రొటీనహ,రొటీనస్య...రొటీనోభ్యహ ( 'దువ్వాడ జగన్నాథమ్' రివ్యూ )
జెంటిల్ మెన్, భాషా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర (ఇంద్ర సేనారెడ్డి)...వంటి టూ షేడ్స్ హీరోల కథలు ఆ మధ్యన వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో ఆ సూపర్ హిట్ ని తాము సాధించాలని...చిన్నా..పెద్దా హీరోలే కాక హీరోయిన్స్ సైతం ఈ టైప్ స్క్రీన్ ప్లే సినిమాలు ఉత్సాహంతో చేసేసారు. దాంతో ఈ సినిమాలు జనాలు....మొదటి సీన్ చూడగానే ...ఇంట్రవెల్ ఇదీ ..క్లైమాక్స్ ఇదీ అని చెప్పే స్దాయికి చేరుకుని, తిప్పి కొట్టడం మొదలెట్టారు. అదిగమనించిన మన దర్శక,నిర్మాతలు ఈ మధ్యకాలంలో ఈ టైప్ స్క్రీన్ ప్లే కథలు ప్రక్కన పెట్టేసారు.
కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం వెనక్కి తగ్గలేదు . అలాంటి హిట్ ఫార్ములాని అనాధలా వదిలేయటం ఎందుకు అనుకున్నాడో ఏమో...ఈ టైప్ కథనే...కొంచెం అటూ ఇటూ అలాంటి స్క్రీన్ ప్లేతో అల్లి, దువ్వాడ జగన్నాథం...డీజే అంటూ టూ షేడ్స్ హీరో సినిమా రెడీ చేసి మనని దువ్వే ప్రయత్నం చేసారు. మరి మళ్లీ అదే హిట్ ఫార్ములా ..ఈ సారి కూడా హిట్ తెచ్చి పెట్టిందా...లేక రొటీన్ అనిపించిందా...అసలు ఈ సారి..ఆ రొటీన్ ఫార్ములాలో దర్శకుడు చేసిన మార్పులేమిటి...అల్లు అర్జున్ సినిమాలో ఎలా చేసాడు..కథ ఏమిటి... సినిమా చూడచ్చా...వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదావాల్సిందే.
కథేంటి
విజయవాడ..సత్యనారాయణపురం అగ్రహారం లో అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ లో చేయితిరిగిన బ్రాహ్మణ వంటవాడు దువ్వాడ జగన్నాథ శాస్త్రి (అల్లు అర్జున్). ధర్మో రక్షితి రక్షితః, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనిపించనవసరం లేదు వంటి వాక్యాలు విని, నిజమే అని నమ్మి...డిజే అనే మారు పేరుతో..సమాజంలో జరిగే అన్యాయాలకు చెక్ పెడుతూ,అవసరమకుంటే అవతలివాళ్లను చంపేస్తూంటాడు. అలా బిజీ బిజీగా జీవితం గడుపుతూన్న అతనికి ఈ సారి ఓ స్కామ్ ఛేదించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
తనకు పర్శనల్ గా బాగా దగ్గరవాడు ,బాబాయ్ అని పిలుచుకునే చంద్రమోహన్ తనకు జరిగిన ఓ అన్యాయంతో బాధపడి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలే అన్యాయాలు తన కళ్లెదుట జరిగితే తట్టుకోలేని డీజే...ఇప్పుడు తనకు బాగా దగ్గరవాడికి జరగటంతో రెచ్చిపోతాడు. ఆ అన్యాయం వెనక ఎంతటివారున్నా వదిలిపెట్టనని యుద్దం ప్రకటిస్తాడు. అయితే ఆ అక్రమం వెనక అతను ఊహించని పెద్ద స్కామ్ ఉంటుంది.
రొయ్యల నాయుడు (రావు రమేష్)లాంటి చాలా పెద్ద తలకాయలు ఉంటాయి. ఇంతకీ ఆ స్కామ్ ఏమిటి...దానికి డీజే ఎలా ఛేదించాడు...జగన్నాథం...డిజేగా మారి మర్డర్స్ చేస్తూంటే పోలీస్ డిపార్టమెంట్ ఊరుకుంటుందా...రొయ్యలనాయుడు ఎవరు...ఇంతకీ ఈ కథలో ఫ్యాషన్ డిజైనర్ పూజ (పూజహెగ్డే) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఫస్టాఫ్ కేకే..కానీ సెకండాఫే
పై కథ చదివిన వారు,రెగ్యులర్ తెలుగు సినిమాలు చూసేవారు అయ్యింటే కథని ఈజిగా ఊహించేస్తారు... అదే ఈ సినిమాకు సమస్యగా మారింది. పరమ రొటీన్ గా మార్చేసింది. దర్శకుడు తన డైలాగులుతో, హీరో గెటప్ తో రొటీన్ ని బ్రేక్ చేద్దామని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అప్పటికీ అల్లు అర్జున్ తన ఈజ్ తో సినిమాని పూర్తిగా భుజాలపై లాగే ప్రయత్నం చేసాడు. కానీ కథ సహకరించలేదు. ఫస్టాఫ్ బాగానే డిజైన్ చేసినా, ఇంట్రవెల్ లో అసలు ట్విస్ట్ ఏమిటి..కథ ఎటు వైపు ప్రయాణం చేయనుంది విషయాలు రివీల్ అయ్యాక కథ,కధనం అంత ఆసక్తిగా సాగలేదు. అందుకు కారణం..సినిమాలో ఎక్కుడా టర్న్ లు,ట్విస్ట్ లు లేకపోవటమే. అలాగే సెంకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ని కూడా పూర్తిగా వదిలేసారు. ఫస్టాఫ్ లో ఊపు తెచ్చిన దువ్వాడ జగన్నాధం పాత్ర సెకండాఫ్ లో లెంగ్త్ తగ్గించారు. పూర్తిగా డిజే షేడ్ పైనే దృష్టి పెట్టారు. డీజే పాత్ర యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగుతూంటుంది.
మనది కానప్పుడు మనకేంటి
పేరుకు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని ముంచేసి,బర్నింగ్ టాపిక్ గా మారిన అగ్రిగోల్డ్ ని గుర్తు చేసే కథ అయినా ...ఆ స్దాయి ఎమోషన్ సినిమాలో రిజిస్టర్ కాలేదు. హీరో కు కానీ, అతని కుటుంబానికి కానీ ఆ సమస్యతో సంభందం లేకపోవటంతో కథలో కలగాల్సిన బావోద్వేగాలు కలగలేదు. దాంతో హీరో చేసే పనులుకు మన మోరల్ సపోర్ట్ లభించదు.
హవాలా...కన్ఫూజన్
అలాగే ఈ సినిమాలో హవాలా మీద ఓ కీలకమైన సీన్ చూపించారు. విలన్ ఇక్కడ ఇండియాలో డబ్బుని స్కామ్ లో సంపాదించినప్పుడు మళ్ళీ దుబాయి పంపి..అక్కడ నుంచి మళ్లీ హవాలా లో ఇక్కడకి తెప్పించాల్సిన అవసరం ఏమిటో అర్దం కాదు..ముక్కు ఎక్కడ అంటే ...తిప్పి చూపించినట్లు అనిపించింది.
అది ప్రక్కన పెడితే హవాలా ఎలా జరుగుతుంది అనే విషయం తెలిసిన వాళ్లకే అర్దం అవుతుంది. థియోటర్ లో ఉన్నవాళ్లందరికీ అర్దం అవుతుందా అంటే సందేహమే. కానీ ఆ సీన్ సినిమాకు కీలకం.
ప్యాసివ్ హీరోయిజం...ముంచేసింది
అలాగే కథలో కీలకమైన విషయం...అగ్రిగోల్డ్ అన్నా మరొకటి అన్నా...ఇది పూర్తిగా ...విలన్, హీరో కథే. కానీ దర్శకుడు ఆ విషయాన్ని స్క్రిప్టులో వదిలేసారు. సినిమాలో హీరో డిజే రూపంలో , విలన్ ..బినామీ గా ఇధ్దరూ మారు రూపంలో తమ పనులు చేస్తూంటారు. చివరి దాకా ఒకరిగురించి మరొకరికి తెలియదు. ఒకరికొకరు తారసపడరు..దాంతో డీజే ఎవరో..విలన్ తెలుసుకోవటానికి, విలన్ ఎవరో హీరో తెలుసుకోవటానికే సెకండాఫ్ మొత్తం సరిపోయింది. చివరకు ఫలానా వాడు విలన్ అని హీరో,ఫలానా వాడే హీరో అని విలన్ తెలుసుకునేసరికి క్లైమాక్స్ ఫైట్ వచ్చేసింది. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా ఏమి చేయటానికి లేకుండా పోయింది. విలన్ ఎవరో హీరో కు, హీరో ఎవరో విలన్ కు ఇంటర్వెల్ కు అయినా తెలిస్తేనే కదా ఇలాంటి కమర్షియల్ కథల్లో యాక్షన్..ఎత్తుకు పై ఎత్తులతో రక్తి కట్టేది. ఇదేమి ఇన్విస్టిగేషన్ సినిమా కాదు కదా..
