'బాహుబలి' టు ది పవర్ ఆఫ్ 'బాహుబలి' ( ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రివ్యూ)
ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి...‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’విషయం రివీల్ అయ్యిపోయింది. దానితో పాటు 'బాహుబలి' పార్ట్ 1 లో రేకిత్తించినన ఎన్నో ప్రశ్నలకు కంక్లూజన్స్ దొరికేసాయి. ఫుల్ హ్యాపీస్. అయితే ఇదంతా ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందని రిలీఫ్ తో వచ్చిన ఆనందమా , నిజంగానే బాహుబలి పార్ట్ 2 మన ఊహకందని స్దాయిలో ఉందా, మొదటి పార్ట్ లో మిస్ అయిన ఎమోషన్స్, డ్రామా ఈ సెకండ్ పార్ట్ లో ఉన్నాయా... లేక కేవలం మీడియా సాయింతో క్రియేట్ చేసిన హైప్ యోనా , మొదటి భాగాన్ని మించే,మైమరిపించే సక్సెస్ సాధిస్తుందా..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథలో కథనం ఇదే...
అమరేంద్ర బాహుబలిని(ప్రభాస్) చంపిన నీచుడ్ని నేనే అంటూ కట్టప్ప(సత్యరాజ్) చెప్పే మాటలతో మొదట భాగం ముగిస్తే...ఈ రెండో భాగం అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటించటంతో మొదలు అవుతుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. ఆ క్రమంలో .. కుంతల రాజ్యానికి చేరుకుంటాడు మన అమరేంద్ర బాహుబలి. పనిలిపనిగా... ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడి, ఆమె ప్రేమను గెలవటానికి తాను మాహిష్మతి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తినన్న విషయాన్ని దాచి పెట్టి ఓ అమాయకుడిలా నటిస్తూ ఆ రాజ్యంలోనే ఉంటాడు.
అయితే ఈలోగా బాహుబలి ...కాబోయే చక్రవర్తి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక కుతకుతలాడుతున్న భళ్లాలదేవుడు(రానా) దేవసేన చిత్రపటాన్ని చూసి ఆమెపై మనసు పడతాడు. రాజ్యాన్ని, ఆమెను సొంతం చేసుకోవడానికి ఫిక్స్ అవుతాడు. అందుకోసం ఓ కుతంత్రం పన్నుతాడు. దాంతో చక్రవర్తి కావాల్సిన అమరేంద్ర బాహుబలి జాతకం తిరగపడతుంది. అక్కడ నుంచి భళ్లాల దేవుడుదే పై చేయి అవుతుంది. భల్లాలదేవుడు చక్రవర్తిగా, బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రకటింపబడతారు.
అమరేంద్ర బాహుబలిని ప్రేమించిన దేవసేన కి సైతం కష్టాలు మొదలౌతాయి...అంతఃపుర బహిష్కరణ శిక్ష పడుతుంది. మరో ప్రక్క కట్టప్ప... అమరేంద్ర బాహుబలిని చంపే పరిస్దితి వస్తుంది. ఇంతకీ అమరేంద్ర బాహుబలిపై... భళ్లాల దేవ చేసిన ఆ కుతంత్రం ఏమిటి... కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది...తనతండ్రి కథ తెలుసుకున్న శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి (ప్రభాస్) ఏ విధంగా భళ్లాళ దేవుడుపై పగ తీర్చుకున్నాడు అనేది తెరపైన మాత్రమే చూసి తెలుసుకోవాల్సిన విషయం.
ఓవరాల్ చూస్తే...
