టైమ్ పాస్ కోసం... ‘ఛలో’ (సినిమా రివ్యూ)
పచ్చ గడ్డ వేస్తే భగ్గుమనే రెండు ఊళ్లు...రెండు ఊళ్లకూ తరతరాల వైరం. దాంతో ఆ ఊరు వాళ్లు ఈ ఊరు రారు..ఈ ఊరు వాళ్లు ఆ ఊరు వెళ్లరు..అక్కడ అమ్మాయిని ఇక్కడ చేసుకోరు..ఇక్కడ అబ్బాయిని అక్కడ వాళ్లు ఏక్సెప్టు చేయరు. పైగా అక్కడ జనం ఎప్పుడూ ప్రక్క ఊరి మీదే దృష్టి...వేరే పనులు ఏమి పెద్దగా పెట్టుకోకుండా ఎప్పుడు ప్రక్క ఊరు వాడు వస్తాడా..గొడవ పెట్టుకుందామని ఎదురుచూస్తూంటారు. అలాంటి పరిస్దితిల్లో ఒక ఊరుకి చెందిన కుర్రాడు..ఆ ప్రక్క ఊరి ప్రెసిడెంట్ కూతురుతో ప్రేమలో పడిపోతాడు..దాంతో ఒక్కసారిగా రెండు ఊర్లు భగ్గుమంటాయి.
ఫైనల్ గా అటు తిరిగి..ఇటు తిరిగి..పల్లెటూళ్లు ప్రేమకు దేవాలయాలు అంటూ మొదలెట్టి ఓ సుదీర్గ ఉపన్యాసంతో ఆ ప్రేమ కోసం ఆ రెండు ఊళ్ళూ ఏకం అవటం వంటి కథలు ఈ మధ్యకాలంలో పెద్దగా రావటం లేదు...అందుకు కారణం...అసలు పల్లెటూళ్లలో జనం అంత ఖాళీగా ఉంటారంటే అదే పల్లెటూరు జనం కూడా నమ్మలేని స్దితి ఉండటం...కానీ నాగశౌర్య చిన్నప్పుడు ఈ కథలతో వచ్చిన సినిమాలు చూడటం.. తెగ నచ్చేసి ఉంటాయి. దాంతో తనే నిర్మాతగా దాదాపు ఇలాంటి కాన్సెప్టు తో మన ముందుకు వచ్చాడు.
కాకపోతే ఇందులో కొత్తేమిటంటే.. భాషాపరంగా రెండు వర్గాలుగా విడిపోయిన ఓ ఊరు చుట్టూ సీన్స్ అల్లి...కామెడీతో డీల్ చేయటం. ఆ కామెడీ జనాలకు నచ్చిందా... లేక యాజటీట్ గా ఆ ఓల్డ్ ఐడియాని కొత్త డిస్క్ లో నింపేసి వదిలేసారా... నాగశౌర్య కెరీర్ కు ఈ సినిమా అయినా కిక్ ఇచ్చి, నిర్మాతగా లాభాలు తెచ్చిపెడుతుందా.. ముఖ్యంగా ఫన్ తో రిలీజ్ చేసిన ప్రోమోలు జనాలని థియోటర్స్ దగ్గరకు లాక్కొచ్చాయి. దాంతో నాగశౌర్య ఏ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు రావటం జరిగింది. ఆ క్రేజ్ ని, జనాల నమ్మకాన్ని సినిమా నిలబెట్టిందా...అసలు ఈ కథలో కొత్త పాయింట్ ఏమిటి... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి (కథ)
ఏదో ఒక గొడవ లేనిదే...ముద్ద గొంతు దిగని ఓ చిత్రమైన టిపికల్ మైండ్ సెట్ హరి(నాగ శౌర్య)ది. దాంతో సహజంగానే తల్లితండ్రులు అతని పై బెంగపెట్టుకుంటారు. ఇలా గొడవల్లోనే ఆనందం వెతుక్కునే హరిలో మార్పు తేవాలంటే...రోజూ గొడవలు జరిగే ప్రాంతానికి పంపాలని, దాంతో గొడవలంటే విరక్తి వస్తుందని ఆలోచన చేస్తారు. అందుకోసం ఓ ప్రాంతం ఎంపిక చేసి పంపుతారు. అది తమిళనాడు..ఆంధ్రా బోర్డర్ లోని తిరుప్పురం. అక్కడ జనం ప్రాంతీయ విభేధాలతో ఎప్పుడూ కొట్టుకు ఛస్తూంటాడు. తమిళవాళ్లకు..తెలుగు వాళ్లకు నిముషం పడదు..రెండు వర్గాలు విడిపోయి మధ్య ఓ కంచె వేసుకుని గొడవలతో కొట్టుకుంటూ,నరుక్కుంటూ కాలక్షేపం చేస్తూంటారు.