బన్ని బాగా చేసాడు కానీ...
దువ్వాడ జగన్నాథం పాత్ర చేసిన అల్లు అర్జున్ కూడా స్తోత్రాలు, మంత్రాలు చెబుతూ ఒక అచ్చమైన బ్రాహ్మణుడి బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో సహా దించేసే ప్రయత్నం చేసారు. కానీ అదంతా ఈ కాలానికి సంభందించిందేనా.. ఈ కాలంలో ఇంకా అలా బ్రాహ్మలు సాగదీస్తూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారా,ఉన్నా ఎంత శాతం ఉన్నారు...వాళ్లని హైలెట్ చేస్తే ఒరిగేదేంటి అనేది సినిమావాళ్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఎప్పటిలాగే స్టైలిష్ గా, దూకుడుగా ఉండే డీజేగా బన్ని మెప్పించాడు. కానీ ఆయన స్టైల్ లో సాగే డాన్స్ లకు ప్రత్యేకాభిమానులు ఉన్నారు. అవి ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయ్యాయి.
క్లైమాక్స్ తేలిపోయింది
సినిమాలో క్లైమాక్స్ విభిన్నంగా కామెడీగా ఉంటుంది..రేసు గుర్రంలా బ్రహ్మానందాన్ని బకరా చేసి ఆడుకున్నట్లు..ఇందులో సుబ్బరాజుని బకరా చేస్తే పేలుతుందని ప్లాన్ చేసారు కానీ...తేలిపోయినట్లు అనిపించింది. మానసికంగా సమస్య ఉన్న సుబ్బరాజుని హీరో అడ్డం పెట్టి విలన్ తో ఆడుకుంటూంటే...సుబ్బరాజు పాత్రపై జాలి వేస్తుంది కానీ అంతలా కామెడీ రాలేదు.
హీరోయిన్ ఎలా ఉందంటే..
పూజా హెగ్డే ఇంట్రడక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే స్విమ్ సూట్‌లో పూజా అదరకొట్టింది. ఇక పాటల్లోనూ పూజా హెగ్డే గ్లామర్ కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ... బన్నితో పోటీ పడుతూ డ్యాన్సులు చేసింది. అయితే ఆమె సీన్సే సెకండాఫ్ లో లేకుండా చేసాడు దర్శకుడు.
అతకలేదు...
ఈ సినిమాలో అల్లు అర్జున్, హీరోయిన్ పూజ హేడ్గేల మధ్యసాగే రొమాంటిక్ ట్రాక్ కథలో అసలు కలవలేదు. ఆ ట్రాక్ ఎంత సమస్య తెచ్చిపెట్టిందంటే సెకండాఫ్ లో అసలు హీరోయిన్ సీన్స్ పెట్టడానికి లేకుండా అవకాసమే లేదు. ఏదో పాటలకు వచ్చి వెళ్లిపోతుంది ఆమె.
టెక్నికల్ గా ...
మెయిన్ పాత్ర జగన్నాథంకు హరీష్ రాసిన డైలాగులు, కామెడీ ట్రాక్ బాగా పండాయి. అలాగే ఆయాంక బోస్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా సినిమాకు స్పెషల్ లుక్ తెచ్చిపెట్టింది. దేవిశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ..పాటలు గతంలో దేవి, అల్లు అర్జున్ కాంబో లో వచ్చిన స్దాయిలో మాత్రం లేవు. ఎడిటర్ చేత సెకండాఫ్ మరింత షార్ప్ చేయాంచాల్సింది. దిల్ రాజు పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
బోటమ్ లైన్
ఫైనల్ గా...రొటీన్ సినిమాలు రొటీన్ గా చూడటం అలవాటు పడినవాళ్లకు రొటీన్ గా నచ్చుతుందేమో కానీ..మిగతావాళ్లకు కష్టమనిపిస్తుంది.