Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

The Shape of Water Movie Review

December 1, 2017
TSG Entertainment, Double Dare You Productions
Sally Hawkins, Michael Shannon, Richard Jenkins, Doug Jones, Michael Stuhlbarg, Octavia Spencer
Vanessa Taylor
Dan Laustsen
Sidney Wolinsky
Alexandre Desplat
Guillermo del Toro - J Miles Dale
Guillermo del Toro

ఆస్కార్ 2018 : బెస్ట్ పిక్చర్.. ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్’ (రివ్యూ)

ఈ సంవత్సరం ఆస్కార్ కు ఏ సినిమాకు ఆస్కారం ఉంది అనేది గత కొద్ది రోజులుగా సినీ ప్రేమికులంతా సోషల మీడియాలోనూ, సరదా చిట్ చాట్ లలోనూ డిస్కస్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గ్విలెర్మో డెల్‌ టోరో రొమాంటిక్‌ ఫాంటసీ 'ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌' చిత్రం 13 నామినేషన్‌లతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాకు అంత సీన్ లేదు. ఏదో చిన్న లవ్ స్టోరీ , అదీ కూడా ఇంతకు ముందు వచ్చేసిన సినిమాల్లాంటి కథనే, అవే క్యారక్టర్స్ ఇలాంటి సినిమాకు ఎందుకు ఆస్కార్ ఇస్తారు అని చాలా మంది పెదవి విరిచారు. దానికి తోడు ఈ సినిమా కాపీ వివాదం కూడా ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా నామినేషన్స్ నుంచే వెనక్కి తిరుగుతుంది అనుకున్నారు చాలా మంది. అయితే వాళ్ల అంచనాలు తారుమారు అయ్యాయి. తాజా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలోనూ ఈ సినిమా అగ్రభాగంలో నిలిచింది.

ప్రముఖ దర్శకుడు గిలెర్మో డెల్‌ టోరో దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ డ్రామా ‘ది షేప్ ఆఫ్‌ వాటర్‌’ ఆస్కార్‌-2018 ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 90వ అకాడమీ అవార్డు వేడుకలు ఆదివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) అట్టహాసంగా జరిగాయి. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైన్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. ఇంతలా అందరికీ తెగ నచ్చేసి ఆస్కార్ అవార్డ్ ల వర్షం కురిసేటంత విషయం ఏముంది ఈ సినిమాలో ..కథేంటి..నిజంగా అంత అర్హత ఉందా వంటి విషయాలు చూద్దాం

ఆ రోజుల్లో జరిగే అరుదైన ప్రేమ కథ

1960.. అవి అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న రోజులు. అంతరిక్షంలోనూ ఈ రెండు దేశాలకు పోటీనే. అప్పటికే రష్యా..లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపేసి కాలర్ ఎగరేస్తోంది. అది అమెరికాకు మండిపోతోంది. ఆ క్రెడిట్ ని లాగేసి తన ఖాతాలో వేసుకోవాలని తపించిపోతోంది. అందుకోసం ఓ లాబ్ పెట్టి సీక్రెట్ గా ప్రయోగాలు చేస్తూంటే..వారి మొర దేవుడు ఆలకించాడా అన్నట్లుగా.. ఒకరోజు.. ఆ ల్యాబ్‌ ఇన్‌చార్జి కల్నల్‌ రిచర్డ(మిచెల్ షానాన్‌) కి నదిలో ఓ విచిత్రజీవి దొరుకుతుంది. అది మానవరూపంలో కనిపించే ఉభయచరం. దాన్ని ని బంధించి తీసుకొస్తాడు. దానికి శిక్షణ ఇచ్చి, అంతరీక్షంలోకి పంపాలన్నది వారి ఆలోచన . అయితే ఆ ఉభయచరం ఎంతకీ మాట వినకపోవడంతో క్రూరంగా వ్యవహరిస్తూంటాడు కల్నల్‌. ఇదీ కథ బ్యాక్ గ్రౌండ్.

మెయిన్ క్యారక్టర్ ఎలీసా ఎంట్రీ

ఆ ఉభయచర వింత జీవిని బంధించిన గదిని శుభ్రం చేసేబాధ్యత ఎలీసా ఎపోసిటో (సాలీ హాకిన్స్‌ ) అనే పని అమ్మాయిది. ఆమె మూగది..నా అనేవాళ్లు లేని ఓ అనాథ. ఒంటిరి జీవితంలో ప్రేమను పంచేవాళ్లు లేక నిరాశతో నిర్లిప్తమైన పరమ రొటీన్ లైఫ్ లాగుతూంటుంది. సైగలతో కాలక్షేపం చేసే ఆమె జీవితంలోకి ఈ ఉభయచరం ఓ అద్బుతంలా ప్రవేశిస్తుంది. ఎలీసా మొదట్లో సహజమైన ఆసక్తితో వెళ్లి దాన్ని సీక్రెట్ గా చూసింది. రెండు కాళ్లు, రెండు చేతులు, శరీరం మీద మొప్పలతో నీళ్లలోనూ, నేలపైనా జీవించగలిగే ఆ వింత జీవి చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంది. ఎందుకనో ఆ మూగ ఒంటరి జీవికి, తన మూగ ఒంటరి జీవితానికి సామ్యం ఉందనిపించింది. రోజూ దాన్ని చూడటానికి వెళ్ళటం మొదలెట్టింది. తను తినే ఉడకపెట్టిన కోడి గుడ్లు పట్టుకెళ్లి పెట్టింది. ఎలీసాకు ఆ మూగ జీవికి కొన్నాళ్లకు స్నేహం ఏర్పడింది

ప్రేమ మొదలైంది

దానికి మాటలు రావు..తనకీ రావు.తనూ ఒంటరే..నేనూ ఒంటిరే..నీకూ నా వారు లేరు..నాకూ నా వాళ్లు లేరు అన్నట్లుగా ఆ వింత జీవిపై సానుభూతి, జాలి..కొద్ది రోజులకి ప్రేమగా మారతాయి. అలాంటి వింతజీవితో ప్రేమ ఏంటి అని ఆలోచించదు. తనకంటూ ఓ ప్రపంచం..ఆ వింత జీవితో క్రియేట్ చేసేసుకుంటుంది. అయితే కొద్ది రోజులకు ఆ ప్రేమకు బ్రేక్ పడే సమయం వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ జీవి లొంగకపోవటంతో ..దాంతో తమ అంతరిక్ష ప్రయోగాలు చేయలేమని నిర్ధారించుకున్న ఆ లాబ్ యాజమాన్యం...ఆ హ్యూమనాయిడ్‌ను చంపిపారేయాలనే నిర్ధారణకు వస్తారు. ఈ విషయం ఎలీసాకు తెలుస్తుంది. ఆమె గుండె గజగజా వణికిపోతుంది. ఎలాగైనా తన ఫ్రెండ్ ని రక్షించుకోవాలనుకుంటుంది.

కిడ్నాప్ చేసేద్దాం

తన గే స్నేహితుడు, తన కొలీగ్ జెల్డా సాయింతో అక్కడ నుంచి రహస్యంగా ఎత్తుకుపోవాలనుకుంటుంది. ఆ మిషన్ కు అక్కడే పనిచేస్తున్న ఆ వింతజీవి బ్రతకాలని కోరుకునే శాస్త్రవేత్త సాయిం చేస్తాడు. కొద్దిపాటి సాహసం, టెన్షన్ తో ఏ క్లూ దొరకని విధంగా ఆ వింతజీవిని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది ఆ జీవికి గొలుసుల నుంచి విముక్తి కావటం, ప్రయోగశాలలో పెట్టే హింస నుంచి తప్పించుకోవటం ఆనందమే కదా.. దాంతో సహకరిస్తుంది. ఇంటికి అయితే తప్పించి తీసుకుని వెళ్ళింది.

బాత్ టబ్ లో ఉప్పు పోసి..సముద్ర నీటి వాతావరణం క్రియేట్ చేసి అందులో ఆ జీవిని పెట్టింది. వాటర్ కండీషనింగ్ కెమికల్స్ ని శాస్త్రవేత్త సాయింతో స్మగుల్ చేసి తెచ్చుకుని ఆ ప్రెండ్ ని బ్రతికించుకుంది. మెల్లిగా కోరుకున్న తర్వాత ఓ మంచి రోజు చూసి దగ్గరలోని నదిలో వదిలేయాలని ఆమె ప్లాన్. అయితే ఆ జీవితో ఎక్కువ సేపు గడపటం మొదలెట్టింది.

