ఆ కోణంలో చూస్తే విన్ ...(సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్ రివ్యూ)
ఆయన మైదానంలో అడుగుపెడితే చాలు విజిల్స్... అలవోకగా అలా...బాల్ ని బౌండరీ దాటిస్తుంటే కేకలు... సెంచరీల మీద సెంచరీలు బాదేస్తుంటే టప్పట్లే టప్పట్లు..బ్యాటును అలా గాల్లోకి లేపి ఫ్యాన్స్ కు అభివాదం చేస్తుంటే సాక్షాత్తూ దేవుడే పలకరించినంత ఆనందం. యస్...ఆయన.. క్రికెట్ అభిమానుల పాలిట నిజమైన దేవుడు. ఆ దేవుని పేరు తల్చుకున్నా చాలు ఒళ్లు పులకరిస్తుంది. దేశాలకతీతంగా ఆరాధ్యనీయుడిగా మారిన ఆ ఆటగాడు సచిన్ తెందుల్కర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రికెట్ దేవుడు వెండితెరకు దిగొచ్చాడు. ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’తో ప్రేక్షకులను పలకరించాడు. తన పాత్రలో సచినే స్వయంగా నటించిన ఆ చిత్రం విడుదలైంది.
మైదానంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోయి అభిమానులను అలరించిన సచిన్ ఇప్పుడు వెండితెరపైనా సందడి చేసారు. సచిన్‌తో పాటు ప్రముఖ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ చిత్రంలో కనిపించారు. అలాగే సచిన్ జీవితంలో ఎవ్వరికీ తెలియని విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకొనే అవకాశం వచ్చింది. సచిన్ బాల్యం నుంచి క్రికెట్ దిగ్గజంగా ఎదగడం వరకూ ఆయన జీవితంలోని ఆసక్తికరమైన కోణాలను ఆవిష్కరించేలా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ తెరకెక్కిందని ఎదురుచూసిన అభిమానుల ఆకాంక్ష నెరవేరిందా... సినిమా ఎలా ఉంది...అంచనాలను రీచ్ అయ్యిందా...సచిన్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి...
ముంబయిలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సచిన్ కు చిన్నతనంలో బాగా అల్లరి పిల్లాడు. అయితే క్రికెట్ అంటే ఇష్టం. ముఖ్యంగా భారత్ 1983లో ప్రపంచకప్ సాధించడం, దేశం మొత్తం ఊగిపోవటం కళ్ళారా చూడటంతో క్రికెట్ పై ఇష్టం మరింత పెరుగి ప్రాణంగా మారుతుంది. సచిన్ లోని క్రికెట్ మోజుని గమనించిన అతని సోదరుడు.. కోచ్ దగ్గరకి తీసుకు వెళ్తాడు. చిన్న టెస్ట్ పెట్టి...అతనిలోని టాలెంట్ ని గమనించిన ఆయన భవిష్యత్‌లో సచిన్ గొప్ప క్రికెటర్ అవుతాడని నమ్మి ఆయన సచిన్‌కు కోచింగ్ ఇవ్వడం మొదలుపెడతాడు. అక్కడ నుంచి ఓ ప్రక్కన చదువు..మరో ప్రక్క క్రికెట్..ఇదే జీవితం అయిపోతుంది సచిన్ కు. ఆ తరవాత సచిన్ రంజీలో.. భారత క్రికెట్ జట్టులో ఎలా స్థానం సంపాదించాడు? క్రికెట్‌కే దేవుడిగా ఎలా మారాడు? ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగుల వంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీలయ్యారు? అతి చిన్న వయస్సులోనే అతి పెద్ద క్రికెటర్ గా ఎలా అవతరించాడు.ఈ క్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ...
నిజానికి ఇది సినిమా కాదు.. సచిన్ టెండూల్కర్ క్రీడా ప్రస్థానాన్ని తెరకెక్కించిన ఓ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్.. క్రీడాకారుల బయోపిక్.. వివిధ రంగాల్లోని ...తమకు తెలిసిన స్టార్ల గురించి మరింతగా తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపించటంతో ..ఈ బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, ధోని లాంటి చిత్రాలన్నీ ఆ కోవకే చెందినవి. అయితే ఈ సినిమాకు వాటికి చాలా తేడా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన బయో పిక్ లలో బాలీవుడ్ స్టార్లు ఆ క్యారెక్టర్లు చేశారు. కానీ క్రికెట్ లెజెండ్ సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ బయోపిక్ లో మాత్రం సచిన్ స్వయంగా నటించాడు. ఆయనే స్వయంగా నేరేట్ చేస్తూ కథను నడిపించారు. తన జీవితంలో జరిగిన సంఘటనలు ఈ చిత్రం ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేసారు.
ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలాంటి సినిమాలో...సచిన్ చిన్నతనం, ఆయన వ్యక్తిత్వం, భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారా.. కుటుంబ స్నేహితులను పరిచయం చేసారు. వారు లైవ్ క్యారక్టర్స్ నే వాడారు. ఈ కథను సచినే రాయటంతో ...తన క్రికెట్ కెరీర్‌లో సాధించిన విజయాలు.. గాయాలను ఇందులో బాగా చూపెట్టడం జరిగింది. దాంతో క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఈ సినిమా గతాన్ని గుర్తు చేస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.
