ప్చ్..మార్క్ మిస్సయ్యాడు! ( ‘టచ్ చేసి చూడు’ రివ్యూ)
రవితేజ అంటే ఓ ఫన్ ...ఓ వెటకారం...ఓ స్పీడు...అన్నిటినీ మించి ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్. మిగతా హీరోల్లో ఎవరికి లేని ఈ లక్షణాలను తన తనలో ఇముడ్చుకుని భాక్సాఫీస్ ని చాలా కాలం పాటు ఏలాడు. ఆయనతో చేసిన సీనియర్ దర్శకులుకు ఈ విషయం తెలుసు కాబట్టి..ఆ ఎలిమెంట్స్ ని రిపీట్ చేస్తూ మినిమం గ్యారెంటీ సినిమాలు చేసి హిట్ కొట్టేవారు. అయితే ఆయన తో చేస్తున్న కొత్త దర్శకులు ఆ విషయాలు గమనించటం లేదనిపిస్తోంది.. వేరే హీరోలకు అనుకున్న కథలు..రవితేజతో చేస్తున్నారా అనిపించేలాంటి కథలతో సినిమాలను రూపొందిస్తున్నారు. దాంతో రవితేజ మార్క్ మిస్సవుతోంది. ఎప్పుడైతే అది మిస్సైందో ఓవరాల్ గా సినిమానే థియోటర్ నుంచి మిస్సవుతోంది. ఈ నేపధ్యంలో వరస ఫ్లాఫ్ లతో ఆ మద్యన పలకరించిన రవితేజ...తన మార్క్ ని మళ్లీ పునరిద్దించుకుని ...రాజా ది గ్రేట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తున్నాను అన్నట్లుగా టచ్ చేసి చూడు వంటి మాస్ టైటిల్ తో ఈ సినిమా వదిలారు. రవితేజ పోలీస్ అధికారిగా కనిపించే ఈ సినిమా విక్రమార్కుడు,పవర్ స్దాయిలో ఆడుతుందా, కొత్త దర్శకుడు రవితేజతో ఎలాంటి కథ చేసారు..అభిమానులకు నచ్చుతుందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవండి...
కథేంటి..
పాండిఛ్చేరిలోని ఇండస్ట్రలిస్ట్ కార్తికేయ (రవితేజ) ఎప్పుడూ ఫ్యామిలీ..ఎమోషన్స్,వ్యాల్యూస్ అంటూ నిరంతరం తపించిపోతూంటాడు. అతనికో తల్లి,చెల్లి, తండ్రి,నాయనమ్మ ఉంటారు. అందరితో హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తూండగా ఓ రోజు అతని సంస్దలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడు హత్య కాబడతాడు. ఆ హత్యను కార్తికేయ చెల్లెలు కళ్లారా చూస్తుంది. అంతేకాకుండా కార్తికేయ అండతో సాక్ష్యం చెప్పటానికి ముందుకు వస్తుంది. దాంతో ఆ హంతకుడు గురించి ఎంక్వైరీ మొదలెడతారు పోలీసులు. అప్పుడు వారికి ఆ హంతకుడు ఇర్ఫాన్‌లాలా( ఫ్రెడ్డీ దారువాలా) అని, అతనెప్పుడో నాలుగేళ్ల క్రితమే పోలీస్ అధికారిగా ఉన్న కార్తికేయ వలనే చంపబడ్డాడని తెలుస్తుంది. కానీ చనిపోయాడని చెప్పబడుతున్న ఆ హంతకుడు మళ్లీ హత్య ఎలా చేసాడో అర్దంకాక ఓ పెద్ద పజిల్ గా మారుతుంది. ఇంతకీ అసలు కార్తికేయ ఎవరు..ఇండస్ట్రలియస్టా...పోలీస్ అధికారా...అసలు అతను ఇర్ఫాన్ ని ఎందుకు చంపాడు...చచ్చిపోయాడని చెప్పబడుతున్న ఇర్ఫాన్ మళ్లీ తిరిగి వచ్చి హత్య చేయటం ఏమిటి...ఈ కథలో పుష్ప(రాశీఖన్నా) దివ్య(సీరత్‌కపూర్) పాత్రలేమిటి, వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
భాషా మళ్లీ చేసారు.. చూడు
అప్పట్లో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'భాషా' చిత్రం ఓ సంచలనం. ఆ సినిమా సక్సెస్ ని పురస్కరించుకుని ఆ స్క్రీన్ ప్లేను అనుసరిస్తూ ఎన్నో చిత్రాలు తెలుగు,తమిళ భాషలో తెరకెక్కాయి. తాజా చిత్రం కూడా ఆ బాపతే. అయితే భాషా స్క్రీన్ ప్లే ఏమీ చెడ్డదు కాదు. తనను పూర్తిగా నమ్మి కథ చేసుకున్న వారికి సక్సెస్ ని ప్రసాదిస్తూనే వచ్చింది. అయితే టచ్ చేసి చూడు విషయానికి వచ్చేసరికి భాషాలో ఉన్నటు వంటి రఘువరన్ లాంటి బలమైన ప్రత్యర్ది పాత్రను క్రియేట్ చేయలేకపోయారు. అలాగే ఆ స్దాయి ఎమోషన్ గల ఫ్లాష్ బ్యాక్ ని తయారు చేయలేకపోయారు దాంతో హీరో పాత్ర ఎలివేట్ అయ్యే సీన్స్ ఎన్ని వేసినా అందుకు తగ్గ విలనీ లేకపోవటంతో తేలిపోయాయి.
