'బాబు బాగా బోర్ ( బిజి)' (రివ్యూ)
అడల్ట్ సినిమాలకు పెద్ద దిక్కుగా నిలిచిన షకీలా రిటైరయ్యి చాలా కాలం అయ్యింది. మళయాళ పరిశ్రమ ఆ టైప్ సినిమాలు తీయటం మానేసారు. తెలుగులో కూడా ఎవరూ ధైర్యం చేయటంలేదు. కొన్ని దశాబ్దాలు పాటు తెలుగులో ఓ వెలుగువెలిగిన అడల్ట్ సినిమా జానర్ మాయమైనపోయినట్లేనా, చరిత్ర ముగిసినట్లేనా...పునరిద్దరించటానికి దర్శక,నిర్మాతలు చర్చలు తీసుకోరా. అని ఆడియన్స్ అడపాదడపా ..ఫేస్ బుక్ లో మీటింగ్ లు పెట్టుకుని మరీ బాధపడుతున్న వేళ...నేనున్నా అంటూ...అనంతమైన ఆశలతో 'బాబు బాగా బిజి ' ధియోటర్స్ లోకి దిగింది.
పోస్టర్స్, టైటిల్,టీజర్స్, ట్రైలర్స్ తో ఎన్నో ఆశలు కలిపించింది. ధైర్యం కోల్పోకండి... అని అభయమిచ్చింది. దాంతో రాకరాక వచ్చిన ఈ సినిమాను సక్సెస్ చేయకపోతే..ఇలాంటి సినిమాలు తీసేవారు ఇక ముందు రోజుల్లో రారేమో.. అని ఎన్ని పనులున్నా, ప్రక్కనే బాహుబలి ఉన్నా.అవన్నీ వదిలేసి...ధియోటర్స్ దగ్గర జనం ఎగబడ్డారు. ఫలితం ఏమైంది.. ఆకలిగొన్న ఆడియన్స్ ఆశలు నెరవేరాయా... ఈ సినిమా ఎప్పటిలా మెసేజ్ ముసుగులో ఉన్న బూతు సినిమాయేనా ..లేక బూతు ముసుగులో ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ కావ్యమా... తెలియాలంటే... సినిమాకి వెళ్లాలి..అప్పటివరకూ... రివ్యూ చదావల్సిందే.
కథేంటి...
సాప్ట్ వేర్ ఇంజినీర్ మాధవ్(అవసరాల శ్రీనివాస్) యుక్తవయస్సు వచ్చినప్పటినుంచీ ప్లేబాయ్ మనస్తత్వం తో చెలరేగిపోతూంటాడు. తనను తాను సెక్స్ ఎడిక్ట్ గా అభివర్ణించుకునే మాథవ్.... ఎప్పుడు అమ్మాయిలను,ఆంటిలను లైన్ లో పెట్టే పనిలో బిజీగా ఉంటాడు. అలా అక్రమసంభందాలతో ఆనందకరమైన జీవితం గడుపుతున్న మాధవ్ ఒక దశలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తాడు. అయితే ఎందుకైనా మంచిదని... పెళ్లి చూపుల్లో తన గురించి నిజాయితీగా గతాన్ని చెప్పేస్తూంటాడు. యధావిదిగా... అతడి కథంతా విన్న అమ్మాయిలంతా అతన్ని ఛీకొట్టి తరిమేస్తూంటారు.
దాంతో ఇక ప్రతీ సంభందం బెడిసి కొడుతోందని, ప్రెండ్ బలవంతం మేరకు రాధా (మిస్తీ)కి మాత్రం గతం చెప్పకుండా దగ్గరవుతాడు. ఆమెతో మాధవ్‌కి పెళ్లి దాదాపు ఓకే అయ్యి, ఎంగేజ్ మెంట్ దాకా వస్తుంది. అయితే చివరి నిముషాల్లో ఆమెకు కూడా గతం చెప్పేయాలనుకుంటాడు. గతం తెలిస్తే పెళ్లి చెడిపోతుందని తెలిసినా ...ఆమెకు ఎందుకు చెప్పాలనుకుంటాడు. చెప్పిన తర్వాత ఏమైంది. ఆమె పెళ్లికి ఓకే చేసిందా.. మాధవ్ లైఫ్ లోకి వచ్చిన పారు(మదివాడ తేజస్వి).. శోభ(శ్రీముఖి).. చంద్రిక (సుప్రియ) కథలేంటి? వాళ్ల జీవితాలు ఏం టర్న్ తీసుకున్నాయి.. వంటి విషయాలు తెలియాలంటే సినిమా పూర్తి గా చూడాల్సిందే.
