Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Nakshatram Movie Review

August 4, 2017
Sri Chakra Media, Butta Bomma Creations and Win Win Win Creations
Sundeep Kishan, Regina Cassandra, Sai Dharam Tej, Pragya Jaiswal, Tulasi, Shivaji Raja, Raghubabu, Praksh Raj, Tanish, Mukhtar Khan, Sai Kiran
Thota Prasad, Padmasri and Kiran Thatavarthi
Anantha Sriram and Kasarla Shyam
Srikanth Naroj
Shiva Y Prasad
Ganesh and Swami
Jashuva Master, Jolly Bastian and Sridhar
Purushottam
Omkar Kadiyam
Mallik
Mani Sharma
K Srinivasulu, S Venugopal and Sajju
Krishna Vamsi

పగలే చుక్కలు కనిపించాయి ('నక్షత్రం' మూవీ రివ్యూ)

తన వృత్తిలో స్ట్రిక్టుగా ఉండే ఓ సిన్సియర్ పోలీస్, అంతకు రెండు మూడు రెట్లు... తన వృత్తిలో పరమ నిష్టాగరిస్టుడులా స్ట్రిక్ట్ గా వ్యవహరించే ఓ విలన్..వీళ్లద్దరి మధ్యా వ్యక్తిగత విభేధాలు లేకపోయినా...తమ వృత్తులు పరంగా రకరకాల విషయాల్లో వైరం, ఎత్తుకు పై ఎత్తులు. చివరకు పోలీస్ ..విలన్ ని ఏ ఊరి చివరో పెద్ద ఫైట్ చేసి మట్టుపెడ్తాడు.ఇదే పోలీస్ సినిమాల్లో బేసిక్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆర్టిస్ట్ లు,డైలాగులు మారతాయేమో కానీ దాదాపు ఇదే కథ ఉంటుంది.

అలాగే ఈ పోలీస్ సినిమా ల స్క్రీన్ ప్లే కూడా...ఒకే టైపులో నడుస్తూంటుంది . ఫస్టాఫ్ నుంచి సినిమా చివరి వరకూ పోలీస్ క్యారక్టర్..విలన్ ఇచ్చే ట్విస్ట్ లకు సఫర్ అవుతూంటే...విలన్ క్యారక్టర్ మజా చేస్తూ..తను అనుకున్నది సాధిస్తూ, చివర్లో ...ఇక సినిమా అయిపోతోంది,బాగోదు...ఇక్కడ పట్టుబడకపోతే మళ్లీ సీక్వెల్ తీస్తారు అన్నట్లుగా ... దొరికిపోతాడు.

అయితే క్రియేటివ్ డైరక్టర్ గా పేరుబడ్డ... కృష్ణవంశీ కూడా పోలీస్ కథతో సినిమా చేస్తున్నారు అనగానే అదే రొటీన్ రూట్ లో వెళ్తాడా..లేక ఏమన్నా ప్రత్యేకంగా తీస్తారా అనే డౌట్ వస్తుంది. అదే సమంయలో కృష్ణవంశీ కదా...ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడు...అనే ఆశకూడా పీకుతూంటుంది. మరి అలాంటి మ్యాజిక్ ఏమన్నా 'నక్షత్రం'తో చేసారా, సాయి ధరమ్ తేజ పాత్ర ఏమిటి, ఈ సినిమాతో కృష్ణవంశీ ఫామ్ లో వచ్చారా ,సందీప్ కిషన్ కెరీర్ కు ఈ సినిమా ఉపయోగపడిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

త‌న తండ్రి, తాత, ముత్తాత‌... ఇలా మూడు త‌రాలు పోలీసులుగానే ప‌ని చేశారు కాబ‌ట్టి తనూ ఎస్ఐ కావాల‌నేది రామారావు (సందీప్‌కిష‌న్‌) జీవితాశయం.అందుకోసం ఎంతో కష్టపడి రిటన్ టెస్ట్ పాసయ్య... ఫిజికల్ టెస్ట్ కు వెళ్తూంటే...అంతకు ముందు సీన్లలో గొడవపడ్డ పోలీస్ క‌మిషన‌ర్ రామ‌బ్ర‌హ్మం కొడుకు రాహుల్ (త‌నీష్‌) తన ఫ్రెండ్ తో అడ్డం పడి వెళ్లకుండా ఆపుతాడు. దాంతో టెస్ట్ కు లైటైన రామారావుకు ఇక తనకు పోలీస్ ఉద్యోగం రాదని తెలిసిపోతుంది. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అదే సమంయలో ఓ పెద్దాయన అతన్ని ఆపి.... ప్రతీ పౌరుడులోనూ ఓ పోలీస్ ఉంటాడు.. ప్రతీ పోలీస్ లోనూ ఓ పౌరుడు ఉంటాడు అనే విషయం చెప్పి ,నువ్వు పోలీసుగా బ్రతకాలంటే యూనిఫామే అక్కర్లేదు అంటాడు. ఆ మాటలు ప్రేరణతో పోలీస్ ఉద్యోగం లేకపోయినా పోలీసు డ్యూటీ చేయాలని ఫిక్స్ అవుతాడు.