ఆ ఎట్మాస్మియర్ హరికి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. హ్యాపీగా అక్కడ గొడవలు ఎంజాయ్ చేస్తూండగా... అతనికి లోకల్ గా ఉండే కార్తిక (రష్మిక) పరిచయమవుతుంది. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతారు. అయితే ఇక్కడే ఓ బీబత్సమైన ట్విస్ట్. ఆ అమ్మాయి మరెవరో కాదు..తమిళ గ్రూప్ కు చెందిన నాయకుడు కూతురు. మరి ఈ తెలుగు కుర్రాడు..ఆ తమిళ అమ్మాయిని ప్రేమిస్తే ఊరుకోరుకదా..ఇప్పుడు హరి ముందు ఉన్నది ఒకటే లక్ష్యం...ఆ అమ్మాయి తండ్రిని ఒప్పించాలి...దానికి తోడు ఆ అమ్మాయి సైతం ఓ కండీషన్ పెడుతుంది. అప్పుడు హరి ఏం చేసాడు...ఆమె పెట్టిన ఆ కండీషన్ ఏమిటి...ఫైనల్ గా వీళ్ల ప్రేమ ఎలా గెలిచింది..చివరకు ఆ రెండు ఊళ్ల మధ్య గొడవలు ఏమయ్యాయి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బాగున్నవి..బాగోలేనివి
స్టోరీలైన్ గా కొత్తగా బాగున్న ఈ చిత్రం కథ..ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేసరికే బాగా వీక్ అయ్యింది. అందుకు కారణం... బాషా విభేధాలు వల్ల గ్రామం విడిపోవటం అనే పాయింట్ తప్ప వేరేదేమీ కొత్తదనం లేకపోవటం. ఈ కాన్సెప్టు కు రాసుకున్నకథనం మొత్తం ఇలాంటి పాయింట్ తో వచ్చిన పాత సినిమాల పంధాలో సాగటంతో సినిమా మొత్తం ప్రెడిక్టుబుల్ గా, పరమ రొటీన్ గా మారింది. దాంతో సినిమా పూర్తయ్యాక...ఇంతకు ముందు చూసేసిన సినిమాని మళ్లీ చూసినట్లు అనిపిస్తుంది. దానికి తోడు హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు సైతం గొప్పగా లేవు.
అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ హైలెట్ ఏమిటీ అంటే...సినిమాని కామెడీగా డీల్ చేయటం...ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి సినిమాలు సీరియస్ గా నడిచేవి. అదే సినిమాలను స్పూఫ్ చేస్తున్నట్లుగా ...ఈ సినిమా ఫన్ గా నడిచింది. దాంతో తెలిసిన కథే, తెలిసిన ట్విస్ట్ లే అయినా నిరాశపరచలేదు. అలాగే ఇంటర్వెల్ బిల్డప్ సీన్ కూడా బాగా డిజైన్ చేసారు. మంచి రెస్పాన్స్ వచ్చింది..
ఫస్టాఫ్ అంతా కథ నడిచే ఊరి సెటప్, హీరో, హీరోయిన్ ప్రేమకథ, వారి మధ్య టీజింగ్ సన్నివేశాలతో సరదాగా సాగిపోయింది. అసలు కథ సెకండాఫ్‌లో మొదలవ్వాల్సిన చోటే డీలా పడింది. అలాగే క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అన్నట్లుగా ఉంది. సీరియస్ గా స్టోరీ చెప్పాల్సిన చోట కూడా కామెడీతో కాలక్షేపం చేసేసారు. ఎంతసేపు కామెడీ పిండుదామని చూసాడు కానీ ఎమోషన్ ని మిక్స్ చేయటం మర్చిపోయాడు. దాంతో థియోటర్ లో ఉన్నంతసేపు నవ్వులు పండినా..ఏం చూసాము అంటే ..ఏమీ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. వెన్నెల కిషోర్ పాత్ర సైతం సినిమాకు వెన్నముకలా నిలిచింది.
టెక్నికల్ గా ..
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో విషయం సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ. అలాగే సాగర్ మహతి సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి నేపథ్య సంగీతం ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి. ఎడిటర్ గారు సెంకడాఫ్ పై మరింత దృష్టిపెడితే ఇంకా బాగుండేది. , ఇక నాగశౌర్య కు ఇది విభిన్నమైన పాత్రే. హీరోయిన్ రష్మిక సైతం బాగానే ఎక్సప్రెసివ్ గా ఉంది. సత్య,వైవా హర్షలు సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. ఎవరెంత చేసినా నిండుతనం లేని స్క్రిప్టు నీరసపరిచేసింది.
ఫైనల్ థాట్
అల్లరి నరేష్ సినిమాని నాగశౌర్యతో చేస్తే ఎలా ఉంటుంది అన్నట్లున్న ఈ సినిమా ని కామెడీ కోసం ఓ లుక్కేయచ్చు. ఎక్కవ ఎక్సపెక్ట్ చేయద్దు.