విలన్ ఊరుకుంటాడా

తన ప్రయోగశాల నుంచి తప్పించుకుని పోయిన జీవిని వెనక్కి తేకపోతే ...అక్కడ చీఫ్ పరిస్దితి అంధకారంగా మారే పరిస్దితి నెలకొంది. దాంతో అతను రంగంలోకి దిగి ఆ జీవి జాడ కనిపెట్టేసాడు. కాని అదే సమయానికి ఆ వింత జీవికి అనాగోగ్యం చేసింది. ఎంతకాలం బాత్ టబ్ లో నీటితో జీవితం గడపగలదు...కథ క్లైమాక్స్ కు వచ్చింది. ఓ ప్రక్కన లాబ్ చీఫ్ ..గన్ పట్టుకుని ఎలీసాని వెతుక్కుంటూ బయిలుదేరాడు..మరో ప్రక్క ఎలాగైనా ...వింతజీవిని బ్రతికించుకోవాలనే తాపత్రయంతో దాన్ని తీసుకుని రోడ్డు మీదకు ఎక్కింది ఎలీసా.

నీళ్లళ్లో ప్రేమ పావురాలు

చివరకు ఎలీసా..తను ప్రేమను త్యాగం చేసి ఆ వింతజీవిని బ్రతికించటానికి నది దగ్గరకు చేరింది. ఆ లాబ్ చీఫ్ సైతం అక్కడికే వచ్చేసాడు. ఆమెను , ఆ వింత జీవిని కాల్చేసాడు. కానీ తనకున్న హీల్ చేసుకునే శక్తితో అది బ్రతికి తన లవర్ ఎలీసా ని బ్రతికించుకుంది.. తనను చిత్రహింసలు పెట్టి,తనను, తన గర్ల్ ప్రెండ్ ని చంపటానికి వచ్చిన లాబ్ చీఫ్ ని చంపేసింది. ఎలీసా తో కలిసి నీటిలోకి దూకేసింది. తమ ప్రేమ అమరం...అజరామరం అన్న రీతిలో వాళ్లిద్దరూ అలా నీళ్లలో కలిసిపోయారు. ‘ఆ విధంగా నీటి అడుగుభాగాన ఆ ప్రేమ జీవులు హాయిగా జీవించసాగాయి.. ’ అంటూ ‘షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ కథ ముగుస్తుంది.

ఏముంది గొప్పతనం

ఈ సినిమాలో ఏముంది గొప్పతనం..అలాంటి కథలు బోలెడు చూసేసాం కదా అని అడిగిన వారికి ..ఇది ఆ రోజుల్లో వచ్చిన హాలీవుడ్ సినిమాలకు లవ్ లెటర్ లాంటిది. అందుకే అందిరికీ నచ్చేసింది. గత జ్ఞాపకాలు ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చేవే కదా.

పాపం ఆమెకు బ్యాడ్ లక్కే

నిజానికి చాలా మంది ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఎలిసా గా కనిపించిన 41 ఏళ్ల స్యాలీ హాకిన్స్‌ కు అవార్డ్ ఖాయం అనుకున్నారు. సినిమా మొత్తం మీద ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు హాకిన్స్‌కు . మూగ భాషతోనే చెప్పాలనుకున్న విషయాలు చెప్తుంది. ఈ పాత్రలో హాకిన్స్‌ నటన ‘అద్భుతం’ అన్న కితాబులు అన్ని వైపుల నుంచీ వచ్చాయి. నామినేషన్స్‌ దక్కించుకున్న ఐదుగురిలో ఒకరైన హాకిన్స్‌కు అవార్డు దక్కే అవకాశాలు చాలానే ఉన్నాయనే అంతా అనుకున్నారు. గతంలో ఉత్తమ నటిగా ఆస్కార్‌, బాఫ్టా నామినేషన్లు సాధించింది హాకిన్స్‌. ఉత్తమ నటిగా ఆమెకు ఇదే తొలి ఆస్కార్‌ నామినేషన్‌. ఇంతకు ముందు ‘కాస్సాండ్రాస్‌ డ్రీమ్‌’, ‘బ్లూ జాస్మిన్‌’ చిత్రాలకుగానూ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ నామినేషన్లు అందుకుంది. కానీ పురస్కారం దక్కలేదు. ‘హ్యాపీ గో లక్కీ’ చిత్రం హాకిన్స్‌కు మంచి పేరైతే తీసుకొచ్చింది. అందులో తన పాత్రకుగానూ ఉత్తమ నటిగా గోల్డెన్‌ గ్లోబ్‌తో పాటు ప్రతిష్ఠాత్మక బెర్లిన్‌ చిత్రోత్సవంలోనూ పురస్కారం అందుకుంది. ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి గనక ఆమె అవార్డు అందుకుంటే ఉత్తమ నటిగా అదే ఆమెకు మొదటి అవార్డు అని అంతా కంగ్రాట్స్ కూడా ముందే చెప్పేసారు. అయితే ఈ సారి ఆమెకు ఆ అదృష్టం దక్కలేదు. ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్‌ మెక్‌డార్మమండ్‌ (త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి) సొంతం చేసుకున్నారు.

