'ఒక్కడు మిగిలాడు' మూవీ రివ్యూ
రాణించని రీమేక్ ( 'ఒక్కడు మిగిలాడు'రివ్యూ)
తమిళంలో ఆడి ఆడని ఓ సినిమాని ఆ విషయం రివీల్ చేయకుండా రీమేక్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన ..కొత్తదే..కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతించాల్సిందే. అదే మంచు మనోజ్ చేసారు. 2013లో వచ్చిన తమిళ చిత్రం 'రావణ దేశం' ని చెప్పాపెట్టకుండా రీమేక్ చేసారు. అదే దర్శకుడుతో..అవే సీన్స్ తో . అలాగే ...ఈ సినిమాలో చాలా సీన్స్ .. షూట్ చేయకుండా యాజటీజ్ తమిళ సినిమాలోవి వాడారు. హీరో సీన్సే రీషూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటివి రీమేక్ చేస్తే తమిళంలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అక్కడ మార్కెట్ కు పనికిరాదు. అంటే కొత్త నేపధ్యం పరిచయం చేద్దామని ఈ సినిమా తీసుకున్నట్లున్నారు.. శ్రీలంక, తమిళనాడులో నిత్యం రగిలిపోయే శ్రీలంక శరణార్దుల సమస్య ని తీసుకుని ఈ సినిమాని తమదైన శైలిలో తెరకెక్కించి వదిలాడు. అయితే అక్కడ వారి సమస్యలు ఇక్కడ మన బుర్రలకు ఎక్కుతాయా..మంచు మనోజ్ ప్రాణం పెట్టి మరీ చేసానని చెప్తున్న ఈ సినిమా ఆ స్దాయిలో ఉందా...సినిమా కమర్షియల్ సక్సెస్ అవుతుందా... అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి...
అన్యాయం ఎక్కడుంటే ఎదిరించటానికి పోరాడటానికి అక్కడ తానున్నా అంటాడు సూర్య(మంచు మనోజ్). సూర్య చదువుకునే యూనివర్సిటీలో ముగ్గురు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. తన శరణార్దుల కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను మంత్రి కొడుకులు అత్యాచారం ప్రయత్నం చేస్తే ..దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ముగ్గురు పురుగులమందు తాగి చచ్చిపోతారు.దాంతో రగిలిపోయిన సూర్య న్యాయ పోరాటానికి దిగుతారు. అయితే మినిస్టర్ పై కత్తి కడితే ప్రజాస్వామ్య దేశంలో పోలీసులు ఊరుకుంటారా... యధావిధిగా ..సూర్యను డ్రగ్స్ కేసులో ఇరికించి..అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతూంటారు. అయినా సూర్య చలించకపోవటంతో, మినిస్టర్ అతడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు సూర్య తన గతం గుర్తు చేసుకుంటాడు.తనకీ పోరాట పటిమ రావటానికి కారణమైన తన తండ్రి విప్లవ నాయుకుడు పీటర్ (మంచు మనోజ్) మాటలని గుర్తు చేసుకుంటాడు. తన చిన్నప్పుడు జరిగిన అనేక సంఘటనలు గుర్తువస్తాయి. ఆ గతంలో చాలా సంఘటనలు చాలా దారుణంగా ఉంటాయి. అసలు పీటర్ ఎవరు...ఆయన ఎవరిపై విప్లపం మొదలెట్టాడు..చివరకు సూర్య పోరాటం ఏమైంది... వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
అర్దం అయితేనే కదా ....
ఇతర రాష్ట్ర లేదా దేశ (శ్రీలంక శరణార్దుల) సమస్యలు తీసుకుని వచ్చి మన తెలుగులో సినిమా తీసి , చూడండి అంటే కాస్త ఇబ్బందికర వ్యవహారమే. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్న సమస్యల మీదే మనకు పూర్తిగా అవగాహనలేదు..ఆసక్తి లేదు...డైలీ పేపర్లో చూసి, ఛానెల్స్ లో చూస్తున్న వాటిని తెరపై చూపెడుతూంటే విసుక్కుంటున్నాం. అలాంటిది...శ్రీలంక శరణార్దుల మీద కథ అంటే డైజస్ట్ అవటం కష్టమే. అయితే ఏం హాలీవుడ్ సినిమాలు, ఇతర దేశాల సినిమాలు చూడటం లేదా..అప్పుడు అవి అర్దం కావటం లేదా అంటే...ఆ సినిమాలు చూసేటప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు..మనం ఏం చూస్తున్నామో..అలా కాకుండా తెలుగు హీరో , తెలుగులో తీసిన సినిమా చూద్దామని వెళ్లేటప్పుడు మనకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి.
అవేమీ పట్టించుకోకుండా....మనకు తెలియని నేపధ్యం లో కథ మొదలెట్టి.. ఆ నేపధ్యం గురించి మనకు కొంచెం అయినా క్లూ ఇవ్వకుండా కథలోకి వెళ్లిపోవటం మరీ దారుణం. దర్శకుడుకి, ఆ టీమ్ కు, సినిమాలో పనిచేసిన వాళ్లకు ఆ నేపధ్యంపై అవగాహన ఉండి ఉండివచ్చు. టేకిట్ గ్రాంటెడ్ గా మనకూ ఉంటుందని ఎలా అనుకున్నారో అర్దం కాదు. అయితే వారి ఉద్దేశ్యం ఒకటే అయ్యి ఉండాలి..మొదటే అనకున్నట్లుగా టార్గెట్ తెలుగు ప్రేక్షకులు కాదేమో... తమిళం మరియు శ్రీలంక కావచ్చు.
పడవే ముంచేసింది
ఫస్టాఫ్ ఏదో వెళ్లింది అనుకుంటే ఇక సెకండాఫ్ లో సముద్రంలో శరణార్దులు ఓ పడవ లో బయిలుదేరి..శ్రీలంక నుంచి ఇండియాకు బయిలు దేరే ఎపిసోడ్ అయితే సహనానికి పరీక్షే. వాస్తవంగా జరిగిన సంఘటన అయ్యిండవచ్చు. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ ఇంత బోరింగ్ గా ఉండకూడదు. అలా పదిహేను రోజులు పాటు తిండి..తిప్పలు, చివరకు తాగటానికి నీరు లేకుండా... ఉంటామో..ఛస్తామో తెలియని పడవ ప్రయాణం చేయటం బాగా కష్టమే...కాని చూస్తున్న మనం అంత కష్టపడి చూడాల్సిన పరిస్దితి వచ్చేలా తీయకూడదు. ఎప్పుడు ఈ దారి తెన్నూ లేని ప్రయాణం అవుతుందా అని పడవలో వాళ్లు ఎదురుచూస్తున్నట్లుగానే సినిమా చూస్తున్న వాళ్ల పరిస్దితి అలాగే ఉందంటే అతిశయోక్తి కాదు. అది డైరక్టర్ తప్పిదమే.
ఆ జర్నిలో ఒక్కడే మిగిలాడు అనేది దర్శకుడు చెప్పదలుచుకున్న టైటిల్ జస్టిఫికేషన్. దానికి తోడు నిజంగా తెరమీద నటుడుగా కూడా ఈ సినిమా డైరక్టరే..పడవ నడుపుతూంటాడు. మంచు మనోజ్ ..ఆ నలభై నిముషాలు కనపడడు. అది ప్రయోగమే కావచ్చు కానీ ...ఎవరో ఏమిటో తెలియని నటీ నటులు...మనకు పెద్దగా అర్దకాని నేపధ్యంలోంచి వచ్చి పడవ ఎక్కి ప్రయాణం కడితే ఏం అనిపిస్తుంది. వాళ్ల మీద సానుభూతి మాట దేవెడెరుగు.ఈ సినిమా కు వచ్చిన మన మీద మనకు సానుభూతి కురుస్తుంది. ఆ డైరక్టర్ నటించిన పాత్రలో మంచు మనోజ్ ని పెట్టుకున్నా ఇంత బోర్ అనిపించేది కాదేమో.
ఇదేం స్క్రీన్ ప్లే ..అక్కర్లేదని హైలెట్
శ్రీలంక శరణార్దులు, పడవ ప్రయాణ వంటివి ప్రక్కన పెడితే...కథ ఎత్తుగడ..ముగ్గురు అమ్మాయిలు తమపై అత్యాచారం జరగబోతూంటే వారు ఆత్మహత్య చేసుకుంటారు. దాని కోసం హీరో పోరాటం మొదలెట్టడం, దానికి లోకల్ మినిస్టర్ అడ్డుపడటంతో .మొదలవుతుంది కదా...దాంతో మన దృష్టి అంతా ఈ పాయింట్ చుట్టూనే ఉంటుంది. ఎలా ఆ ముగ్గురు పిల్లలకు న్యాయం చేస్తాడు..మినిస్టర్ కొడుకుకి బుద్ది చెప్తాడు అని చూపెడుతాడు అని ఎదురుచూస్తాం. అంతేకానీ ఈ సూర్య పాత్ర ఎలా పుట్టింది. వాళ్ల నాన్న ఎల్ టిటీఈ ప్రభాకరన్ కు నకలు లాగ శ్రీలంకలో శరణార్దుల కోసం ఉద్యమం ఎలా నడిపాడు, శరణార్దులతో పాటు తనూ పడవలో ఇండియాకు ఎలా వచ్చాడు..చివరకు తను ఎలా ఆ పడవలో ఒక్కడే మిగిలాడు వంటి విషయాలపైకి దృష్టి వెళ్లదు. ఒకటి చెప్దామని మొదలెట్టి వేరే విషయాలు చెప్తానంటే బోరే కదా..అదే ఇక్కడ జరిగింది.
స్క్రీన్ ప్లే రైటర్ అయిన దర్శకుడు దృష్టి వీటిపైనే ఉంది. వాటినే తను హైలెట్ చేసి చెప్పాలి, అదే అసలైన కథ అనుకున్నప్పుడు సూర్య పాత్ర లేపేయాల్సింది. అదేమిపట్టింకుకుండా...సూర్య పాత్ర కేవలం మొదలు, చివర వచ్చి పోయాలా పెట్టారు. దాంతో సూర్య,పీటర్ అనే రెండు కథలు చూస్తున్నఫీలింగ్ వచ్చింది. మెయిన్ కథ హైలెట్ కాలేదు. వెంకటేష్ జయం మనదేరా స్క్రీన్ ప్లే టైప్ అన్నమాట. ఇదే ఈ సినిమాల కథనానికి సమస్యగా నిలిచింది. ఏది ఈ సినిమా ద్వారా చెప్పదలిచారో..దానిపైనే దృష్టి పెట్టి అదే చెప్తే సరిపోయేది. అలా చేస్తే ఖచ్చితంగా ఓ వర్గానికి అయినా నచ్చేది. అప్పుడు పడవ ఎపిసోడ్ బోర్ కొట్టేది కాదు. ఎందుకంటే అదే కథ అయినప్పుడు బోర్ కొట్టదు కదా.
మిగతా అంశాలు..
పీటర్ గా ... ఎల్ టిటీఈ ప్రభాకరన్ ని అనుకరిస్తూ మంచు మనోజ్ చాలా బాగా చేసాడు. ఎమోషన్లలో తీవ్రత.. శరీరంలోనూ, కళ్లలోనూ చూపించిన తీరు ప్రశంసనీయం. మిగతా తమిళ ఆర్టిస్ట్ లు సహజంగా నటించారు. కానీ కొంత అతి, అరవ పైత్యం అనిపిస్తుంది కొన్ని చోట్ల. డైలాగులు అన్ని అని చెప్పలేం కానీ కొన్ని కొంతవరకూ బాగున్నాయి. ఇలాంటి కథలకు టెక్నికల్ గా ఇంకా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. పాటలు గురించి చెప్పుకునేదేమీ లేదు. అది బ్యాక్ గ్రౌండ్ సాంగే..అదీ విషాద గీతం టైప్. బడ్జెట్ చాలా తక్కువ లో లాగేసారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఫైనల్ థాట్
మన కథలు, మన పోరాటులు బోలెడు ఉన్నాయి ...ముఖ్యంగా ఆర్.నారాయణ మూర్తి సినిమాలు తీయటం తగ్గించాక చాలా కాన్సెప్టులు మిగిలిపోతున్నాయి కదా..వాటిని ఎటెమ్ట్ చేయచ్చు కదా
ఏమి బాగుంది: మంచు మనోజ్ నటన, విభిన్నమైన కాన్సెప్టులు ఎటెమ్ట్ చేయాలనే అతని ఐడియాలజీ
ఏం బాగోలేదు: నేపధ్యం పరిచయం చేయకుండా... సినిమా నేరేట్ చేయటం
ఎప్పుడు విసుగెత్తింది : సెకండాఫ్ లో వచ్చే ..బోట్ ఎపిసోడ్ అంతా
చూడచ్చా ?: మీకు శ్రీలంక శరణార్దుల మీద సానుభూతి లేదా..వాళ్ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ...