ఎన్టీఆర్ కే జై... ('జై లవ కుశ 'రివ్యూ)
ఆ మధ్యన కమల్ హాసన్..దశావతారం అంటూ ఓ పది పాత్రలు పనిగట్టుకుని, కథలో కలిపేసి సినిమా చేసేసాడు. అయితే ఆ పది పాత్రలూ పది డిఫెరెంట్ వేరియేషన్స్ చూపించాయి. ప్రతీ పాత్ర ...ఒకదానికి కొకటి సంభందం లేకుండా కట్టూ,బొట్టూ దగ్గర నుంచి మొత్తం మార్చేసి, ఆయన్ని ఆయనే గుర్తుపట్టలేనట్లుగా మేకప్ చేసుకుని, బాడీ లాంగ్వేజ్ లో, మాట తీరులో వైవిధ్యం చూపించి శభాష్ అనిపించుకున్నారు. ఆ సినిమా చూసిన వారు...అంత కష్టం, అలాంటి ప్రయోగం భవిష్యత్ లో ఏ హీరో పడలేరేమో అనిపించేలా ఆయన అదరకొట్టాడు. ఇప్పుడిప్పుడే మన హీరోలకు అలాంటి ఆలోచనలు కలుగుతున్నట్లున్నాయి. ఎన్టీఆర్ ఓ అడుగు ముందుకేసారు. నటుడుగా ఆయన ఎవరికైనా ఛాలెంజ్ విసరగల సమర్దుడు. ఆ ధైర్యమే ఆయన్ని ఇలా మూడు పాత్రల సినిమాకు సిద్దం చేసినట్లుంది. అలా ముచ్చటపడి చేసిన ఈ జై,లవ,కుశలు మనని మెప్పించారా. ఆ మూడు పాత్రలు ఏమిటి...దర్శకుడు వేరియేషన్ తో వాటిని తీర్చిదిద్దాడా..ఓ ప్రయోగంగా ఈ సినిమా మిగులుతుందా...కమర్షియల్ సక్సెస్ ఈ సినిమా ఇస్తుందా, అసలు సినిమా కథేంటి... వంటి విషయాలు ఈ రివ్యూలో చూద్దాం...
కథేంటి
కవలలు అయిన జై,లవ, కుశ(ఎన్టీఆర్ లు)లలో జై పెద్దోడు...అతనికి నత్తి ఉంటుంది. వీధి నాటకాలతో బ్రతికే ఆ కుటుంబం లో నత్తితో డైలాగులు చెప్పలేక సహజంగానే జై నిరాదరణకు,ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ కు లోనవుతాడు. దానికి తోడు సోదరులు లవ, కుశ కూడా చిన్నతనంలో తెలిసీ,తెలియక జైని చిన్న చూపు చూస్తారు. దాంతో తన సోదరులపైనా కసి పెట్టుకుంటాడు. ఈ లోగా ఓ ప్రమాదం జరిగి వీరు ముగ్గురూ విడిపోతారు.
కొన్నేళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే ...లవ్ కుమార్ బ్యాంక్ ఆపీసర్ గా, కుశుడు దొంగగా తయారవుతారు. మరో ప్రక్క జై ... రావణాసురుడుని ఆరాధిస్తూ, ఆ లక్షణాలను ఆపాదించుకుంటూ ఓ చిన్న సైజు డాన్ గా మారతాడు. అప్పుడు మొదలెడతాడు తన సోదరులుపై పగ తీర్చుకునే పోగ్రాం. ఈ విషయం తెలియని లవ, కుశలు అతనికి బంధీలుగా దొరికిపోతాడు. అక్కడ నుంచి... ఏ విధంగా జై ఇచ్చే ట్విస్ట్ లకు వాళ్లు బలయ్యారు...చివరకు ఎలా బయిటపడ్డారు... జై మారాడా...ఈ కథలో హీరోయిన్స్ పాత్ర ఏమిటి...ఫైనల్ గా ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కత్తిమీద సామే కానీ...
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్...ఈ మూడు ఎన్టీఆర్ లో నటుడుని పూర్తి స్దాయిలో వాడుకుంటూ రెగ్యలర్ కమర్షియల్ ఫార్మెట్ లకు బిన్నంగా నడిచి సక్సెస్ అయిన సినిమాలు. అలాంటి వరస సక్సెస్ లు అందుకున్న తర్వాత ఏ సినిమా చేయాలన్నది ఎంత గొప్ప నటుడుకు అయినా పెద్ద సమస్యే. అలాగని ఇంకాస్త ముందుకు నడిచే పూర్తి నటనతో నడిచే ఏ ఆర్ట్ తరహా సినిమానో చేసి....పూర్తిగా కమర్షియల్ సినిమాకు దూరమైతే చేతులారా మాస్ అభిమానులను దూరం చేసుకున్నట్లే. అలాగని పూర్తి కమర్షియల్ సినిమా చేసేస్తే మళ్లీ రొట్ట కొట్టుడు వ్యవహారం గా మిగిలిపోతుంది. ఇలాంటి సిట్యువేషన్ లో సినిమా కథను ఎంచుకోవటం కత్తిమీద సామే. దీనికి పరిష్కారం తనలోని నటుడు ఆవిష్కరింపబడాలి...కమర్షియల్ యాంగిల్ మిస్ కాకూడదు. ఇవన్నీ ఆలోచించే ఎన్టీఆర్ 'జై లవ కుశ ' ని ఓకే చేసారని అర్దమవుతుంది. అయితే చిత్రమేమిటంటే...ఈ సినిమాలో కేవలం ఎన్టీఆర్ ని పూర్తి నటుడుగా కనిపించే అవకాసం దక్కింది...కమర్షియల్ యాంగిల్ ఉంది కానీ వీటిని బ్యాలెన్స్ చేసే కథ,కథనం లేకుండా పోయింది. కేవలం సీన్ బై సీన్ వేసుకుంటూ అల్లుకుంటూ పోయినట్లుంది.
స్టేజ్ ప్లే ఫీలింగ్
దాంతో ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా... సెకండాఫ్ అయితే పూర్తిగా స్టేజ్ ప్లే చూస్తున్న ఫీల్ వచ్చేసింది. అలాగే జై పాత్ర ఎలాగూ నెగిటివ్ కదా అని సినిమాలో విలన్ ట్రాక్ బలంగా పెట్టుకోలేదు. అలా విలన్ ట్రాక్ అనవసరం అనుకున్నప్పుడు పూర్తిగా దాన్ని ఎవాయిడ్ చేసేయాల్సింది. నిజానికి ఈ కథకు ఆ విలన్ అవసరం లేదు అనిపిస్తుంది. ఎన్టీఆర్ పూర్తి స్దాయి విలన్ గా కనపడుతూంటే మరొక విలన్ ఎందు. అలా కాకపోవటంతో ... నాగేశ్వరరెడ్డి కామెడీ సినిమాల్లో లాగ క్లైమాక్స్ ఫైట్ కోసం విలన్ ట్రాక్ ని మొదటి నుంచి బలవంతంగా మనమీద రుద్దినట్లైంది.
రొటీన్ దారిలోనే ...ఓల్డెన్ డేస్ కువెళ్లి...
ఫస్టాఫ్ లో మోడీ ప్రకటన, నోట్ల రద్దు, ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లి కొత్తనోట్లు మార్చాలనుకోవటం వంటి వాటితో కొత్త కథ చూస్తున్నాం అనుకుని ఫీలయ్యే లోగా..మీకంత సీన్ లేదు అన్నట్లుగా...రొటీన్ ట్రాక్ లోకి వచ్చేసాడు. సెకండాఫ్ లో అయితే మరీ రొటీన్ గా సిట్యువేషన్స్ క్రియేట్ చేసి ఇంట్రస్ట్ లేకుండా చేసాడు. ఇక లవ్ ట్రాక్స్ గురించి చెప్పుకోవటం శుద్ద వేస్ట్. నివేదితా క్యారక్టర్ అయితే ...ఎన్టీఆర్ పాత సినిమా యుగంధర్ ని గుర్తుకుతెస్తుంది. అంత పాత రోజుల్లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది.
ఒక్కడే....ముగ్గురై
కథలో,డైరక్షన్ లో ,స్క్రీన్ ప్లే లో ఎన్ని బొక్కలున్నా వాటిని తన నటనతో పూర్చేసే ప్రయత్నం చేసాడు ఎన్టీఆర్. మిగతా రెండు పాత్రలు ఎలా ఉన్నా జై పాత్రతో సినిమాకు నిండుతనం తెచ్చాడు. సినిమాకు జై లవకుశ అని పెట్టారు కానీ అన్నదమ్ముల అనుబంధం అనిపెడితే ఫెరఫెక్ట్ అనిపిస్తుంది క్లైమాక్స్ సీన్స్ చూస్తూంటే...
90 ల నాటి క్లైమాక్స్
అదేంటో క్లైమాక్స్ చూస్తూంటే ఈ కాలంనాటి సినిమా చూస్తున్నట్లు అనిపించదు. మరీ తొంబైల నాటి ఎమోషన్స్, సెంటిమెంట్ డ్రామా కనపడుతుంది. అంటే అప్పుడు సినిమాలు తక్కువ అని కాదు కానీ ..అలా అనపించింది.
టెక్నికల్ గా ...
దర్శకుడుగా కన్నా బాబి రచయితగా ఇంకా చెప్పాలంటే డైలాగు రచయితగా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. ఛోటా కె నాయుడి సినిమాటోగ్రఫీ అద్బుతం అనలేం కానీ బాగుంది. జై క్యారక్టరైజేషన్ ఎలివేషన్, అతని కోటను, అతని ఊరు భైరాంపూర్ చూపించటంలో కెమెరా వర్క్ కీలకపాత్ర పోషించింది. దేవిశ్రీ పాటలు జస్ట్ ఓకే..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ ..బాగా రిచ్ గానే తీసారు.
ఫైనల్ థాట్
ఈ సినిమాకు జై..లవకుశ అని పేరు పెట్టకుండా.... "ఎన్టీఆర్..ఎన్టీఆర్..ఎన్టీఆర్" అని పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది.
ఏమి బాగుంది: జై గా ఎన్టీఆర్ ..నత్తితో పలికే డైలాగులు, ఆ క్యారక్టైరైజేషన్
ఏం బాగోలేదు: కథమీ లేకుండా కేవలం ఆ మూడు క్యారక్టర్స్ తో సినిమాని నడిపేద్దామనే దర్శకుడు ఆలోచన
ఎప్పుడు విసుగెత్తింది : తమన్నా ఐటం సాంగ్ వస్తున్నప్పుడు....
చూడచ్చా ?: మరీ ప్రోమోలు, పోస్టర్స్ చూసి ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళితే నచ్చుతుంది