బయిట సొసైటిలో జీతం తీసుకుంటున్న వాళ్లే సరిగ్గా ఉద్యోగం చేయటం లేదు. కానీ మనవాడు..రూపాయి ఆదాయం లేకపోయినా...పోలీస్ లా జీతం భత్యం లేకుండా పనిచేయటం మొదలెడతాడు. రాత్రింబవల్లు ఆపు ,అంతూ లేకుండా విలన్స్ వెనకపడుతూంటాడు. అంతేకాకుండా లుక్ బాగుంటుందని, అతను తను తన గర్ల్ ప్రెండ్ తెచ్చిన పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాడు. అయితే ఆ యూనిఫామ్ మీద అలగ్జాండర్ అని నేమ్ బాడ్జీ ఉంటుంది. దాన్ని తీసేసి తన పేరు పెట్టుకోకుండా దాంతోటే బయిట తిరుగేస్తూంటాడు.

ఆ క్ర‌మంలోనే అలెగ్జాండ‌ర్ పేరుతో ఉన్నపోలీస్‌ యూనిఫాంతో కిర‌ణ్‌రెడ్డి (ప్ర‌గ్యాజైశ్వాల్‌)కి తార‌స‌ప‌డ‌తాడు రామారావు. (కంగారుపడకండి కిరణ్ రెడ్డి కొత్త క్యారక్టర్). అలెగ్జాండ‌ర్ అనే పేరును చూసిన ఆమె రామారావుని తీసుకెళ్లి పోలీసు క‌మిష‌న‌ర్‌కి అప్ప‌జెబుతుంది. అప్ప‌టిదాకా అలెగ్జాండ‌ర్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) కోస‌మే వెదుకుతున్న క‌మిష‌న‌ర్ రామారావుకి ఆ డ్రస్ ఎలా వ‌చ్చాయో తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తాడు. అలెగ్జాండర్ ని ఏం చేసావని నిలదీస్తాడు... అస‌లింత‌కీ ఆ అలెగ్జాండ‌ర్ ఎవ‌రు? అతని కోసం క‌మిష‌న‌ర్ ఎందుకు వెదుకుతున్నారు? అలెగ్జాండ‌ర్‌కీ, కిర‌ణ్‌రెడ్డికీ మ‌ధ్య సంబంధ‌మేమిటి? పోలీసు కావాల‌నుకొన్న రామారావు క‌ల తీరిందా అన్న‌ది చూసి తెలుసుకోవాల్సిందే.

అదీ విషయం...

వరస ప్లాఫ్ లు వస్తున్నప్పుడు .. మారుతున్న ప్రేక్షకులను కొత్తగా ఏం చేస్తే మెప్పించగలం అనే కన్ఫూజన్ ఖచ్చితంగా సీనియర్ దర్శకులకు వస్తూంటుంది. అలాంటప్పుడే తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమాలను ఓ సారి వేసుకుని చూసుకోవటం, అవకాసం ఉంటే తన క్రియేటివిటీని తనే అనుకరించుకుంటూ,కాపీ కొట్టుకుంటూ ఓ పేలవమైన సినిమా ప్రయత్నం చేయటం జరిగుతుంది. దాంతో మళ్లీ ఫ్లాఫ్ ని కౌగలించుకోవాల్సిన పరిస్దితి వస్తుంది. ఫ్లాఫ్, ప్రెజర్ అంత భయంకరంగా బుర్రని తినేస్తాయి. కొత్త ఆలోచనలని రానివ్వరు. కొత్తదనాన్ని ఆహ్వానించనివ్వదు. ప్రముఖ దర్శకులు అనిపించుకునే చాలా మంది (కె.విశ్వనాథ్, రామ్ గోపాల్ వర్మ, మణిరత్నంతో సహా ) కూడా ఈ పరిస్దితిని ఎదుర్కొన్న వారే. ఇప్పుడు కృష్ణవంశీ తాజా చిత్రం చూస్తూంటే ఆయన కూడా అదే సిట్యువేషన్ లో ఉన్నారనిపించింది.

కృష్ణవంశీ కూడా హిట్ కోసం తన పాత చిత్రాల తవ్వకం మొదలెట్టినట్లున్నారు. ఆ తవ్వకాల్లో అప్పట్లో మంచి హిట్ అయ్యి, పేరు తెచ్చుకున్న ఖడ్గం కనపడినట్లుంది. దాంతో మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే అలాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తొలిచేసి ఉండవచ్చు. అప్పట్లో టెర్రరిజం హాట్ సబ్జెక్ట్ అయితే ..ఇప్పుడు అంతకన్నా దారుణమైన డ్రగ్స్ మాఫియా వెరీ హాట్.

దాంతో డ్రగ్స్ మాఫియాని కథకు బేస్ గా తీసుకుని, పోలీస్ అవ్వాలనే హీరో యాంబిషన్ ని(అక్కడ రవితేజ హీరో అవ్వాలనే యాంబిషన్) అందులో కలుపుకుని , ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీలాంటి ఓ నెగిటివ్ క్యారక్టర్ (వైవా హర్ష) ని సినిమా నేపధ్యంలో పెట్టి , ప్రకాష్ రాజ్ పాత్రకు ఓ దుర్మార్గమైన తమ్ముడు షఫీ పాత్ర ఖడ్గంలో ఉన్నట్లే ఇక్కడా దుర్మార్గమైన కొడుకు పాత్ర (తనీష్)ని తీసుకొచ్చారు. ఖడ్గంలో శ్రీకాంత్ లాంటి పాత్రను సైతం ...ఇక్కడ సాయి ధరమ్ తేజ తో వేయించారు. ఇలా...అన్ని ఖడ్గం పోలికలతో సినిమా ప్లాన్ చేసారు. అయితే క్యారక్టర్స్ అన్నీ తేగలిగారు కానీ సోల్ మాత్రం అక్కడే వదిలారు. ఆత్మలేని ఈ సినిమా...అంతుపట్టని దెయ్య కథలా తయారైంది.

ప్రకాష్ రాజ్ మీద ప్రేమతో....

అయితే కృష్ణవంశీకు తొలి నుంచీ ప్రకాష్ రాజ్ మీద అభిమానం (అఫ్ కోర్స్ ఆయన నటన అంతే ఇన్స్పైర్ చేస్తూంటుంది). ఆ అభిమానం తో ఏకంగా ఈ సినిమాలో ఆయన్నే హీరోగా చేయాలని ఫిక్సై పోయినట్లున్నారు. అందుకోసం యంగ్ హీరోలు ఇద్దరు..సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజలు ఇద్దరినీ బలేసేసారు. ఇది దారుణం.

దర్శకుడుగా కృష్ణవంశీ...

ఎప్పటిలాగే ఈ సినిమాలో కృష్ణవంశీ హీరోయిన్స్ తో రొమాన్స్ ని బాగా పండించే ప్రయత్నం చేసారు. అదొక్కటే మెచ్చుకోదగ్గట్లుగా ఉంటుంది. ఇక ఆయనే రాసుకున్న కథ,స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉందిది. ఎక్కడెక్కడి పాత్రలు కావాలని లింక్ చేసినట్లు ఉంటాయి.తప్ప..కథలో సహజంగా ఒక చోట చేరవు.

అలాగే ఈ సినిమాకు హీరో అయిన సందీప్ కిషన్ పాత్ర ప్యాసివ్ అవుతున్నా పట్టించుకోలేదు. మొదట నుంచి చివరి వరకూ సందీప్ కిషన్ పాత్రకు తనలోని హీరోయిజం బయిటపెట్టుకునే అవకాసం ఎక్కడా డైరక్టర్ ఇవ్వడు. క్లైమాక్స్ దగ్గర కూడా సందీప్ కిషన్ పాత్రను తొక్కేసి, హీరోయిన్ తో భారీ ఎత్తున ఫైట్ చేయించాడు. ఎండింగ్ లో కూడా ప్రకాష్ రాజ్ ని హైలెట్ చేసారు కానీ సందీప్ కిషన్ ని వదిలేసారు. సందీప్ కిషన్ ఎలా ఒప్పుకున్నాడో ఇంత ప్యాసివ్ పాత్రను అనిపిస్తుంది.

సాయి ధరమ్ పాత్ర

సినిమాలో అలగ్జాండర్ గా కనపడే సాయి ధరమ్ తేజ ..సినిమాకు ఏ మాత్రం కలిసొచ్చేది కాదు. అసలు ఆ పాత్ర వచ్చేవరకూ ఉన్న ఇంట్రస్ట్ మొత్తం ఆ పాత్రకు చెందిన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చాక పోయింది. సాయి పాత్రని ఇంట్రడ్యూస్ చేసిన విధానంతో పోలిస్తే.. ముగింపు చాలా పేల‌వంగా అనిపిస్తుంది. పోనీ ఈ పాత్రతో కథలో ఏమన్నా కీలకమైన మార్పులు వస్తాయా..టర్న్ లు తీసుకుంటాయా అంటే అంత సీన్ ఉండదు. సాయి ధరమ్ తేజ కెరీర్ కు కానీ, ఈ సినిమాకి కానీ ఆ పాత్ర ఎందుకూ పనికిరాదు. యూత్ లో క్రేజ్ ఉన్న మెగా హీరోని అలా అర్దం,పర్దం లేని పాత్రలో చూపించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

రెజినా, ప్రగ్యా జైస్వాల్

ఉన్నంతలో ప్రగ్యా జైస్వాల్ కు అయినా చెప్పుకోదగ్గ క్యారక్టర్ ఉందేమో కానీ, రెజీనాది మరీ దారుణం. ప్రగ్యా జైస్వాల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో మంచి ఈజ్ చూపించింది. అయితే ఐపీఎస్‌ అధికారి అయిన ప్ర‌గ్యా జైశ్వాల్‌ని ఓ దొంగ‌గా ప‌రిచ‌యం చేయ‌డంలో లాజిక్ ఏమిటో మనకు అర్థం కాదు. ఎడిటింగ్ లో ఏమన్నా లేపేసారేమో.

తనీష్, సందీప్ కిషన్

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు సందీప్ కిషన్ పాత్రను అన్యాయం చేసాడు కానీ సందీప్ కిషన్ మాత్రం తన పాత్రకు న్యాయమే చేసాడు. తనీష్ కూడా నెగిటివ్ రోల్ గా చాలా బాగా చేసాడు. హీరోగా కన్నా విలన్ గానే తనీష్ బాగా రాణిస్తాడనిపించింది.

టెక్నికల్ గా...

కెమెరా వర్క్ ..పాటల్లో ఉన్నంతగా మిగతా సమయాల్లో అనిపించలేదు. అలాగే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే..సినిమాపై కాన్సర్టేషన్ లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యింది. పాటలు గొప్పగాలేవు. సంద‌ర్భం లేక‌పోయినా కొన్ని పాట‌లు అలా వ‌చ్చిప‌డుతుంటాయి..అదో చిరాకు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేస్తే ఎడిటర్ కు ధాంక్స్ చెప్పుకుందుము. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి.

ఫైనల్ థాట్

ద‌ర్శ‌కుడిగా కృష్ణ‌వంశీ గ‌తంలో చేసిన సినిమాల్ని గుర్తు చేసుకుంటూ ...ఆ స్థాయిని ఊహించుకొని వెళ్లినా, అదేమి లేకుండా ఫ్రెష్ మైండ్ తో వెళ్లినా కలిగే నిరాశ మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఈజ్ యువర్స్.

ఏమి బాగుంది: ప్రగ్యా జైస్వాల్ ఫైట్స్, పాటల్లో రొమాంటిక్ టచ్, తనీష్ విలనీ

ఏం బాగోలేదు: హీరోలో ...ఆవగింజత కూడా హీరోయిజం లేకపోవటం

ఎప్పుడు విసుగెత్తింది : హీరో కు,తల్లికి వచ్చే సీన్స్

చూడచ్చా ?: యస్..మీరు ఏదో విభాగంలో ఈ సినిమాకు పనిచేసి ఉంటే

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT