఎందుకంటే ఆయన రొటీన్ ఎక్సప్రెషన్స్, కొత్తదనం లేని నటన...సీన్స్ లో ఉన్న జీవాన్ని కూడా చంపేసింది. క్లైమాక్స్ లో మాత్రం సునీల్ ..నటనా అనుభవం పనికివచ్చింది.
ఇక హీరోయిన్ మనీషారాజ్ అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయిలానే కనిపించింది. ..నటించింది. అంతకు మించి ఆమె గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇక పృథ్వీ, నరేష్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణభగవాన్, చంద్రమోహన్ వంటి సీనియర్స్ ఆటలో అరటిపండులా ..వచ్చి వెళ్లిపోయినట్లు అనిపించింది. వారిదైన ముద్ర లేదు.
టెక్నికల్ గా..
దర్శకుడుగా శంకర్ ... కామెడీని బాగానే డీల్ చేసారు కానీ అది ఈ కాలం కామెడీకు దూరంగా ఉంది. ఇక టెక్నికల్ గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. , పాటలు సోసోగా ఉన్నాయి..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేసి లెంగ్త్ తగ్గించవచ్చేమో అనిపించింది. , నిర్మాణ విలువలు సినిమాకు ఫ్లస్ అయ్యింది.
ఫైనల్ థాట్
ఇతర భాషల్లో హిట్టైన సినిమాలన్నీ అద్బుతాలు కావు. ఓ సినిమా ఆడటానికి రకరకాల కారణాలు ఉంటాయి. హీరో ఛరిష్మా...సినిమా రిలీజ్ నాటి పరిస్దితులు, కాంబినేషన్, లోకల్ జనాలకు నచ్చే డైలాగులు,పాటలు వంటి ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ చూసుకోకుండా కేవలం హిట్టైన సినిమా కథని తీసుకుని రీమేక్ చేస్తే అవి మనకి రుచించవు.