బాహుబలి ...బ్యాక్ గ్రౌండ్ మారి తెరకెక్కిన రెగ్యలర్ పగ,ప్రతీకారం మార్క్ కథా చిత్రమే అని అర్దమవుతుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ ని వెయ్యేళ్ల కాలంనాటి రాజుల కాలంలోకి తీసుకువెళ్లి మెప్పించటంలోనే దర్శకుడు రాజమౌళి ప్రతిభ అంతా దాగి ఉంది. ఇక కథన పరంగా చెప్పాలంటే... బాహుబలి అనే ఓ అతి పెద్ద సినిమాకి ఈ కంక్లూజన్ ... సెకండాఫ్ అని అర్దమవుతుంది. మన తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా అనుసరించే స్క్రీన్ ప్లే విధానం గుర్తు చేసుకుంటే... ఫస్టాప్ అంతా పాత్రల పరిచయం చేసి, సమస్యతో ఇంటర్వెల్ ఇచ్చినట్లే బాహుబలి అనే పెద్ద సినిమాకు ఫస్టాప్ లో సినిమాలో పాత్రలు, వాటి మధ్య రిలేషన్స్, కథలో కీలక సమస్య ఎస్టాభ్లిష్ చేసి, ఓ మిస్టరీ క్వచ్చిన్ తో ఇంటర్వెల్ ఇచ్చి ముడేసారు. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో ఆ ముడిలన్నిటినీ మచ్చటగా విప్పుకుంటూ వచ్చి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఈ ముడులు విప్పే ప్రాసెస్ లో కొన్ని చోట్ల లాగినట్లు అనిపించింది, మరి కొన్ని చోట్ల డోస్ ఎక్కువైందనిపించింది.
ప్లస్ లు ...మైనస్ లు
ఇక ప్రత్యేకంగా ఈ రెండు పార్ట్ ఎలా ఉంది అనే ప్రశ్నకు ... అంచనాలు మించి ఉంది అనటంలో అతిశయోక్తి లేదు. రాజమౌళి ఆ స్దాయిలో కష్టపడ్డారు. నేను చెప్పేది కథ విషయంలో కాదు..., విజువల్స్ విషయంలో. సినిమా అనేది డైరక్టర్స్ మీడియం, విజువల్స్ లో కథ చెప్పాలి, డైలాగ్స్ తో కాదు అని నమ్మి రాజమౌళి సీన్స్ డిజైన్ చేసినట్లు అర్దమవుతుంది. అదే ఈ సినిమాకు ప్లస్. చాలా చోట్ల విజువల్ వండర్ లా కనిపిస్తుంది. ఇండియన్ స్క్రీన్ పై మరీ ముఖ్యంగా తెలుగు తెరపై ఇలాంటి సీన్స్ చూడలేదనే భావన కలిగించారు. దాంతో మొదటి పార్ట్ కన్నా బాహుబలి ...ది కంక్లూజన్ మాడు,నాలుగు మెట్లు పైకెక్కింది.
స్క్రీన్ ప్లే సంగతులు
'అతడు' సినిమాలో బ్రహ్మాజి కు తణికెళ్ల భరణికి మధ్య ఓ డైలాగు వస్తుంది... "వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటాయి..గట్టు దాటుతుంటే వేసేస్తాం..లక్కీగా దాటాడే అనుకో... చుక్కల కూడు దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటాయి. ఒక వేళ అక్కడా మిస్సయ్యాడో అనుకో... సర్వే తోపు చివర్లో ..ఈ సారి ఐదు సుమోలు పెడతాను..." . ఆ డైలాగులో మహేష్ ని వేసేయటానికి స్కెచ్ వేసినట్లుగా..ఈ సినిమాలో ప్రేక్షకుడుని కట్టిపారేయటానికి రాజమౌళి ... స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు. ఒక సీన్ లో ప్రేక్షకుడు శభాష్ అనకపోయినా..ఇంకోచోట..అక్కడ మిస్సైనా..ఇంకో చోట...అక్కడ మిస్సైనా మరో చోటా.... శభాష్ అనాల్సిందే అన్నట్లుగా...సినిమా మొత్తం ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సీట్ల నుండి కదలకుండా చేసారు.