విశ్లేషణ...
ఎనభైల్లో, తొంభైల్లో రొమాంటిక్ సినిమాలు పేరట అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చేవి. అవి ఇంటర్ నెట్ రోజులు కాకవటంతో జనం గుట్టు చప్పుడు కాకుండా ధియోటర్స్ కు వెళ్లి ఆ సరదా తీర్చుకుని వచ్చేవారు. ప్రతీ టౌన్ లో తప్పనిసరిగా ఈ తరహా సినిమాలు ఆడించటానికి ఓ ధియోటర్ ఖచ్చితంగా ఉండేది. అది ఎంతమూల ఉన్నా జనం వెళ్లేవారు. ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాల్లో సెక్స్ బిట్స్ కలిపి ప్రదర్శించే టెక్నిక్ కనిపెట్టి సక్సెస్ అయ్యారు ధియోటర్స్ వారు.
ఈ లోగా షకీలా వంటి అడల్ట్ హీరోయిన్స్ రంగంలోకి దూకి , వాళ్లు పాపులర్ అయ్యారు. ముఖ్యంగా మళయాళ డబ్బింగ్ సినిమాలకు అవి గోల్డెన్ డేస్. అలాగే అప్పట్లో లేడీస్ టైలర్ వంటి అడల్ట్ కామెడీలు, రతినిర్వేదం వంటి క్లాసిక్ పిక్చర్స్ వచ్చాయి . అయితే రోజులు మారాయి.. ప్రతీది అంతర్జాలంలో కీ బోర్డ్ దూరంలో దొరికేస్తోంది. ప్రత్యేకంగా పనిగట్టుకుని ధియోటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరం కనిపించటం లేదు. దాంతో ఆ తరహా సినిమాల హవా తగ్గిపోయింది.
అయితే ఈ మధ్యకాలంలో మారుతి... ఈ రోజుల్లో, బస్ స్టాప్ అంటూ మళ్లీ సమర్దవంతంగా బూతుని మార్కెట్లో ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యాడు. కానీ ఎందుకనో అది ట్రెండ్ కాలేదు. ఆ ట్రెండ్ ని కొనసాగించులుకున్నారో ఏమో బాబు..బాగా బిజిని దింపారు. అయితే దురదృష్టం ఏమిటంటే..ఈ సినిమా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. దర్శకుడికి...పూర్తి బూతు తీసే ధైర్యమూ లేదు..అలాగని బూతును వదలేసి రొమాంటిక్ కామెడీగానూ సినిమాను తియ్యలేదు. బూతుకు, రొమాన్స్ కు మధ్య ఉన్న చిన్న గీతను గమనించలేక బోల్తా పడ్డాడు. దాంతో ట్రైలర్స్ చూసి ఆశపడి వెళ్లిన ఆడియన్స్ కు కన్ఫూజన్ కు తప్ప ఏమీ ఈ సినిమాల్లో దొరక లేదు. మ్యావ్ వంటి కొన్ని కాన్సెప్టు లు ధియోటర్స్ లో నవ్వులు కురిపించినా, అవి ఎంతోసేపు నిలవలేదు.
రీమేక్ ని రప్పాడించి...
హిందీలో విజయవంతమైన `హంటర్` చిత్రాన్ని తెలుగులో `బాబు బాగా బిజీ` పేరుతో రీమేక్ చేశారు. ముఖ్యంగా హిందీ సినిమాలో ఎలివేట్ అయిన అంశం...అసలు హీరో...సెక్స్ ఎడిక్ట్ గా ఎందుకు మారాడు అన్నది తెలుగుకు వచ్చేసరికి స్పష్టంగా చెప్పలేకపోయారు. చిన్న సంఘటన తో చెప్పినా సరిపోయే దాన్ని రీళ్లకు రీళ్లు సాగతీసి జనాలను చంపారు. ఆ సాగతీతకు తోడు..విరక్తి కలిగించే పాటలు. ఇంకా చెప్పాలంటే కేవలం ట్రైలర్ లో ఉన్న సీన్స్ మాత్రమే సినిమాలోనూ వర్కవుట్ అయ్యాయి. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు.
ఏదన్నా సీన్ పొరపాటున పండితే ,జనాలికి ఎక్కడ నచ్చేస్తుందో అనే భయంతో సకల జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారా అనిపిస్తుంది. దీనికి తోడు శ్రీముఖి లాంటి క్రేజ్ ఉన్న అమ్మాయిని తీసుకుని ఆమెపై అసలు సీన్స్ లేకుండా చేసారు. తేజస్వి కూడా కేవలం ఏ మాత్రం ఆసక్తి కలిగించిన పాత్రగా మిగిలిపోయింది. వీటినన్నటినీ చూస్తూంటే దర్శకుడు పూర్తి స్దాయిలో ఫెయిలయ్యారని అర్దమవుతుంది.
ఏ సీన్ కా ఆ సీన్ ఉన్నంతలో ఎంటర్టైన్ చేయాలనే చూసాడు కానీ, సినిమాలో ఓవరాల్ ఎమోషన్ ఏదీ పట్టుకుని అటు వైపు జర్నీ చేయలేదు.
ఇక అవసరాల శ్రీనివాస్..నటన విషయానికి వస్తే... ఎనీ ఎమోషన్ సింగిల్ ఎక్సప్రెషన్ అన్నట్లుగా ఒకే ఎక్సప్రెషన్ సినిమా అంతా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అదేమన్నా కొత్తతరహా ప్రయోగమేమో అడగాలి. ఇక ఉన్నంతలో అతని పాత్రకు రాసిన మాటలు స్పెషల్ ఎంట్రాక్షన్ గా నిలిచాయి.
సాంకేతికంగా...నిర్మాణపరంగా
ఈ సినిమాలో చెప్పుకోదగినది సినిమాటోగ్రఫీ. కొత్త దర్శకుడు నవీన్ మేడారం ...సేఫ్ జోన్ లో ఉంటుందని అడల్ట్ సినిమా రీమేక్ తో లాంచ్ అయ్యారు కానీ...తెలుగు రీమేక్ కు చెయ్యాల్సిన వర్క్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. చేసిన కొద్ది మార్పులు అసలు వర్కవుట్ అవ్వలేదు. హిందీ సినిమా యాజటీజ్ తీసినా బాగుండేదనిపించింది. పాటల్లో ఒక పాట తప్ప మిగతావన్నీ అసలు వినలేని పరిస్దితి. ఎడిటింగ్ గురించి చెప్పేదేముంది. ఎంత ఎక్కువ ట్రిమ్ చేస్తే అంతగా జనం ఆనందించి ఎడిటర్ కు ధాంక్స్ చెప్పుకుందురు. అబిషేక్ పిక్చర్స్ వారు...ఈ సినిమాకు ఇది చాల్లే అనుకున్నారో ఏమో ...క్వాలిటీ కోసం ఖర్చు పెట్టినట్లు లేరు. చాలా చోట్ల చుట్టేసారేమో అనే ఆలోచన కలుగుతుంది.
ఫైనల్ గా...
ఈ సినిమా ని దర్శకుడు మారుతి డీల్ చేసి ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. ఇలాంటి సినిమాల్లో ఏ మేరకు కామెడీ నింపాలి, ఎక్కడ అడల్ట్ కంటెంట్ ని పెంచాలో సరిగ్గా తూకం వేసి ఖచ్చితంగా హిట్ కొడుదుడు అని అనిపిస్తుంది.