విలన్ కు, హీరో కు మధ్య సరైన ఇట్రాక్షన్ లేదు. విలన్ చచ్చిపోయాడని హీరో నమ్ముతూంటే...విలన్ సైతం హీరో లేడన్నట్లుగా బిహేవ్ చేస్తూంటాడు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేసిన హీరోని ఎదుర్కొందామని , అతనెక్కడున్నాడని విలన్ వెతకడు. దాంతో విలన్ పాత్ర పూర్తిగా ప్యాసివ్ గా నడుస్తుంది. హీరో గుర్తు వచ్చి ఎటాక్ చేసినప్పుడే రియాక్ట్ అవుతూంటాడు. అదే సినిమా ని ముంచింది. విలన్ యాక్టివ్ గా ఉంటే ..హీరో పాత్ర అంతకు రెట్టింపు యాక్టివ్ నెస్ వచ్చేది. అలా కేవలం విలన్ ని కాస్సేపు టచ్ చేసి వదలేసినట్లుగా కథ,కథనం రాసుకోవటంతో బోర్ గా సీన్స్ తయారయ్యాయి.
వయస్సు కనపడుతోంది
రవితేజ ఎంత ఎనర్జీ గా తెరమీద ఎగురుతున్నా...ఫన్ చేస్తున్నా ఆయన వయస్సు స్పష్టంగా కనపడుతోంది. హీరోయిన్స్ చిన్న పిల్లల్లా ఆయన ప్రక్కన కనపడుతున్నారు. ఇక హీరోయిన్స్ ఇద్దరికి సరైన ప్రాధాన్యత లేదు. రాశిఖన్నాతో ఉన్న సీన్స్ కాస్త బాగున్నాయి..శీరత్ కపూర్ పాత్ర అయితే మరీ దారుణం... అర్దాంతరంగా ముగించేసారు.
కామెడీ ఉందా...
సాధారణంగా రవితేజ సినిమాల్లో కామెడీకు మంచి ప్రయారిటీ ఉంటుంది. అలీ, బ్రహ్మానందం వంటి వాళ్లు ఫన్ తో ..రవితేజ సెటైర్ డైలాగులతో దుమ్ము రేపుతూంటారు. అయితే ఈ సినిమాలో అలాంటివేమీ లేవు. కామెడీ కోసం ...వెన్నెల కిషోర్ అయితే ఉన్నాడు కానీ ...పెద్దగా ఫన్ అయితే పండలేదు. రవితేజ సైతం గతంలో లాగ కామెడీకు ఈ సినిమాలో అసలు ప్రయారిటీ ఇవ్వలేదు.
కొత్త దర్శకుడు ఎలా చేసాడంటే...
సాధారణంా కొత్త దర్శకుడు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నాడంటే కొన్ని అంచనాలు ఏర్పడతాయి. ఫ్రెష్ గా ఉండే కథ,కథనం ఉంటాయని ఆశిస్తాం. ముఖ్యంగా రైటర్ ..దర్శకుడు అవుతున్నాడంటే...రచనా విభాగం సమర్దవంతంగా ఉంటుందని భావిస్తాం. అవన్నీ ఈ దర్శక,రచయిత విషయంలో ఫెయిల్ అయ్యాయి. ఎక్కడా స్పార్క్ అనేది మచ్చుకు కూడా కనపడదు. ఫ్రెష్ నెస్ లేదు...సినిమా అంతా గతంలో చూసిన కొన్ని సినిమాల్లో సీన్స్ మిక్స్ చేసి తీసినట్లు అనపిస్తుంది. అలాగే రచయితగానూ ఫెయిలయ్యాడు ఓ లవ్ ట్రాక్ ని కానీ, కామెడీ ట్రాక్ ని కానీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. రవితేజ ఉన్నాడు కాబట్టి అలా కూర్చుని చివరి దాకా భరించగలిగాం అని ఫీల్ వచ్చింది.
టెక్నికల్ గా ...
ఈ సినిమా లో సినిమాటోగ్రఫీ నిండుగా ఉంది. గౌతమ్ రాజ్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు స్పీడ్ తెచ్చింది. పాటలు చూడటానికి ఓకే అన్నట్లున్నాయి. రెండు పాటలు మాత్రం వినసొంపుగా బాగున్నాయి. ఎప్పటిలా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
ఫైనల్ థాట్
పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, ఘాజీ అంటూ కొత్త తరహా చిత్రాలతో కొత్త దర్శకులు వస్తూంటే ఈ కొత్త దర్శకుడు మాత్రం రొటీన్ ఫార్ములానే మరింత రొటీన్ గా అందించాడు. కాబట్టి ఈ రొటీన్ కు రొటిన్ గా వచ్చే ఫలితమే అందే అవకాసం ఉంది.