ఇక ఈ సినిమాలో మరో ప్రధాన అంశం...క్యారక్టైరేజేన్స్... అమరేంద్ర బాహుబలి, భళ్లాళ దేవ, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి ఇలా వరసపెట్టి అన్ని క్యారెక్టర్స్ ఫెరఫెక్ట్ గా డిజైన్ చేసారు. సాధారణంగా సినిమాలో ఒకటో రెండో క్యారక్టర్స్ ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక గుర్తుంటాయి. ఆ ఎమోషన్స్ మనస్సులో ఉంటాయి. కాని రచయిత విజియేంద్ర ప్రసాద్ గొప్పతనం ఏమిటీ అంటే ...ఆ క్యారక్టర్ డెప్త్ నుంచి వాటిని తీసుకోవటం, భావోద్వేగాలను పండించటం.
బాహుబలి 2 లో విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి...సీన్స్ లో చాలా చోట్ల విజుల్స్ పడే స్దాయిలో ఉన్నాయి. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి డల్ అయ్యిపోయింది. దానికి కారణం ...అమరేంద్ర బాహుబలి ఫ్లాష్ బ్యాక్ తోనే సినిమా మొత్తం నింపేయటం. నిజానికి అసలు కథేంటి తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి...తన తండ్రికు ద్రోహం తలపెట్టిన భళ్లాళ దేవ ని చంపి, ధర్మాన్ని ప్రతిష్టంచటం. తన తల్లికి భళ్లాల దేవ చెర నుంచి తప్పించటం.
అయితే చెర నుంచి తప్పించే కార్యక్రమం ...ఫస్ట్ పార్ట్ లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో తానెవరో ...తన తండ్రికు జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకున్నాడు. తక్షణ కర్తవ్యం నిర్ణయించుకుని విలన్ అయిన భళ్లాల దేవపై యుద్దం ప్రకటించే సరికే ప్రీ క్లైమాక్స్ వచ్చేసింది. దాంతో ఓ పెద్ద ఫైట్ చేసి అర్జెంట్ గా కథ ముగించాల్సి వచ్చింది. దాంతో హీరో అయిన మహేంద్ర బాహుబలి పాత్ర ..పూర్తి ప్యాసివ్ గా మారిపోయింది. ఈ సెకండ్ పార్ట్ అతను చేసే పని ఏమిటయ్యా అంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఓపిగ్గా వినటం, చివర్లో ఓ ఫైట్ చెయ్యటం మాత్రమే. దాంతో మహేంద్ర బాహుబలి పాత్ర నుంచి యాక్షన్ ఎక్సెపెక్ట్ చేస్తే నిరాశ ఎదురైంది.
అలా కాకుండా ... ఈ సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ వచ్చే సమయానికి అమరేంద్ర బాహుబలి పాత్రకు సంభందించిన ఫ్లాష్ బ్యాక్ పూర్తి చేసేస్తే...మహేంద్ర బాహుబలికి , భళ్ళాల దేవకు మధ్య కొన్ని సీన్స్ వచ్చేవి. అలా జరగకపోవటంతో ఈ సెకండ్ పార్ట్ లో లైవ్ తగ్గిపోయింది. పూర్తిగా గతంలో పాతికేళ్ల క్రితం జరిగిన సీన్స్ మననం చేస్తూ నడిచిపోయింది. భళ్ళాళదేవకు...తన తమ్ముడు కొడుకు బ్రతికి తన మీద పగ తీర్చుకోవటానికి వస్తున్నాడని అని తెలిసి , యాక్షన్ మోడ్ లోకి వచ్చేసరికి క్లైమాక్స్ సమీపించింది. దాంతో ఆ పాత్ర ఏమీ చేయలేకపోయింది. ఇలా సినిమాలో ప్రధానపాత్రలు రెండు ప్యాసివ్ గా మారటంతో సెకండాఫ్ ఎంత విజువల్ ఫీస్ట్ గా నడిచినా, డ్రామా మెయింటైనా చేసినా ఓ టైమ్ లో విసుగు అనిపించింది. కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది లాగినట్లు అనిపించింది అన్న ఫీల్ వచ్చింది. ఈ చిన్న మార్పు చేసి ఉంటే మరింత అద్బుతంగా ఉండేదనంటలో సందేహం లేదు.
