ఇంతకు ముందు వచ్చింది (‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ)
"రేయ్...ఆ అమ్మాయిది ఏ కులం..మనదే కులం..ఇప్పటికీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటే...ఇంట్లోంచి వెళ్లిపో..నా ఆస్దిలో పైసా కూడా వాటా దక్కదు". ఇది...ఆ కాలం ప్రేమ కథల్లో పర్మెనెంట్ డైలాగు. అయితే కాలం మారింది...డైలాగులు మారాయి. ఇప్పుడు ఏ తండ్రి ఆస్దిని అడ్డం పెట్టి కొడుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే పరిస్దితి లేదు..గట్టిగా ఏమన్నా అంటే తర్వాత తనను అనాధ ఆశ్రమంలో కూడా చేర్చే దిక్కు ఉండదని భయపెడుతున్నాడు. అంతేకాదు కొడుకు ఎవరితో క్లోజ్ ఉంటున్నాడో గమనించి ..వాళ్లతో తనే మాట్లాడి పెళ్లి చేయటానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడో కొత్త సమస్య.. ..."నాన్నా ... నేను ప్రేమించానని నువ్వు భ్రమ పడుతున్న అమ్మాయి నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే.. "అని కొట్టి పారేస్తున్నాడు.
ఇలా ప్రేమ కథలు స్వరం మార్చుకుంటున్నాయి. వాస్తవానికి బయిట ...మధ్యతరగతి కుటుంబాల్లో ..కొడుక్కు పెళ్లైతే చాలు .అది ప్రేమ పెళ్లైనా .. ఇంకోటైనా..ఎవరో ఒకరితో అనే సిట్యువేషన్ కు వచ్చేసి..ఎవరో ఒకరిని లైన్ లో పెట్టి పెళ్లి చేసుకోరా నాయనా అని బ్రతిమిలాడుతున్నారు. ఇక ‘మనసుకు నచ్చింది’ చిత్రం కూడా ఓ లవ్ స్టోరీనే అని ప్రచారం చేసారు. ఇది న్యూ జనరేషన్ లవ్ స్టోరీనా లేక ఆగిపోయిన ఆ కాలం నాటి ప్రేమ కథా..మరీ లేటెస్ట్ ప్రణయ కావ్యమా...అసలు కథేంటి..ఈ సినిమా అయినా సందీప్ కిషన్ ని ఒడ్డున పడేస్తుందా వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ ఇదే...
మరికాస్సేపట్లో పెళ్లి ముహూర్తం అనగా... పెళ్లికొడుకు సూరజ్(సందీప్ కిషన్), పెళ్లి కూతుతరు నిత్య(అమైరా దస్తూర్) లు ఆ పెళ్లి వద్దంటూ గోపాకు జంప్ అయిపోతారు. అయితే వెళ్లేముందు పెద్దలుకు ఓ లెటర్ పెడతారు. ఆ లెటర్ లో .. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు..మా ఇద్దంరం మేము స్నేహం అనే ఫీలయ్యాం...మీరు ప్రేమ అని ఫీలయ్యారు..మీకెలా చెప్పాలో తెలియక వెళ్లిపోతున్నా..మా ప్రేమను మేము వెతుక్కుంటాం..మా కెరీర్ ని మేము వెతుక్కుంటాం... మమ్మల్ని కొంతకాలం వదిలేయండి...అని ఉంటుంది. నిజానికి సూరజ్,నిత్యా బావా మరదళ్లు. అంతకు మించి మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటినుంచీ ... ఒకరినొకరు ఏడిపించుకుంటూ, నవ్వించుకుంటూ, టీజ్ చేసుకుంటూ ఉంటారు.
వీరి అన్యోన్యం అనుబంధం చూసి..దాన్ని అన్యోన్య దాంపత్యంగా మార్చాలని పెద్దలు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అయితే ఇద్దరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. దాంతో ఇలా గోవాకు చెక్కేసారన్నమాట. ( పెళ్లి టైమ్ వచ్చేదాకా ఆగి ..ఈ లెటర్స్ గట్రా రాసే బదులు..పెళ్లి కు ముందే పెద్దలకు ఈ విషయం చెప్పచ్చుకదా అనకండి... కథ దెబ్బతింటుంది.) అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా చౌదరి), నిత్యాకు అభయ్(అదిత్ అరుణ్) పరిచయం అవుతారు. ఇద్దరూ ఆ ఇద్దరికి సెట్ అవుతారు. ప్రేమ పాఠాలు వల్లిస్తారు. దీంతో సర్లే అని వారి పెద్దలు ఈ రెండు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు.