హైలెట్స్...
ఈ సినిమాలో ...1989లో పాకిస్థాన్‌కు చెందిన అబ్ధుల్ ఖాదర్ విసిరిన ఒక ఓవర్లో నాలుగు సిక్సర్లు సాధించిన వైనాన్ని, 1998లో చెన్నై టెస్టులో షేన్ వార్న్ బౌలింగ్‌లో సచిన్ దుమ్ము రేపటాన్ని తెరపై చూపించి గుర్తు చేసారు. క్రికెట్లో సచిన్ సాధించిన విజయాలే కాకుండా.. మాస్టర్ తన జీవితంలోని ఎన్నో భావోద్వేగ క్షణాలను మనతో పంచుకున్నారు. అంతేకాకుండా రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న సమయంలో సచిన్ ఎదుర్కొన్న విమర్శలు, కొన్ని మ్యాచ్‌ల్లో రాణించలేకపోవడంలో తనకు ఎదురైన పరిణామాలను సచిన్ ఇందులో పొందుపరిచటంతో మనకు ఆయన జీవితాన్ని బాగా దగ్గరనుంచి చూసిన అనుభాతి కలుగుతుంది. అంతేకాక..సచిన్ తన సహచరులైన ధోనీ, కోహ్లీ, గంగూలీ, సెహ్వాగ్‌ల మద్దతు గురించి కూడా తెలిపాడు.
తన ఇంట్లో జరిగిన అన్ని అకేషన్స్ ను ఒరిజినల్ వీడియోల ద్వారా చూపించారు. ఇప్పటివరకూ బయటకు రాని సచిన్ పెళ్ళి వీడియో.. తనకు ఇష్టమైన పాట లాంటివి ఎన్నో సచిన్ గురించి తెలియని ఘటనలు ఈ సినిమాలో చూపించారు. అంతేకాదు భారతదేశంలో క్రికెట్ ఒక మతంగా ఎలా మారింది అన్నది స్పష్టంగా మనకు అర్దమయ్యేలా వివరించే ప్రయత్నం చేసారు దర్శకుడు. టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు ఎలా బాధపడ్డాడో సచిన్ వెల్లడించారు.
అంతేకాదు... 1999 ప్రపంచ కప్ సందర్భంగా తన తండ్రి చనిపోయిన వార్త వచ్చినా... వెనకడుగు వెయ్యకుండా మ్యాచ్ లో పాల్గొని... 140 పరుగులు సాధించి.. ఆ సెంచరీని తండ్రికి అంకితమిచ్చిన విషయాన్ని డైరక్టర్ చాలా ఎమోషనల్ గా డిజైన్ చేసి హైలైట్ చేయటంతో సినిమాకు ఎమోషనల్ డెప్త్ వచ్చింది . చివర్లో.. రిటైర్మెంట్ స్పీచ్ సన్నివేశం కంట తడిపెట్టించక మానదు.
అదే ఇబ్బంది
అయితే డాక్యుమెంటరీ నేరషన్ లో సినిమాను నడపటంతో..ఓ ఎమోషనల్ జర్ని..సచిన్ అంత స్దాయికి ఎదిగిన వైనం ...ధోని సినిమాలాగ డ్రామా చేసి తెరకెక్కిస్తారు అనుకుని ఎదురుచూసిన వారికి నిరాసకలిగించింది. ఇదేంటిరా యూట్యూబ్ లో డాక్యుమెంటరీలాగ సినిమా ఉంది అన్న కామెంట్స్ థియోటర్ లో వినిపించాయి.
టెక్నికల్ గా..
సినిమాలో ఎక్కువ పాత వీడియోలో వాడటంతో...సినిమా ఎడిటింగ్ విభాగమే బాగా పనిచేసినట్లు అనిపిస్తుంది. నిజానికి సినిమా సాంకేతికంగా పై స్దాయిలోనే ఉంది. ఏ విభాగానికి వంక పెట్టేలా లేదు .ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతం సినిమాకు పాజిటివ్ మార్కులు సంపాదించిపెట్టింది. ముఖ్యంగా సచిన్ యాంథమ్ అదిరిపోయింది. ధియోటర్ నుంచి బయిటకు వస్తూ కూడా ఆ యాంధమ్ ని హమ్ చేసుకుంటూ వస్తారనటంలో అతిశయోక్తి లేదు. అయితే మరింత ఇంట్రస్టింగ్ గా ఉండేందుకు కాస్త స్క్రీన్ ప్లే విభాగం మరింత సమర్దవంతంగా పనిచేసి ఉంటే బాగుండేది.
ఫైనల్ గా...
అల్లరి పిల్లాడైన సచిన్...క్రికెట్ ను శాసించే స్థితికి ఎలా చేరాడన్నది డ్రామా లేకుండా డాక్యుమెంటరీగా చూపిన సినిమా ఇది. సచిన్ మరియు క్రికెట్ అభిమానులకు ఈ సినిమా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదు. క్రికెట్ గురించి పెద్దగా తెలియని వాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండటమే మేలు. అయితే ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకునే స్దాయికి ఎదిగిన విషయం..యువతకు స్పూర్తినిచ్చేదే..వారు మాత్రం ఖచ్చితంగా చూడాలి.