వాళ్లు యాక్టర్స్ కాదు..క్యారక్టర్స్
ఈ సినిమాలో క్యారక్టర్స్ బలంగా రాయటం, అంతకన్నా గొప్పగా వాటిని ఓన్ చేసుకుని ప్రభాస్, రానా, రమ్యకృష్ణ,సత్యరాజ్,నాజర్ వంటి వారు పండించటంతో నిండుతనం వచ్చేసింది. తెరపై హీరో,హీరోయిన్స్,విలన్ కనిపించకుండా కొన్ని ఎమోషన్స్ తో కూడిన పాత్రలు కనిపించాయి చాలా సన్నివేశాల్లో. అందుకు ఆ స్దాయి నటన రాబట్టిన దర్శకుడు గొప్పతనం, ఆయన మనస్సులో ఏముందో, పాత్ర ఏం డిమాండ్ చేస్తుందో గమనించి, అందులోకి పరకాయ ప్రవేశం చేసిన నటీనటులు గొప్పతనమూను. ఇక్కడ ప్రభాస్ ఒక్కడే బాగా చేసాడు. మరొకరు తక్కువ చేసారని కాకుండా అందరూ ఓ అద్బుతమైన చిత్రంలో , ప్రపంచం మొత్తం ప్రశంశించబోయే జానపదంలో నటిస్తున్నామని తమ పీక్స్ ని చూపించారు. సాహో ప్రభాస్ అండ్ టీమ్. అనుష్క కూడా బయిట చూపించినట్లు లావుగా లేదు..గ్రాఫిక్స్ లో చెక్కారో మరేమో కానీ చాలా బాగుంది.
ఇక ఈ సినిమా ఈ స్దాయిలో తెరకెక్కి, ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా మారిందంటే దానికి ఏకైక కారణం అంతర్జాతీయ ప్రమాణాలతో తమ ప్రతిభను చూపిన ఈ సినిమా సాంకేతిక నిపుణులే అని చెప్పాలి. కీరవాణి సంగీతం, రీరికార్డింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది కానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత గొప్పగా పాటలు అయితే లేవు. కానీ విజువల్ గా అన్ని పాటలను ఇరగదీసి వదిలారు రాజమౌళి. కీ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ప్లస్ అయ్యింది.
టెక్నికల్ టీమ్ ఎలా చేసారంటే...
ఇక సెంధిల్ కెమెరా వర్కు గురించి , సబు శిరిల్ ఆర్ట్ వర్క్ , కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్, రమా రాజమౌళి, ప్రశాంతిల స్టైలింగ్ ఒక దానికొకటి పోటీ పడ్డాయి. కాకపోతే ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటే మరింత బాగుండేదనిపించింది
ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పాలంటే... నిర్మాతలు కోట్లు గుమ్మరించి, రాజీపడకండా సహకరించి, ఈ సినిమాకు అంతర్జాతీయ లుక్ తీసుకురావటంలో తీసుకువచ్చారనుకోండి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాకు అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.
ఇక విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను నిలబెట్టాయి. . అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన తెలుగు సినిమాగా ప్రేక్షకుడు అనుభూతి పొందుతాడు. ఒక సినిమాలో ఇన్ని బలమైన పాత్రలను మరోసారి చూడలేమేమోనన్న రీతిలో చూపించాడు జక్కన్న.మొత్తంగా 24 విభాగాలనూ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది
పాటలు, మాటలు
పాటల్లో కూడా ఓ రెండు...ఫస్ట్ పార్ట్ కన్నా అద్బుతంగా విజువలైజ్ చేసి, తెరకెక్కించారు. ఇంటర్వెల్ అయిన తర్వాత కాస్సేపటికి కాస్త డోస్ ఎక్కువైందనిపించినా, తర్వాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కు ఆ ఆలోచనే లేకుండా పోయింది. అలాగే ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిన విఎఫ్ ఎక్స్ ... దోపిడి దొంగల ఎపిసోడ్స్ లో తప్ప అంతా బాగున్నాయి. డైలాలుగు జస్ట్ ఓకే అనిపించాయి. రాజమౌళి గత చిత్రాల స్దాయిలో డైలాగులు లేవు, అలాగని, బాగోనూ లేకుండా లేవు. సాహోరె బాహుబలి, దండాలయ్య పాటలు రెండూ బాగున్నాయి. అయితే పాటలని చిత్రీకరించిన విధానం మాత్రం అదుర్స్. ఇక పాటలకు రాసిన లిరిక్స్ మాత్రం చాలా అర్దవంతంగా ఉండటం విశేషం.
రాజమౌళికి ఆ పేరు కరెక్టే...
జక్కన్న అనే పేరుని ఈ సినిమాతో సార్దకనామధేయం చేసుకున్నారు రాజమౌళి. తెరపై విజువల్స్ చూస్తూంటే...భవిష్యత్ లో తెలుగు సినిమా అవతార్ లాంటి సినిమాలు ఊహించినా ఆశ్చర్యపడక్కర్లేదనే ధీమా వచ్చేస్తుంది. ఆయన డెడికేషన్, ప్రతీ సీన్ ని ఓ విజువల్ వండర్ లా చెక్కాలనే ఆయన తపన...చూస్తూంటే సినిమా చివరకి..బాహుబలి అనే టైటిల్ రాజమౌళికే ఇవ్వాలనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతో ఆసక్తి రేపిన బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం ఇచ్చారు. ఏ మాత్రం బాలెన్స్ తప్పినా సినిమా గతి తప్పుతుందని ఆయనకు స్పష్టంగా తెలిసి, ఫెరఫెక్ట్ అంచనాలతో , అంచనాలును అందుకున్నారు.
ఒకటే నిరాశ...
బాహుబలి ది బిగినింగ్ ..ని ...తన దైన శైలి స్క్రీన్ ప్లే, గూస్ బమ్స్ వచ్చే ఎపిసోడ్స్ తో రూపొందించిన రాజమౌళి....ఈ రెండో భాగం మాత్రం రెగ్యలర్ ఫ్యామిలీ డ్రామా, ప్రెడిక్టబుల్ సీన్స్, రాజకీయాలతో నడిపేసారనిపిస్తుంది. అయితే మొదటి పార్ట్ కన్నా విజువల్ గ్రాండియర్ గా ఉందనటంలో సందేహం ఏ మాత్రం లేదు. ఇలా జరగటానికి కారణం... ఒకే కథని రెండు భాగాలుగా చెప్పటం కావచ్చు.
బోటమ్ లైన్
ఫైనల్ గా కథా పరంగా ఈ సినిమా రొట్టకొట్టుడు అనిపించినా, విజువల్స్ మాత్రం టైటిల్ కు న్యాయం చేస్తూ గ్రాండియర్ గా సాగాయి. మన తెలుగులో ఎప్పుడో కానీ ఈ స్దాయి సినిమాలు రావు. అలాగే ఏ పైరసీ సీడిలోనే చూడటమో, లేక టీవిల్లో వచ్చాక చూద్దామనుకునే సినిమా కాదు. ఈ రేంజి విజువల్ ట్రీట్ కళ్ళకు...ఐ ఫీస్ట్ లా అందించాలంటే ధియోటర్ లోనే చూడటం ఉత్తమం.
(అయితే రివ్యూ చదివినంత మాత్రాన నేను ఆ విషయం చెప్పేస్తాను అని ఆశపడద్దు, కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో మీరు ధియోటర్ కు వెళ్లే చూడండి... అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా రివీల్ చేయకండి, సోషల్ మీడియాలోనూ ఆ సీక్రెట్ చెప్పకండి...ఈ స్దాయి సినిమాకు ఇచ్చే గౌరవం ఇవ్వండి.)