మ్యాజిక్‌ రియలిజం

వాస్తవానికి ఇలాంటి 'బ్యూటీ అండ్ ది బీస్ట్' కథలు (ఇ.టి, కింగ్ కాంగ్ ,స్ప్లాష్ లాంటివి) ప్రపంచ సినిమాకు కొత్తేమీ కాదు... కానీ ఈ కథను చెప్పిన విధానమే మిగతా సినిమాలకు ఈ సినిమాకు తేడా చూపగలగింది. వాస్తవం, కల్పన మిళితమైన మాజిక్‌ రియలిజం థోరణిలో సాగటమే ఈ సినిమా ప్రత్యేకత. ఇతివృత్తం రీత్యా ఇది చాలా సాధారణమైన కథే...కానీ శిల్పం రీత్యా ఒక ప్రయోగమే. మాజిక్‌ రియలిజం అనే లాటిన్‌ అమెరికన్‌ సాహితీ ప్రక్రియను తన సినిమాల్లో నిత్యం అనుసరించే ఈ దర్శకుడు మరింత సమర్దవంతంగా ఈ సినిమాలో వాడాడు. ముఖ్యంగా మ్యాజిక్‌ రియలిజంలో ఎన్నో కాంపొనెంట్స్‌ ఉంటాయి. చూసేవారిని మెస్మరైజ్‌ చేయడం, కన్ఫ్యూజ్‌ చేయడం వంటివి..వాటినన్నిటినీ అక్కడక్కడా వాడుతూ వచ్చాడు. కథనంగా చూస్తే సాధారణం...కథగా అసాధారణం...సాధారణమైన పాత్ర..ఎలీసా..కు అసాధరమైన లవ్ స్టోరీ..వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రయోగశాల..అందులో అవాస్తవమైన వింత జీవి..అంతా కలిసి..కొంత నిజం..మరికొంత అబద్దం..వెరికి ఓ కొత్త భ్రమ.

బెస్ట్ పిక్చర్ అవార్డ్ రావటం ఆషామాషి కాదు

ఆస్కార్ లో .. ‘బెస్ట్‌ పిక్చర్‌’కు మాత్రం ఓటింగ్‌ పద్ధతి మాత్రం కాస్తంత డిఫరెంట్ గా ఉంటుంది. మొదట ప్రిఫరెన్షియల్‌ బ్యాలెట్‌ పద్ధతిలో బెస్ట్‌ పిక్చర్‌ను ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిలో మెంబర్స్‌ను మీకిష్టమైన సినిమా ఏది అని అడగకుండా, మీకు నచ్చిన ఆర్డర్‌ ఇవ్వండి అని అన్ని సినిమాలకు ర్యాంక్‌ ఇవ్వమంటారు. అలా నామినేట్‌ అయిన అన్ని సినిమాలకు, అందరూ ర్యాంకులు ఇస్తారు. అందులో 50 శాతానికి మించి మెంబర్లు ర్యాంక్‌ 1 ఏ సినిమాకు ఇస్తారో అదే బెస్ట్‌ పిక్చర్‌ అవుతుంది.

ఒకవేళ ఏ సినిమాకూ 50 శాతం మంది ర్యాంక్‌ 1 ఇవ్వకపోతే, తక్కువమంది ర్యాంక్‌ 1 ఇచ్చిన సినిమాను ఎలిమినేట్‌ చేసి, మిగిలిన సినిమాలకు మళ్లీ ఇదే ప్రాసెస్‌ రిపీట్‌ చేస్తారు. ఏదో ఒక సినిమా 50 శాతానికి మించి ర్యాంక్‌ 1 తెచ్చుకునే వరకూ ఈ పద్దతి కొనసాగుతుంది. అప్పుడు బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు అందుకుంటుంది. అందుకే ఆస్కార్ లో బెస్ట్ పిక్చర్ సినిమా అంటే అదో క్రేజ్..

ఫైనల్ థాట్

ఆస్కార్ సాంధించాలంటే పాత రోజుల్లోకి వెళ్లి పునీతమైన కథలే ఎంచుకోవాలని గత నాలుగైదు సంవత్సరాలుగా అవార్డ్ లు సాధిస్తున్న సినిమాలను బట్టి అర్దమవుతుంది. ఈ సారి కూడా ఆ దారి తప్పలేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT