చెట్టు క్రింద ప్లీడర్... 2.0.('సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రివ్యూ )
ఏదో హాస్య నటుడుగా ఉన్నప్పుడు కామెడీ చేసామంటే అర్దం ఉంది...కష్టపడి హీరోగా అయ్యాక కూడా ఇంకా కామెడీనే చేయాలా...జనాలని నవ్వించాలా...మిగతా హీరోల్లా మేము రౌడీలతో ఫైట్స్ చేయకూడగా, సాంగ్స్ కు స్టెప్స్ వేయకూడదా..వెటకారంతో కూడిన పంచ్ డైలాగులు విలన్ తో చెప్పకూడదా... అని కమిడయన్ నుంచి హీరోలు గా ప్రమోషన్ తీసుకున్న వారికి అనిపించటం సహజం. అయితే వీళ్ల సినిమాలు డబ్బులు పెట్టి చూసే జనం కూడా అలాగే వీళ్లలాగే ఆలోచిస్తే ఏ సమస్యా ఉండదు. లేకపోతే కామెడీ చెయ్యటం లేదని సునీల్ సినిమాలను తిప్పి కొడుతున్నట్లుగా ఉంటుంది పరిస్దితి.
హాస్యనటుడిగా వెండితెరకు పరిచయమైన సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మెల్లిగా హీరో అయ్యి... 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' అంటూ ఓ తమిళ రీమేక్ లో చేసాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఘన విజయాన్ని సాధించిన 'జాలీ ఎల్‌ఎల్‌బి'ని 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'గా రీమేక్ తో మన ముందుకు వచ్చాడు. పూర్తి కోర్టు డ్రామా గా హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో వర్కవుట్ అవుతుందా....తెలుగులో చేసిన మార్పులు ఏమిటి...ఇంతకీ ఇది కామెడీ సినిమానా...లేక సీరియస్ గా నడిచే కోర్ట్ డ్రామానా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి....
పుట్టిన ఊళ్లో లో తన తెలివితో చిన్న చిన్న గొడవలు పరిష్కరించే సప్తగిరి(సప్తగిరి) ..ఎల్‌ఎల్‌బి చేస్తాడు. ఆ తర్వాత అదే ధైర్యంతో కోర్టులో అడుగుపెడితే ఒక్క కేసూ గెలవలేడు. ఆ తెలివి తేటలు కోర్టుకు సరిపోవు అని అర్దం చేసుకుని కాస్తంత అనుభవం వస్తుంది... టౌన్ కు వెళ్తే పెద్ద, పెద్ద కేసులు దొరుకుతాయని.. బయిలుదేరతాడు. మరో ప్రక్క తన ఊళ్లో మరదలు పిల్ల చిట్టి (హీరోయిన్ కశిష్ వోరా)కు పెళ్లి సంభంధాలు చూస్తూంటారు. తను స్టార్ లాయిర్ ని అయ్యి ఆమె ని పెళ్లి చేసుకుని వస్తానని శపధం చేసి వచ్చాడు. అయితే టౌన్ కు వచ్చినా అతని అదృష్టం మారదు. సరైన కేసు ఒక్కటీ తగలదు. ఏం చేయాలో అర్దం కాదు.
సరిగ్గా అదే సమయంలో సల్మాన్ ఖాన్ కేసు టైప్ ( హిట్ అండ్ రన్ కేసు) సప్తగిరిని ఎట్రాక్ట్ చేస్తుంది. దాన్ని రాజ్‌పాల్(సాయికుమార్) అనే రామజట్మలాని టైప్ ..సీనియర్ లాయిర్ ..వాదించి ఆ కేసును కోర్టులో కొట్టించేస్తాడు. తన పేరు కోసం...ఆ హిట్ అండ్ రన్ కేసును సప్తగిరి తిరగతోడటం మొదలెడతాడు. కేసుపై పిల్ వేసి మరలా రీ ఓపెన్ చేయిస్తాడు సప్తగిరి. అందులో భాగంగా ఒక కీలకమైన సాక్షిని కూడా సంపాదిస్తాడు. అయితే ఆ తర్వాత అదంతా రాజ్‌పాల్ ఆడిన ఎత్తుగడ అని, ఈ సాక్షి వెనుక రాజ్‌పాల్ ఉన్నాడన్న రివీల్ అుతుంది.
షాక్ అయిన సప్తగిరి..సరే ..పేరు రాకపోయినా డబ్బు అయినా వస్తుందని.. రూ.20లక్షలు లంచం తీసుకుని ఆ కేసు నుంచి తప్పుకొంటాడు. అది తెలిసిన జనం తిట్టిపోస్తారు..మరదలు సైతం ఈసడించుకుంటుంది. తన తప్పు తెలుసుకున్న సప్తగిరి చనిపోయిన వాళ్లకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తాను రీ ఓపెన్ చేయించిన కేసులోని అసలు వాస్తవాల్ని తెలుసుకుని, ఆ కేసులో న్యాయం ఎంత అవసరమో గ్రహించి బాధితుల తరపున పోరాడటం మొదలెడతాడు. అక్కడ నుంచి కథ ఎత్తుకు,పై ఎత్తులు అన్నట్లుగా సాగుతుంది. సీనియర్ లాయిర్ రాజ్ పాల్ ను సప్తగిరిని ఎలా ఢీ కొట్టాడు, చివరికి కేసు గెలిచాడా, లేదా అనేదే సినిమా.
చెట్టు క్రింద ప్లీడర్ 2.0
న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్లి..ఎంతకైనా తెగించి పోరాడే ఓ చిన్న లాయర్ కథ ఇది . ఇలాంటి స్టోరీ లైన్ తో అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీగారి దర్శకత్వంలో ...చెట్టు క్రింద ప్లీడర్ అనే సినిమా వచ్చింది.అంతుకు ముందు పద్మనాభం హీరోగా పొట్టిప్లీడర్ అనే సినిమా వచ్చింది...ఇప్పుడు ఈ కాలానికి తగినట్లుగా సప్తగిరి ఎల్ ఎల్ బి వచ్చింది. ఓరకంగా చెప్పాలంటే చెట్టుక్రింద ప్లీడర్ సినిమాకు లేటెస్ట్ వెర్షన్ లా ఉంటుంది. అయితే అందులో ఆ లాయిర్ కు ఎదురైన కేసు వేరు..ఇప్పుడు ఈ సప్తగిరి అనే లాయిర్ కు ఎదురైన కేసు వేరు. అంతే తేడా. రీమేక్ సినిమా గాబట్టి కథ గురించిన విశ్లేషణ అనవసరం. అయితే పరుచూరి బ్రదర్స్...మాతృకలో లేని రైతులు ఎలిమెంట్ ని తీసుకువచ్చి..సినిమా స్దాయి పెంచారు. సీనియర్ రైటర్స్ అయిన వాళ్లను తీసుకోవటం సినిమాకు బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.
ఎక్సపెక్ట్ చేయం..అదే కీలకం
క్లైమాక్స్ లో ...కోర్టులో విచారణ సమయంలో ఫేమస్ లాయర్ రాజ్ పాల్(సాయి కుమార్) ను ఎదిరించే సన్నివేశాలలో విశ్వరూపం చూపించాడు సప్తగిరి. కామెడీ చేసుకుంటూ పోయే అతనిలో ఈ రేంజి ఎమోషన్ పండించటం ఎక్సపెక్ట్ చేయం. సప్తగిరిలో మంచి నటుడు దాగి ఉన్నాడు ..కేవలం కమిడియన్ మాత్రమే కాదు అని ప్రూవ్ చేసే సినిమా ఇది. అలాగే ఒరిజనల్ లో చేసిన బొమన్ ఇరాని, సౌరభ్ శుక్లా పాత్రలు తెలుగులో అంతసమర్దవంతంగా పండించగలరా అని జాలీ ఎల్ ఎల్ బి చూస్తున్నప్పుడు డౌట్ వస్తుంది . కానీ సాయికుమార్, శివప్రసాద్ లు ఇద్దరూ పోటాపోటి పడి మరీ ఈ సీన్స్ ని నిలబెట్టారు. ఎక్కడా తగ్గలేదు. వీరి నటనకు విజల్స్ వేయాలనిపిస్తుంది. ముఖ్యంగా జడ్జిగా శివప్రసాద్ అద్బుతంగా చేసారని చెప్పాలి.
అదే ఈ కొత్త దర్శకుడు ప్రత్యేకత అన్నమాట
ఎవరీ డైరక్టర్..భలే చేసాడే అని పొరపాటున కూడా ఏ సీన్ లోనూ అనిపించడు..లేదా ఇంత ఛండాలం గా ఎవరు డైరక్ట్ చేసారని తిట్టించుకోడు.. చాలా చాలా...నార్మల్ గా ఉంటుంది. అసలు డైరక్టర్ గుర్తుకురాకుండా ..అతని గురించి ఆలోచించకుండా సినిమా చూసేలా చేయటమే ఈ దర్శకుడు ప్రత్యేకత అన్నట్లు మేకింగ్ చేసారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే.నిర్మాణవిలువులు ఈ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. పాటలు గురించి మాట్లాడుకోవటం అనవసరం.
ఫైనల్ థాట్
కాస్తంత కామెడీ కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే సప్తగిరి బేసిగ్గా కమిడయన్ కదా.
ఏమి బాగుంది: క్లైమాక్స్ ,ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో సప్తగిరి,శివప్రసాద్, సాయికుమార్ ల నటన
ఏం బాగోలేదు: తెలుగు నెటివిటీకి తగినట్లు ఒరిజనల్ కథలో చేసిన మార్పులు
ఎప్పుడు విసుగెత్తింది : దండుపాళ్యం గ్యాంగ్ మనిషిలా సప్తగిరి చేసే కామెడీ, ఊర్లో ప్రభాస్ శ్రీను దగ్గర నిజం చెప్పించే సీన్స్
చూడచ్చా ?: జాలీ ఎల్ ఎల్ బి చూడకపోతే ..