అయితే కొద్ది రోజులుకు... నిత్య తన మనసులో ఉన్నది అభయ్ కాదు.. తన బావే సూరజ్ అని రియలైజ్ అవుతుంది . ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్రిందా? ఎవరికి నచ్చిన లైఫ్ పార్టనర్స్ ను వారు తెచ్చుకోగలిగారా? అన్నది మిగతా కథ! అలాగే మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ప‍్రకృతి పాత్ర ఏమిటి వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ లవ్ స్టోరీని ఎలా డీల్ చేసారంటే
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని తెరకెక్కించిన డైరక్టోరియల్ డెబ్యూ చిత్రం గా వచ్చిన ఈ సినిమా ఏదో కొత్తదనం మోసుసుకోవస్తోందని ప్రోమోలు ,టీజర్స్ హామీ ఇచ్చాయి. కనీ నిజానికి జరిగిందేమిటి.. ఇప్పటికే ఈ కథ.. బోలెడు సార్లు తెరకెక్కింది. నువ్వే కావాలి నుంచి నిన్న మొన్న వచ్చిన ఉయ్యాల జంపాల దాకా ఇదే ఫార్మెట్. అయితే ఫార్మెట్ ని అనుసరించటంలో తప్పు లేదు..కాకపోతే .. కథ,కథనం ఇంట్రస్టింగ్ గా ప్రెష్ సీన్స్ తో నడపకపోవటమే ఈ సినిమాకు వచ్చిన ప్రధాన సమస్య. మొదట అరగంటలోనే ఈ సినిమా ...ప్రకృతి మనకు ఏదో చెప్పాలనకుంటోంది.. , యోగా క్లాసులు వెళ్దామా అంటూ ... తెరపై బోలెడు నీరసాన్ని గుమ్మరించారు. ఇంట్లో చేస్తున్న పెళ్లి వద్దు అనుకుని వచ్చేసిన జంట...ఏం ఇబ్బందులు పడింది..ఎలా సర్వైవ్ అయ్యింది...తిరిగి తమ లైఫ్ పార్టనర్స్ ని ఈ క్రమంలో ఎలా వెతుక్కున్నారు అనేది చూపెట్టకుండా... కష్టమనేది హీరో,హీరోయిన్స్ కు పెట్టకుండా చాలా ముద్దు చేస్తూ స్క్రిప్టు ని నడిపితే ..ఎక్కడా కాంప్లిక్ట్ అనేది లేకుండా పోయింది. ఇలాంటి సినిమాలకు ఫన్ , పాటలు చాలా బాగుంటేనే వర్కవుట్ అవుతాయి. అంతేకాని ప్రకృతి..మనస్సు అంటూ పాఠాలు చెప్తే పరారైపోతాం. అదే జరిగింది ఇక్కడ.ముఖ్యంగా సినిమాలో యూత్ అప్పీల్ ఎక్కడా లేదు. ఈ కాలం యూత్ ని రిప్రజెంట్ చేసే సన్నివేశాలు లేవు. ఇలాంటి సినిమాలకు మహారాజ పోషకులైన మిడిల్ క్లాస్ కుర్రకారు ఐడింటిఫై చేసుకుని క్యారక్టర్స్ కావవి. ఇలా జనాభిప్రాయాన్ని ప్రతీ విషయంలోనూ సినిమా విభేధిస్తూ వెళ్లిపోయింది.
సందీప్ కిషన్ ఖర్చైపోయాడు
నిజానికి ఈ సినిమాలో సందీప్ కిషన్ పెద్దగా చేయటానికి ఏమీలేదు. అతనికి ఈ సినిమా హిట్టైనా పెద్దగా అతని గురించి మాట్లాడుకునే సినిమా అవ్వదు. హీరోయిన్ అమైర దస్తూర్ అందంతో ఆకట్టుకుంది కానీ..నటనపరంగా జస్ట్ ఓకే. ప్రియదర్శిని పెద్దగా ఫన్ కు వాడుకోలేదు. మంజుల కూతురు జాన్వీ మాత్రం దుమ్ము రేపింది. సినిమాలో అన్ని మార్కులు ఆమెకే. త్రిదా చౌదరి బికినీలో ఎక్స్‌పోజింగ్ చేయటానికే పరిమితం చేసేసారు.
తొలి దర్శకత్వం ఎలా ఉందంటే..
మంజుల ...దర్శకత్వ ప్రతిభ ఉన్నా ..అది ఈ పరమ రొటీన్ కథ,బోరింగ్ నేరేషన్ వెనక మరుగున పడిపోయింది. ప్రకృతి గురించి గొప్పగా చెప్తూ తీయటమే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం అనుకోవాలి. అయితే అదీ కనెక్టు అయ్యే రీతిలో ప్రెజెంట్ చేయలేదు. యోగా క్లాసులు పెద్ద తెరపై చూస్తున్నట్లు అనిపించాయి కొన్ని సీన్స్ అయితే. అయితే అనుభవలేమి కనపడలేదు కానీ అద్బుతమూ జరగలేదు. మిగతా విభాగాల్లో కెమెరా వర్కుకు మంచి మార్కులు పడతాయి. పాటలు సోసోగా ఉన్నాయి. ఎడిటర్ గారు చాలా సార్లు మొహమాట పడినట్లున్నారు. మిగతా విబాగాలు సినిమాకు తగ్గట్లే అవుట్ పుట్ ఇచ్చాయి.
ఫైనల్ ధాట్
ఎవరినీ పట్టించుకోకుండా ... మన మనస్సుకు నచ్చింది..తీసినప్పుడు జనాలు వాళ్ల మనస్సుకు నచ్చిన సినిమాలనే ఎంకరేజ్ చేస్తారు. చెల్లుకు చెల్లు..అంతే.